● రేపటి నుంచి విధులకు గైర్హాజరు ● డైరెక్టర్‌కు సమ్మె నోటీస్‌ అందజేత ● ఎమర్జెన్సీ సేవలకు మాత్రం ఓకే.. ● సమస్యల పరిష్కారం కోసమే స్ట్రైక్‌ ● రిమ్స్‌లో రోగులకు తప్పని అవస్థలు | Sakshi
Sakshi News home page

● రేపటి నుంచి విధులకు గైర్హాజరు ● డైరెక్టర్‌కు సమ్మె నోటీస్‌ అందజేత ● ఎమర్జెన్సీ సేవలకు మాత్రం ఓకే.. ● సమస్యల పరిష్కారం కోసమే స్ట్రైక్‌ ● రిమ్స్‌లో రోగులకు తప్పని అవస్థలు

Published Mon, Apr 10 2023 2:30 AM

- - Sakshi

ఆదిలాబాద్‌టౌన్‌: రాజీవ్‌గాంధీ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (రిమ్స్‌)లో పనిచేస్తున్న జూనియర్‌ డాక్టర్లు (జూడాలు) సమ్మెబాట పట్టేందుకు సిద్ధమయ్యారు. ప్రభుత్వం సమస్యలు పరిష్కరించనందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఈనెల 11నుంచి సమ్మెకు దిగుతున్నట్లు రిమ్స్‌ డైరెక్టర్‌కు నోటీస్‌ అందజేశారు. సోమవారం రాష్ట్ర నాయకులతో మరోసారి చర్చించి భవిష్యత్‌ ప్రణాళిక రూపొందించనున్నారు. కాగా, అత్యవసర సేవలు మినహా రెగ్యులర్‌ విధులకు హాజరుకాబోమని స్పష్టం చేస్తున్నారు. జూడాల సమ్మెబాట ప్రభావం రోగులపై పడనుంది. రిమ్స్‌ ఆస్పత్రిలో జూనియర్‌ డాక్టర్లు, హౌస్‌సర్జన్‌లే ముందుండి రోగులకు సేవలందిస్తున్నారు. సీనియర్‌ వైద్యులు ఉన్నప్పటికీ చాలామంది మధ్యాహ్నమే ఇంటిబాట పడుతుండడంతో వీరే రోగులకు దిక్కవుతున్నారు. 24 గంటల పాటు అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్నారు.

ఎమర్జెన్సీ సేవలు మాత్రమే..

రిమ్స్‌లో 40 మంది జూనియర్‌ డాక్టర్లు పనిచేస్తున్నారు. వీరితో పాటు 120 మంది హౌస్‌సర్జన్లు, 100 మంది దాకా సీనియర్‌ వైద్యులున్నారు. ఇప్పటికే రిమ్స్‌లో ఖాళీల కొరతతో రోగులకు పూర్తిస్థాయి వైద్యసేవలు అందకుండా పోతున్నాయి. దాదాపు 50కంటే ఎక్కువ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జూనియర్‌ డాక్టర్లు 24గంటల పాటు డ్యూటీతో పాటు షిఫ్టుల వారీగా విధులు నిర్వహిస్తున్నారు. జనరల్‌ సర్జరీ, ఆర్థోపెడిక్‌, గైనిక్‌ విభాగంలో సేవలందిస్తుండగా, ఈఎన్టీ, ఆప్తమాలజీ, బయోకెమిస్ట్రీ, పాథాలజీ తదితర విభాగాల్లో ఆన్‌కాల్‌ డ్యూటీ కూడా నిర్వర్తిస్తున్నారు. ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకపోవడంతో తెలంగాణ జూనియర్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సమ్మెకు దిగనున్నారు. సోమవారం వరకు ప్రభుత్వం నుంచి స్పందన లేకపోతే మంగళవారం నుంచి ఆందోళనకు దిగనున్నట్లు స్పష్టం చేశారు.

అవస్థలు ఎదుర్కోనున్న రోగులు

ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాలో పేదలకు వరప్రదాయినిగా ఉన్న రిమ్స్‌ ఆస్పత్రిలో జూనియర్‌ డాక్టర్లు సమ్మెబాట పడితే రోగులకు ఇబ్బందులు తలెత్తనున్నాయి. సీనియర్‌ వైద్యులు ఉన్నప్పటికీ వారిలో చాలామంది ఉదయం 10గంటలకు విధులకు హాజరై మధ్యాహ్నమే ఇంటిబాట పడుతున్నారు. ఈ విషయం జిల్లా అధికారులతో పాటు రాష్ట్రస్థాయి అధికారులకు తెలిసినప్పటికీ చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. రిమ్స్‌లో ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన హౌస్‌సర్జన్లు, జూనియర్‌ డాక్టర్లతోనే కాలం వెల్లదీసే దుస్థితి నెలకొంది. మరోవైపు జూనియర్‌ డాక్టర్లు సమ్మె చేపడితే రోగులకు నామమాత్రంగా వైద్యసేవలు అందే పరిస్థితి. ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరం జూనియర్‌ డాక్టర్లు రిమ్స్‌లో అవుట్‌పేషెంట్‌, ఇన్‌పేషెంట్‌, అత్యవసర సేవలతో పాటు సర్జరీలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సమ్మెకు దిగితే పేద ప్రజలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం లేకపోలేదు.

ఇవీ.. డిమాండ్లు

ప్రథమ సంవత్సరం జూనియర్‌ డాక్టర్లు 2022 నవంబర్‌లో విధుల్లో చేరారు. ఆరు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ప్రభుత్వం వేతనాలు చెల్లించలేదు. అలాగే ద్వితీయ, తృతీయ సంవత్సరం జూడాలకు డిసెంబర్‌ నుంచి వేతనాలు రావడం లేదు. దీంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వారు వాపోతున్నారు. నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ ఆదేశాల మేరకు తాము డిస్ట్రిక్ట్‌ రెసిడెన్సీ ప్రోగ్రాం (డీఆర్పీ) విధులు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేస్తున్నారు. అయితే ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లా పరిధిలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో మూడు నెలల పాటు ద్వితీయ సంవత్సరం తర్వాత విధులు కేటాయిస్తున్నారని, వసతి, భోజన సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌, కేరళ రాష్ట్రాల్లో ఈ సౌకర్యాలు కల్పిస్తున్నారని, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ప్రతీ రెండేళ్లకోసారి జూనియర్‌ డాక్టర్లకు 15శాతం వేతనాలు పెంచాల్సి ఉండగా, ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జూడాలకు రూ.51వేల వేతనం చెల్లిస్తున్నారని చెబుతున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement