-
షాకీర్ ది గ్రేట్..!
ప్రతిభకు అంధత్వం అడ్డుకాదని నిరూపించారు ఐరాలకు చెందిన షాకీర్ అహ్మద్. పట్టుదలతో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోనూ స్థానం సంపాదించారు. అందరి చేత శెభాష్ అనిపించుకుంటూ షాకీర్ ది గ్రేట్ అని మన్ననలందుకుంటున్నారు. చిత్తూరు, రొంపిచెర్ల : ఐరాలకు చెందిన సయ్యద్ ఇస్మాయిల్, రహిమాబేగంలకు నలుగురు కుమారులు. వీరి నాలుగో సంతానం షాకీర్ అహ్మ ద్ పుట్టుకతోనే అంధుడు. కంటిచూపు కోసం కంటిచూపు కోసం ఎంతోమంది నేత్ర వైద్యులను కలసినా ఫలితం లేకపోయింది. అంధత్వం అనే లోపం ఉందని విచారిస్తూ కూర్చోక స్వయంకృషి, ఆత్మస్థైర్యంతో రికార్డులు సృష్టిస్తూ, అవార్డులను సొంతం చేసుకుంటున్నారు షాకీర్. తన కంటికి దక్కని వెలుగును ప్రస్తుతం ఇతరుల జీవితాల్లోనూ నింపుతున్నారు. విద్యాభ్యాసం.. షాకీర్ ఐదో తరగతి వరకు చెన్నై లిటిల్ ఫ్లవర్ కాన్వెంట్లో, ఆరవ తరగతి నుంచి పదో తరగతి వరకు నెల్లూరులోని సెయింట్ ఫ్రాన్సిస్ ఇంగ్లిషు మీడియం హైస్కూల్ (అంధేతరుల పాఠశాల)లో చదువుకున్నారు. అలాగే ఇంటర్, డిగ్రీ, ఎంబీఏ తిరుపతిలోని ఎస్వీ ఆర్డ్స్ కాలేజి, ఎస్వీ యూనివర్సిటీలో చదువుకుని ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించారు. ఉద్యోగ ప్రస్థానం.. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో ఎంబీఏ చదివిన మొట్టమొదటి అంధత్వ విద్యార్థిగా షాకీర్ నిలిచారు. కొద్దిరోజులు నెల్లూరులోని ఏవీఎస్ కాలేజి, విజయవాడలోని నిమ్రా కాలేజి ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. సమాజంలో తన స్వశక్తితో నిలబడాలనే ఉద్దేశంతో హైదరాబాదులో ఎంపవర్ ట్రైనింగ్ సొల్యూషన్స్ అనే సంస్థను స్థాపించారు. దేశమంతటా పర్యటిస్తూ మేనేజ్మెంట్ ట్రైనర్‌గా శిక్షణ ఇస్తూ సక్సెస్ కోచ్‌గా గుర్తింపు పొందారు. అంతర్జాతీయ సంస్థలైన మిట్సుబుషి, ఎసెండాస్, బజాజ్ అలయెంజ్, మెట్ లైఫ్ ఇస్సూరెన్స్ లాంటి సంస్థల్లోని ఉద్యోగులకు గోల్ సెట్టింగ్, టైం మేనేజ్మెంట్, లీడర్ షిప్, టీం బిల్డింగ్ మొదలైన అంశాలపై శిక్షణా తరగతులు నిర్వహిస్తూ ఉంటారు. జ్ఞాపకశక్తిని ఎలా పెంపొందించుకోవాలో తెలియజెప్పడంలోను, విద్యార్థులు, ఉద్యోగులు తమ ఆశయాలను ఎలా నేరవేర్చుకోవాలో వివరిస్తూ ఉత్తేజభరితమైన ప్రసంగాలు ఇవ్వడంలోనూ షాకీర్ సిద్ధహస్తుడు. కుటుంబం.. షాకీర్ అహ్మద్ రొంపిచెర్లకు చెందిన హజీరా కుమారై షబానాను నాలుగేళ్ల కిందట వివాహం చేసుకున్నారు. వారికి ఒక కుమారుడు అహిల్(2) ఉన్నాడు. అతని తల్లిదండ్రులు తిరుపతిలో ఉండగా, వీరు ప్రస్తుతం హైదరాబాదులో స్థిరపడ్డారు. సాధించిన అవార్డులు ♦ 2001 జనవరిలో ఖురాన్ గ్రంథాన్ని బ్రెయిలీ లిపిలో రాయడం ద్వారా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించారు. ♦ 2007 ఫిబ్రవరి 1న లో అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం నుంచి ప్రశంసాపత్రం అందుకున్నారు. ♦ 2008లో జూన్ 27న ఆంధ్రామేధావి అవార్డును తెనాలి విజ్ణానవేదిక వారు అందజేశారు. ♦ 2011 సెప్టెంబరు 30న లతారాజా ఫౌండేషన్ నుంచి గార్డియన్ ఆఫ్ గుడ్‌విల్ అవార్డు పొందారు. ♦ 2017 డిసెంబరు 9న పశ్చిమగోదావరి జిల్లా వేలూరులో అక్కినేని అంతర్జాతీయ వినూత్నరత్న అవార్డును అందుకున్నారు. -
చిన్నారి జేజెమ్మ
అరుంధతి చిత్రంలో చిన్నారి జేజెమ్మగా గుర్తింపు సంపాదించుకుంది. అపరిచితుడు చిత్రంలో సైతం మంచి పాత్ర పోషించింది. తమిళదేశంలో ఉంటున్న అచ్చ తెలుగు అమ్మాయి దివ్య. చదువును నిర్లక్ష్యం చేయకుండా.. సినిమా అవకాశాలను వదులుకోకుండా... తన ప్రతిభను ప్రదర్శిస్తోంది... కథానాయిక స్థాయికి ఎదిగింది... ప్రముఖ నేపథ్యగాయకుడు మనో కుమారుడు షకీర్‌తో జత కట్టింది. తెలుగు పత్రికకు ఇచ్చిన మొట్టమొదటి ఇంటర్వ్యూ... ఫీచర్స్ ప్రతినిధి, సాక్షి, చెన్నై 1. నటిగా మీ కెరీర్ ఎలా మొదలైంది? నా కెరీర్ ప్రకటనలతో మొదలైంది. ఆ తరవాత సీరియల్స్, సినిమాలు. బాలనటిగా మొదటి సినిమా ఉయిర్ ఒసై. కమర్షియల్‌గా మొదటి చిత్రం బోస్. ఇందులో శ్రీకాంత్, స్నేహ ప్రధాన పాత్రలు. ప్రస్తుతం డా. ఎంజీఆర్ విశ్వవిద్యాలయంలో బీబీఏ సెకండియర్ చదువుతున్నాను. 2. చదువుని నటనని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు? చిన్నప్పటి నుంచి నా గురువులు నా చదువుకి సహకరించడమే కాకుండా, నా నటన విజయవంతం కావడానికి ఎంతో సహాయపడ్డారు. ఒక్కోసారి రాత్రి హైదరాబాద్‌లో బయలుదేరి, ఉదయాన్నే చెన్నై వచ్చి, పొద్దున్నే చదువుకుని, మధ్యాహ్నం పరీక్షలు రాయవలసి వచ్చేది. నా స్నేహితులు నాకు నోట్స్ రాసిపెట్టి ఎంతగానో సహకరించారు. ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలిని. 3. మీరు తెలుగు అమ్మాయి కదా. తమిళంలో ఎక్కువ అవకాశాలు వస్తున్నాయా? తెలుగులో కూడా వస్తున్నాయా? నేను అచ్చ తెలుగు అమ్మాయిని. మా నాన్నగారిది ఆంధ్రాలోని రాజమండ్రి. అయితే అక్కడ చాలా తక్కువ రోజులు ఉన్నారు. అక్కడ నుంచి ముంబై, ఆ తరవాత చెన్నై. నా చిన్నతనం నుంచి చెన్నైలోనే ఉండడం వల్ల తమిళంలోనే నా నటన ప్రారంభించాను. తెలుగులో నటించడం నాకు చాలా ఇష్టం. నన్ను మంచి నటిగా నిలబెట్టే అవకాశాలు వస్తే తప్పక చేస్తాను. 4. ఇప్పటివరకు ఎన్ని చిత్రాల్లో నటించారు? బాలనటిగాా ఇప్పటివరకు సుమారు 35 చిత్రాల్లో నటించాను. ఇవి కూడా శంకర్, బాలూమహేంద్ర, బాలచందర్, కోడి రామకృష్ణ, ప్రభుదేవా, ఎంఎస్‌రాజు, గుణశేఖర్...వంటి పెద్ద పెద్ద దర్శకుల దగ్గర పనిచేశాను. ఇంత చిన్న వయసులో అంత పెద్ద పెద్ద దర్శకులతో పనిచేయడం నా అదృష్టం. హీరోయిన్గా ఇప్పటివరకు నాలుగు చిత్రాల్లో మాత్రమే నటించాను. మూడు తమిళ ం, ఒకటి తెలుగు. 5. ఏయే సీరియల్స్‌లో నటించారు? ఇప్పటివరకు సుమారు 25 సీరియల్స్‌లో బాలతారగా నటించాను. మధుమాసం, కా కా కీ కీ (బాలాజీ టెలిఫిల్మ్స్), గోదావరి, ఇంటింటి రామాయణం... ముఖ్యంగా అమ్మవారికి సంబంధించిన కనకదుర్గ, పాతాళభైరవి సీరి యల్స్‌లో నటించాను. ఇవే కాకుండా... జయ, చుట్టీ, రాజ్ టీవీల్లో ఎన్నో కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా పనిచేశాను. 6. త ల్లిదండ్రుల ప్రోత్సాహం... బాలతారగా నటించే రోజుల నుంచి వాళ్లే నా కెరీర్‌కి సపోర్ట్‌గా నిలిచారు. పరీక్షల సమయంలో అమ్మ నిద్రపోకుండా పక్కనే కూర్చుని నన్ను చదివించేది. మా టీచర్లు, మా పేరెంట్స్ నాకు వెన్నెముక వంటివారు. అన్నియన్ (అపరిచితుడు), అరుంధతి చిత్రాల్లో నటించేటప్పుడు నాకు ఎన్నో జాగ్రత్తలు చెప్పారు. ‘నువ్వు బాగా చేస్తే అందరూ నిన్ను గుర్తుంచుకుంటారు’ అన్నారు. నిజంగానే ఇప్పటికీ అంద రూ నన్ను ఆ రెండు చిత్రాల గురించే అడుగుతుంటారు. 7. మనో గారి అబ్బాయితో సినిమా గురించి... మనోగారి అబ్బాయి షకీర్‌తో ఒక తమిళ సినిమా చేస్తున్నాను. ఇందులో నాది బబ్లీ రోల్. ఇంతవరకు నేను చేసిన వాటన్నింటి కంటే ఈ పాత్ర భిన్నంగా ఉంటుంది. ఈ చిత్రానికి సుందర్‌గారు దర్శకత్వం వహించారు. హీరో కూడా తెలుగు ఫ్యామిలీ నుంచి వచ్చిన వారు కావడంతో ఈ షూటింగ్ చాలా సంతోషంగా చేస్తున్నాను. 8. సంగీతం, డ్యాన్స్, స్విమ్మింగ్... ఎవరి దగ్గర నేర్చుకుంటున్నారు? నాకు సంగీతమంటే ప్రాణం. ఎప్పుడైనా మనసు బాగుండకపోతే సంగీతమే న న్ను ఉత్తేజపరుస్తుంది. వీలు చిక్కినప్పుడల్లా సంగీతం వింటూనే ఉంటాను. డాన్స్ అనేది ప్రతి నటికి తప్పనిసరి. నేను ప్రభుదేవా దగ్గర భరతనాట్యం నేర్చుకున్నాను. ప్రస్తుతం సినిమాలకు సంబంధించిన డ్యాన్సులు నేర్చుకుంటున్నాను. ఆరో తరగతి చదివేటప్పుడే స్విమ్మింగ్ నేర్చుకోవడం ప్రారంభించాను. 9. అరుంధతి చిత్రానికి నంది అవార్డు అందుకున్నప్పుడు ఏమనిపించింది? ఇంకా వచ్చిన ఇతర అవార్డుల గురించి... ఈ చిత్రంలో నటించే అవకాశం రావడం నిజంగా నాకు దేవుడిచ్చిన వరంగా భావిస్తాను. ఈ పాత్రకు నాకు నంది అవార్డు వచ్చింది. ఈ చిత్రం చేసేటప్పుడు ఎన్నో సరదా సంఘటనలు జరిగాయి. మేకప్ చేయడానికి చాలా టైమ్ పట్టేది. నేను వేసుకున్న నగలు, డ్రెసెస్ అంత సులువుగా మార్చుకోవడం కుదిరేవి కావు. ఉదయం ప్రారంభమైన షూటింగ్ అర్ధరాత్రి రెండు గంటలకు పూర్తయ్యేది. అప్పటివరకు ఆ బట్టలు, నగలు మోయలేకపోయేదాన్ని. అరుంధతి చిత్రం నా జీవితంలో మర్చిపోలేను. ప్రేక్షకులు కూడా నన్ను మర్చిపోరు. ఈ చిత్రం వచ్చి ఎనిమిది సంవత్సరాలైనా, ఇప్పటికీ నన్ను చిన్న అరుంధతిగానే గుర్తుపెట్టుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. అందుకు కారణం నా కళ్లు. ఇలాంటి పాత్ర రావాలని ప్రతి ఒక్క నటీ కల కంటుంది. నాకు ఆ కల నిజమైంది. 10. ఏ భాషలో చేయాలని ఉంది. ఒక భాషలో చేయాలని నేను గోడ కట్టుకోవట్లేదు. మంచి కథ ఉండి, నటించడానికి అనువుగా ఉన్న కథ ఏ భాషలో వచ్చినా నటిస్తాను. ఇప్పటికే తెలుగు తమిళ భాషల్లో నటించాను కాబట్టి, హిందీ, మళయాళ చిత్రాల్లో నటించాలనుంది. 11. హీరోయిన్గా మీరు నటించిన మొట్టమొదటి చిత్రం ఏది? మీ మొదటి హీరో ఎవరు? నేను హీరోయిన్గా నటించిన మొదటి చిత్రం పసకర నాన్బర్గల్. సత్తైఫేమ్ యువన్‌తో నటించాను. ఈ చిత్రం బాక్సింగ్ కథ నేపథ్యంతో ఉంటుంది. ఆ చిత్రం చేసే సమయానికి నేను తొమ్మిదో తరగతి చదువుతున్నాను. కథ కూడా ఇంచుమించు ఆ వయసు అమ్మాయి చుట్టూనే నడుస్తుంది. తెలుగులో నేను హీరోయిన్గా నటించిన చిత్రం ‘నేను నాన్న అబద్ధం’. ఇందులో నందుతో కలిసి నటించాను. 12. నచ్చిన హీరో హీరోయిన్లు... సినీరంగంలో ఉన్నవారికి ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం చాలా కష్టం. నాకు చాలామంది అంటే చాలా చాలా ఇష్టం. ప్రసుత్తం నటిస్తున్న వారిలో కాజల్ అగర్వాల్, దీపికా పదుకోనే... ముందు తరం వారిలో శ్రీదేవి, జ్యోతిక నా అభిమాన తారలు. 13. డ్రీమ్‌రోల్... డ్రీమ్ రోల్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూంటుంది. నాకు మాత్రం అరుంధతి లాంటి చిత్రంలో నటించాలని కోరికగా ఉంది. బ్లాక్ చిత్రంలో రాణీ ముఖర్జీ చేసిన పాత్ర, జెనీలియా చేసే బబ్లీ పాత్రల వంటివి చేయడం ఇష్టం. 14. ఎంతవరకు చదువుకోవాలనుకుంటున్నారు? ఎంబీఏ చేయాలనుంది. చదువును మాత్రం నిర్లక్ష్యం చేయను. ఎప్పటికైనా చదువు ఉపయోగపడుతుంది. 15. మీ కుటుంబం గురించి... నేను అన్నయ్య, అమ్మ, నాన్న. మా నానమ్మ ఇటీవలే చనిపోయారు. ఆవిడతో నేను స్నేహంగా ఉండేదాన్ని. ఆవిడ నన్ను ఎంతో ప్రోత్సహించారు. మా నాన్నగారు ‘ఇండియా ట్రస్ట్ యాన్ స్పెల్‌బీ’ ఇంటర్నేషనల్ సంస్థకి సీఈవోగా పనిచేస్తున్నారు. అమ్మ ఇంటి దగ్గరే ఉంటుంది. అన్నయ్య అక్షయ్ కూడా చిన్నప్పడు నటించాడు. కాని ‘లా’ చదువుతుండడం వల్ల నటన మానేశాడు. ఇంతమంచి కుటుంబంలో పుట్టినందుకు సంతోషంగా ఉంది. మా వాళ్లు, టీచర్లు నన్ను ప్రోత్సహించడం నా అదృష్టం. -
మా పెళ్ళికి వాళ్ళిద్దరూ సాక్షులు!
ఆయన వెండితెరకు పాడతారు... బుల్లితెరపై ఆడతారు... తెర మీది తారలకు స్వరప్రతిష్ఠ చేస్తారు... ఇప్పటికీ వేదికనెక్కితే చప్పట్లు మారుమోగేలా ‘చెల్లియో చెల్లకో...’ అంటూ పద్యాల్ని దంచి కొడతారు. ఏ పని చేసినా, దాన్ని దైవంగా భావిస్తారు. అందుకేనేమో 29 ఏళ్ళ తరువాత కూడా కొత్త కుర్రాడిలా ఇప్పటికీ సాధన చేస్తారు. ముఖం మీద చిరునవ్వు... మాటలో మంచితనం మర్చిపోని మనో ఇవాళ్టికీ హాట్‌కేకే. పేరుకు ముందూ, వెనుకా ఏమీ లేకపోయినా, ఎవరికీ వారసుడు కాకపోయినా సినిమాల్లోకి సింగిల్‌గా వచ్చిన ఈ సింహం దారి రహదారి. ఇవాళ్టితో యాభయ్యోపడిలో అడుగుపెడుతున్న జనమనోహర గాయకుడు మనో ఉరఫ్ నాగూర్‌బాబు అంతరంగ ఆవిష్కరణ... నమస్కారమండీ! ఈసారి పుట్టినరోజు ఎలా జరుపుకొంటున్నారు? ఈ సారి యూరప్‌లో ఉంటానండీ! పది రోజుల పాటు నేను, చిత్ర, సాధనా సర్గమ్, మధు బాలకృష్ణన్ కలసి యూరప్‌లో పర్యటిస్తున్నాం. గమ్మత్తేమిటంటే నాలుగేళ్ళుగా పుట్టినరోజుకు విదేశాల్లో ఉంటున్నా. కావాలనే ఇలా విదేశాల్లో పుట్టినరోజు వేడుకలు ప్లాన్ చేసుకుంటున్నారా? (నవ్వేస్తూ...) అలాంటిదేమీ లేదండి! ఎందుకనో అలా కొన్నేళ్ళుగా జరుగుతోంది. నిజానికి, నా పుట్టినరోజుకు నేనెప్పుడూ చేసే పని వేరొకటి ఉంది. చెన్నైకి 50 కిలోమీటర్ల దూరంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న కుష్ఠు రోగుల ఇన్స్టిట్యూట్ ఉంది. అక్కడ వాళ్ళందరూ బలహీనంగా ఉంటారు. వాళ్ళకు నా పుట్టినరోజున మటన్ బిర్యానీ, డబుల్ కా మీఠా పంపిస్తుంటా. మా ఆవిడే స్వయంగా వండించి పంపుతుంది. నేను వాడిన దుస్తులూ అనాథాశ్రమాలకు పంపేస్తుంటా. చేతనైనంతలో సాయం చేయాలని నా కోరిక. మీరు చాలా కష్టపడి పైకి వచ్చారు. అవేవీ మర్చిపోయినట్లు లేరు! లేదు. ఆ సంగతులు నాకిప్పటికీ గుర్తే. మా అమ్మ గారి నాన్న గారు నాగూర్ సాహెబ్ నాదస్వర విద్వాంసుడు. ఆయన, ప్రసిద్ధ నాదస్వర విద్వాంసుడు షేక్ చినమౌలానా ఒకే గురువు దగ్గర ఆ విద్య నేర్చుకున్నారు. మా అమ్మ పేరు షహీదా, మా పెద్దమ్మ పేరు వహీదా. వాళ్ళిద్దరి పేరుతో కార్యక్రమాలు జరిపేవారు. గుంటూరు జిల్లా యద్దనపూడి, దొండపాడు, తదితర గ్రామాల్లో మునసబు, కరణాల ఇళ్ళ దగ్గర, రచ్చబండ్ల దగ్గరకు వెళ్ళి ప్రదర్శనలు ఇచ్చేవాళ్ళు. అక్కడ ఇచ్చిన బియ్యం, దుస్తులతో జీవితం గడిపేవాళ్ళు. ఒక్కమాటలో చెప్పాలంటే, పూట కూలీ కళాకారుల కుటుంబం మాది. మా తాత గారు 1964లో చనిపోయారు. మరుసటేడు అక్టోబర్ 26న నేను పుట్టా. అందుకే, నాగూర్‌బాబు అని ఆయన పేరే పెట్టారు. శివరాత్రికి కోటప్పకొండ తిరునాళ్ళకు కట్టిన ప్రభల్లో ఆడి, పాడేవారట! తిరునాళ్ళకు ప్రభలు కడితే, ఆ ప్రభల వెంట ఆటపాటలతో అందరినీ అలరించేవాళ్ళం. ‘‘ ‘శ్రీనివాస శివదుర్గా సత్యసాయి నాట్యమండలి’ వారిచే భరతనాట్యం కార్యక్రమం అండ్ లైట్ మ్యూజిక్’’ అంటూ ప్రచారం చేసేవాళ్ళం. అలా అన్ని గ్రామాల నుంచి ప్రభలు వస్తాయి. ప్రభల మధ్య పోటీ ఉంటుంది. మమ్మల్ని ప్రభల మీద తీసుకెళ్ళిన గ్రామస్థులు ఇచ్చిన డబ్బు వగైరానే వర్షాకాలంలో మాకు గ్రాసం. అక్కడ నుంచి పైకొచ్చాను నేను. అన్నింటినీ సహించి, భరించి ఇంత పైకి రావడం కష్టమేనే? నా దృష్టిలో ఉన్నదాంట్లో సంతోషపడేవాడి కన్నా అదృష్టవంతుడు లేడు. ఎలా సరిపోతుందని అసంతృప్తితో ఉంటే చివరకొచ్చేది రోగమే! (నవ్వుతూ) ఈ వాస్తవాన్ని తెలుసుకున్నవాడు - జ్ఞాని. తెలుసుకోనివాడు - అజ్ఞాని. మీ చిన్ననాటి రంగస్థల, సినీ అనుభవాలు చెప్పండి. నేను పుట్టింది గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో. కళాకారిణి అయిన అమ్మ షహీదా, ఆలిండియా రేడియోలో పని చేసే నాన్న రషీద్‌ల నుంచి నాకూ ఈ కళాభిరుచి వచ్చింది. పెరిగింది విజయవాడలో! చిన్నప్పుడే రంగస్థలం మీద పాత్రలు ధరించా. పాటో పద్యమో పాడితే, ప్రేక్షకులు దగ్గరకు వచ్చి, కాస్ట్యూమ్‌కు రూపాయి నోట్లు గుచ్చేవారు. చిన్నతనంలోనే నేదునూరి కృష్ణమూర్తి, రేవతీ రామస్వామి దగ్గర కొన్నాళ్ళు సంగీత శిక్షణ పొందా. విజయవాడలో సి.వి.ఆర్. హైస్కూల్లో చదువుకొన్నా. ఒక్క పదో తరగతే అయిదారుసార్లు చదివి, ఒంటికి పడక వదిలేశా (నవ్వులు...). ‘భలే బుల్లోడు’తో బాలనటుడిగా సినీ రంగంలోకి కాలుమోపా. దాసరి గారి ‘నీడ’, అలాగే ‘జాతర’, ‘తరం మారింది’ చిత్రాల్లో నటించా. కృష్ణంరాజు ‘రంగూన్ రౌడీ’లో, మోహన్‌బాబు ‘కేటుగాడు’లో బాల హీరో నేనే! తర్వాత సంగీత దర్శకుడు చక్రవర్తి దగ్గర అసిస్టెంట్‌గా చేయడం, సినిమా సింగర్ రావడం - మరో కథ. సినీ రంగంలో మీకు తొలి అవకాశాలిచ్చినవారి గురించి...? సినీ సంగీతంలో ఓనమాలు దిద్దించింది - చక్రవర్తి గారు. నేను ఇన్ని విద్యలు నేర్చుకోవడానికి కారణం ఆయన. ఆ మహానుభావుడి దగ్గర నేను మొదటి అసిస్టెంట్నైతే, నాకు అసిస్టెంట్లుగా కీరవాణి, ‘వందేమాతరం’ శ్రీనివాస్ ఉండేవారు. అంతా ఒక కుటుంబంలా ఉండేవాళ్ళం. ఇక, తమిళంలో నాకు పిలిచి, పాటలిచ్చి ప్రోత్సహించిన గొప్పవ్యక్తి - ఇళయరాజా. తెలుగులో మంచి పాటలిచ్చింది రాజ్. కొంత పాటల జాబితా మిస్ అవగా, ఇన్నేళ్ళలో ఇప్పటి దాకా అన్ని భాషల్లో కలిపి 24,742 పాటలు పాడినట్లు లెక్క ఉంది. ఇవికాక ప్రైవేట్ పాటలు వేరే! గాయకుడిగా నాకిది 29వ సంవత్సరం. ఇన్నేళ్ళ తరువాత కూడా అదే ఉత్సాహంతో ఎలా పాడుతున్నారు? చూడండి. ఇక్కడ సాధన ముఖ్యం. పాకిస్తాన్లో ప్రసిద్ధ గజల్ గాయకుడైన గులాం అలీ గారు తన బృందంతో ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా, మళ్ళీ మధ్యాహ్నం భోజనం - విశ్రాంతి అయ్యాక మొదలుపెడితే రాత్రి దాకా హార్మోనీ మీద పాటలు సాధన చేస్తూనే ఉంటారు. ప్రతి రోజూ ఇదే దినచర్య. కళ మనకు జీవితాన్నిస్తోందన్న స్పృహ ఉన్న ప్రతి ఒక్కరూ సాధన చేస్తూనే ఉంటారు. నేనూ ప్రస్తుతం రోజూ ఉదయం లేవగానే ముప్పావు గంట గాత్ర సాధన చేస్తున్నా. దీనివల్ల వయసు మీద పడుతున్నా, గొంతు మీద పట్టు పోదు. దీర్ఘకాలం గాయకులుగా కొనసాగగలుగుతాం. మీ దృష్టిలో గానమంటే... అది కూడా ఒక యోగం. ఎందుకంటే, గానం కూడా శ్వాస మీద నియంత్రణకు సబంధించిన విషయమే కదా! రోజూ ఉదయం వేళ సాధన చేస్తుంటే, దేవుడికి అభిషేకం చేస్తున్న భావన కలుగుతుంది. ఒక పక్కన గానం ప్రాక్టీస్ చేస్తూనే, మరోపక్క టీవీలో ఉదయం వచ్చే భక్తి, స్తోత్ర కార్యక్రమాలను ఆడియో లేకుండా చూస్తుంటా. అలా దైవాన్ని చూస్తూ పాడడం వల్ల ఇటు సాధనా అవుతుంది. అటు ఆధ్యాత్మిక భావమూ కలుగుతుంది. హఠాత్తుగా హైపిచ్ పాట ఛాన్సొచ్చినా, ఇబ్బంది పడకుండా పాడేస్తాను. ఇవాళ టీవీలో చాలా సింగర్స్ షోలు వచ్చాయి. ఉపయోగం ఉందంటారా? నూతన సంగీత ప్రతిభావంతులకు మీడియా పెద్దపీట వేస్తోంది. వాళ్ళకు వేదిక లభిస్తోంది. అలాగే, వారు పాత పాటలు పాడడం వల్ల ఆ సినిమాలనూ, ఆర్టిస్టులనూ, గాయకులనూ గుర్తు చేసుకోవడం వల్ల చాలా మేలు జరుగుతోంది. సీనియర్ గాయనీ గాయకులు జడ్జీలుగానో, కార్యక్రమంలో ముఖ్య అతిథులుగానో మళ్ళీ వార్తల్లోకి వస్తున్నారు. వారికీ కాస్త పని దొరుకుతోంది. హిందీ టీవీ చానళ్ళలో మొదలైన ఈ సంస్కృతి ఇప్పుడు దక్షిణాది భాషలన్నిటిలో ప్రముఖంగా కొనసాగుతోంది. చాలా మంది కొత్తవాళ్ళు రావడంతో సినిమాలకే కాక, ప్రైవేట్ ఆల్బమ్స్కూ, గజల్స్‌కూ ఉపయోగమే. కానీ, ఇలా తెరపైకి వస్తున్నవాళ్ళలో నిలబడుతున్నవాళ్ళు ఎందరంటారు? మేము సినీ రంగానికొచ్చినప్పుడు అవకాశాలు చాలా తక్కువ ఉండేవి. ఇవాళ ఇలా రకరకాల రంగాల వల్ల అవకాశాలు వచ్చినట్లు కనబడుతున్నాయి. కానీ, ఇప్పుడు నలుగురితో పాటు నారాయణలా ఉంటే ఉపయోగం లేదు. అదనపు ప్రతిభ ఉంటేనే ఎవరైనా నీ వైపు చూస్తారు. ప్రతి ఒక్కరికీ వాళ్ళకంటూ ఒక టైమ్ వస్తుంది. అప్పటి దాకా కృషి చేస్తూ, ఛాన్సొచ్చినప్పుడు అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఒకరికి జీవితంలోని ఫస్టాఫ్‌లో ఆ బ్రేక్ వస్తుంది. మరికొందరికి సెకండాఫ్‌లో వస్తుంది. హీరోలు విక్రమ్, రవితేజ లాంటి వాళ్ళకు ద్వితీయార్ధంలో బ్రేక్ వచ్చింది. ప్రతిభ, ప్రవర్తన బాగుండి, మంచితనం ఉంటే ఎవరూ మనల్ని మర్చిపోరు. మరి, మీ జీవితంలో ఫస్టాఫ్ బాగుందా? లేక సెకండాఫ్ బాగుందా? (నవ్వేస్తూ...) జీవిత ప్రథమార్ధంలో వచ్చిన ప్రతి కష్టాన్నీ సుఖంగా మలుచుకున్నా. ప్రభల్లో పాటలు పాడడం దగ్గర నుంచి సినీ నేపథ్య గాయకుడిగా 14 భారతీయ భాషల్లో పాడే స్థాయికి ఎదిగా. సింహళ, మలాయ్ భాషల్లోనూ పాడా. ఇక, ఇప్పుడీ సెకండాఫ్‌లో టీవీ చానల్స్‌లో కొత్తగా వస్తున్న పిల్లలకు పాటల్లో మెలకువలు చెప్పడం, జడ్జిగా సలహాలివ్వడం - ఇదంతా ఒక కొత్త అనుభూతి. సినీ గాయకుడిగా ఈ 29వ సంవత్సరంలో కూడా పాటలు పాడుతూ, రేసులోనే ఉన్నా. అంతకు మించి ఇంకేం కావాలి! ఇక్కడ నుంచి ఏ దిశగా మీ ప్రస్థానం? టీవీలో యాంకర్‌గా, జడ్జీగా కూడా బిజీగా ఉన్నా. త్వరలోనే పూర్తి స్థాయిలో గజల్ గాయకుడిగా, ఆల్బమ్‌ల నిర్మాతగా విస్తరించాలని ఆలోచన. ‘టీ’ సిరీస్ లాగా సంస్థ పెట్టి, ఔత్సాహిక కళాకారులతో భక్తి ఆల్బమ్‌లు రూపొందించాలని ఉంది. ఒకప్పటి లాగా క్యాసెట్లు, సీడీలు కాకపోయినా, పాటకు పైసా వంతున ఇంటర్నెట్ ద్వారా డౌన్లోడ్ చేసుకొనే సౌకర్యం పెట్టి, దేశదేశాలకూ సంగీతాన్ని విస్తరించవచ్చు. దేవుడెటు నడిపిస్తాడో చూడాలి. కమలహాసన్, రజనీకాంత్ లాంటి వాళ్ళకు స్వరదానం అనుభవం మాటేమిటి? రజనీకాంత్ లాంటి స్టార్‌కు నేనే కాదు ఎవరు డబ్బింగ్ చెప్పినా, పాపులర్ అవుతారు. ‘నా దారి రహదారి’ లాంటి డైలాగులున్న ‘నరసింహ’లోని నా డబ్బింగ్ విని, ఆయన తమిళ శైలికి భిన్నంగా ఉన్న నా తెలుగు పద్ధతే కరెక్ట్ అని రజనీకాంతే మెచ్చుకోవడం ఎప్పటికీ మర్చిపోలేను. అలాగే, ‘శివాజీ’, ‘రోబో’, తాజాగా హిందీ ‘కొచ్చడయాన్’కు కూడా నేనే డబ్బింగ్. కమల్‌కు సైతం ‘సతీ లీలావతి’, ‘బ్రహ్మచారి’ లాంటి వాటిల్లో చెప్పా. కమల్‌కు ఎక్కువగా డబ్బింగ్ చెప్పే ఎస్పీబీ నా కన్నా ఆ చిత్రాలకు మనోయే కరెక్ట్ అని సూచించారు. గోదావరి యాసలో డబ్బింగ్ ఎంతో పేరు తెచ్చింది. పిల్లలతో మీరు చేసిన ‘పిల్లలు... పిడుగులు’ బాగా పేరు తెచ్చింది. ఆపేశారేం? జెమినీ టీవీలో ఆ కార్యక్రమానికి పేరొచ్చిన మాట నిజమే. కానీ, రోజూ చాలా గంటలు నిలబడి ఆ షోను హోస్ట్ చేయడం శారీరకంగా చాలా శ్రమ. నాలుగైదేళ్ళ చిన్న పిల్లలను లాలిస్తూ, బుజ్జగిస్తూ, వాళ్ళు మంచి మూడ్‌లో ఉన్నప్పుడు కార్యక్రమం చిత్రీకరించడం అంత తేలికైన పని కాదు. అప్పటికీ ఏడాదిన్నర పైనే చేశాం. ఎంతో కష్టం ఉన్నా ఆ షో ఓ మంచి అనుభూతి. ఇన్ని చేశారు. సంగీత దర్శకత్వం మీద శ్రద్ధ పెట్టలేదేం? (నవ్వేస్తూ...) ఇచ్చిన పాటలు నేర్చుకొని పాడేయడంలో ఉన్న సౌకర్యం సినీ సంగీత దర్శకత్వంలో లేదు. అయినా రాబోయే రోజుల్లో చేపట్టే గజల్స్, భక్తి ఆల్బమ్‌ల ద్వారా బాణీలు అందించే అవకాశం ఎలాగూ ఉంది. ఇన్ని రకాల పాత్రలు పోషించిన మీకు అత్యంత సంతృప్తికరమైన అంశం? పాటలు పాడడమే! అంతకు మించి సంతృప్తి నాకు మరొకటి లేదు. కానీ, సొంత ముద్రను మర్చిపోయేలా బాలూ గొంతు మీపై ముద్ర వేసిందే? బాలూ గారి ప్రభావం నా మీద ఎప్పుడూ ఉంటుంది. ఆయన వాయిస్ కల్చర్‌కు దగ్గరగా నాది ఉండేది. దాంతో, కెరీర్ తొలి రోజుల్లో నేను పాడిన పాటలు కూడా బాలూ గారి పాటలుగానే అంతా భావించేవారు. అది కొన్నిసార్లు మైనస్ అయినా, కొన్నిసార్లు ప్లస్ కూడా అయింది. కానీ మీరు బాలూను అనుకరించారంటూ... (మధ్యలోనే అందుకుంటూ...) అది అనుకరణ కాదు. పుట్టుకతోనే నా గొంతు స్వభావం ఆయన స్వరానికి దగ్గరగా ఉంటే అది నా తప్పంటారా? అందుకే, రెండు గొంతులూ ఒకే రకంగా వినిపించేవి. తర్వాతర్వాత జనం నా గొంతును విడిగా గుర్తించడం మొదలుపెట్టారు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, మీకు ఏమనిపిస్తుంది? ప్రతిరోజూ వెనక్కి తిరిగి చూసుకుంటూనే ముందుకెళుతున్నా. ఎక్కి వచ్చిన మెట్లు, చిన్ననాటి స్నేహాలు మర్చిపోలేదు. నా చిన్నప్పటి స్నేహితులు పది, 15 మంది ఇప్పటికీ నాకు ఆత్మీయ మిత్రులే. వాళ్ళలో ఒక రిక్షావాడు ఉన్నాడు. ఇప్పటికీ విజయవాడకు వెళితే నా హోటల్‌కు వచ్చి, నేరుగా మంచం మీద కూర్చొని, ‘ఏరా! నాగూర్!’ అనేంత చనువు మా మధ్య ఉంది. నాగూర్ నుంచి మనో అయిన తరువాత కూడా ఇప్పటికీ నాలో మార్పు లేదు. అహం లేదు. అవి గనక మొదలైతే వాళ్ళే మనల్ని దూరం పెడతారు. కొత్తగా వచ్చేవాళ్ళకు అనుభవాన్ని రంగరించి మీరు చెప్పే పాఠం? జీవితంలో ప్రతిచోటా సర్దుబాటుంటుంది. ఇక్కడా అంతే. అడ్డంకుల్ని నాజూగ్గా దాటుకొంటూ వెళ్ళాలి. అలాంటప్పుడు ఒక మంచి మిత్రుడు చెప్పే మాట, ఇచ్చే సలహా ముఖ్యం. అలా కాకుండా, నోరు జారినా, కోపతాపాలు చూపించినా పైకి ఏమీ అనరు కానీ, అవకాశాలే రావు. ఎప్పుడడిగినా, ‘చూద్దాం... చేద్దాం’ అంటూ ఉంటారు. మనం ప్రవర్తనలో తేడా చూపించినదాని ఫలితం అది. ఆ సంగతి అర్థమయ్యేసరికి పుణ్యకాలమైపోతుంది. ఈ రంగంలో రోషం చూపితే ఏదీ సాధించలేమని ఒక పెద్దాయన చెప్పాక ప్రవర్తన మార్చుకున్నా. ఒక్క మాటలో, ఇక్కడ ‘నీ శాంతమే నీకు రక్ష’. మా పెళ్ళికి వాళ్ళిద్దరూ సాక్షులు! నాకు 19 ఏళ్ళ వయసులోనే పెళ్ళయింది. మా ఆవిడ పేరు - జమీలా. వాళ్ళది తెనాలి. ఆ ఊళ్ళోనే సంప్రదాయ ముస్లిమ్ పద్ధతిలో వివాహం జరిగింది. అది 1985 జూన్ 9వ తేదీ. నా జీవితంలో ఇప్పటికీ అది మరపురాని తేదీ. సాక్షాత్తూ మా గురువు చక్రవర్తి గారు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు వచ్చి, సాక్షి సంతకాలు చేశారు. మా పిల్లలకు కూడా సినిమా రంగంలో అభిరుచి ఎక్కువ. మా పెద్దవాడు షకీర్ ఇప్పటికే రెండు తమిళ సినిమాల్లో నటిస్తున్నాడు. ఇంకో నాలుగైదు నెలల్లో అవి విడుదలవుతాయి. ఇక, చిన్నవాడు రతేశ్ కూడా సినిమాల్లోకి వస్తున్నాడు. మా అమ్మాయి సోఫియా డిగ్రీ ఫస్టియర్ చదువుతోంది. అమ్మాయికి పాడడం మీద ఆసక్తి ఎక్కువ. నేర్చుకున్నది లేకపోయినా, మా రక్తంలో ఉన్న కళ ఎక్కడికి పోతుంది! ఇప్పటికే అమెరికా వచ్చి, ‘స్వరాభిషేకం’ కార్యక్రమంలో పాటలు పాడింది. నా వారసులుగా వీరంతా సినిమాల్లోకి వచ్చారు. వాళ్ళ గొంతులో నా పాట కొనసాగుతుంది. - రెంటాల జయదేవ
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- అవన్నీ అపోహలే
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్‌స్టాప్‌గా... జెట్ స్పీడ్‌లో
- ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
Advertisement