TS Bodhan Assembly Constituency: TS Election 2023: సై అంటున్న బీఆర్‌ఎస్‌ క్యాండెట్లు
Sakshi News home page

TS Election 2023: సై అంటున్న బీఆర్‌ఎస్‌ క్యాండెట్లు

Published Thu, Aug 24 2023 1:24 AM

- - Sakshi

ఆదిలాబాద్‌: బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల జాబితా ఇప్పటికే ప్రకటించడంతో ఇక ప్రత్యర్థులు ఎవరనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది. ప్రధానంగా కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థులు నియోజకవర్గం వారీగా ఎవరుంటారనే దానిపై దృష్టి నెలకొంది. అధికార పార్టీ పరంగా ఆదిలాబాద్‌ నుంచి ఎమ్మెల్యే జోగు రామన్న, బోథ్‌ నుంచి అనిల్‌ జాదవ్‌ పేర్లను ఆ పార్టీ అధిష్టానం ప్రకటించింది. కాంగ్రెస్‌ పరంగా హైదరా బాద్‌లో గాంధీ భవన్‌ వేదికగా నియోజకవర్గం వారీ గా దరఖాస్తు ప్రక్రియ సాగుతుంది. బీజేపీలో ఆశావహులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

హస్తం పార్టీలో పోటాపోటీ..
హస్తం పార్టీలో గాంధీభవన్‌ వేదికగా నియోజకవర్గం వారీగా ఈనెల 18 నుంచి ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ ప్రక్రియ ఈనెల 25 వరకు కొనసాగనుంది. ఆదిలాబాద్‌ నియోజకవర్గం నుంచి జిల్లా అధ్యక్షుడు సాజిద్‌ఖాన్‌, ఏఐసీసీ సభ్యురాలు గండ్రత్‌ సుజాత, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ సంజీవ్‌ రెడ్డి, ఎన్‌ఆర్‌ఐ కంది శ్రీనివాస్‌ రెడ్డిలు ఇప్పటికే దరఖాస్తు చేసుకోగా, ఆదిలాబాద్‌కు చెందిన గ్రామీణ బ్యాంక్‌ రిటైర్డ్‌ మేనేజర్‌ కె.దామోదర్‌ రెడ్డి బుధవారం దరఖాస్తు చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇక బోథ్‌ నుంచి సైతం దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. ఏఐసీసీ సభ్యుడు డాక్టర్‌ నరేష్‌ జాదవ్‌, నేతలు ఆడె గజేందర్‌, వన్నెల అశోక్‌ ముందు నుంచి టికెట్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. వారు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు. కాగా ఇచ్చోడ మండలానికి చెందిన కుమ్ర కోటేశ్వర్‌, నేరడిగొండ మండలం బుగ్గారం సర్పంచ్‌ జాదవ్‌ వసంత్‌రావు, బజార్‌హత్నూర్‌కు చెందిన జల్కె పాండురంగ్‌, గుడిహత్నూర్‌ మండలం సీతాగోందికి చెందిన దౌలత్‌రావుతో పాటు జహీరాబాద్‌కు చెందిన యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శివరాథోడ్‌ కూడా దరఖాస్తు చేసుకున్నారు. కాగా మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్‌ కూడా బోథ్‌ నుంచి పోటీ చేయాలని ఆసక్తి కనబర్చుతున్నట్లు పార్టీలో ప్రచారం ఉంది. అయితే ఆయన దరఖాస్తు చేసుకున్న విషయం తెలియరాలేదు.

బీజేపీలో ప్రయత్నాలు ముమ్మరం..
కమలం పార్టీలోనూ ఆశావహులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఆదిలాబాద్‌ నుంచి పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయల్‌ శంకర్‌, జెడ్పీ మాజీ చైర్‌ పర్సన్‌ చిట్యాల సుహాసినిరెడ్డి టికెట్‌ కోసం యత్నిస్తున్నారు. తాజాగా తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. బోథ్‌ నుంచి సాకటి దశరథ్‌, బలరాం జాదవ్‌, ఆడె మానాజీ తమ ప్రయత్నాలు తీవ్రతరం చేశారు.

ఇదిలా ఉంటే పార్టీలో ప్రస్తుతం ఎంపీలుగా వ్యవహరిస్తున్న వారు ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలని అధిష్టానం ఆదేశాలు ఉన్న దృష్ట్యా ఎంపీ సోయం బాపురావు బోథ్‌ నుంచే బరిలోకి దిగుతారా.. లేనిపక్షంలో ఆయన ఆసక్తి ఎలాంటిదన్న విషయంలో స్పష్టత లేదు. ఏదేమైనా ఈ పార్టీ పరంగా జాబితా తయారీలో అధిష్టానం ఇప్పటికే నిమగ్నం కావడంతో అందరి దృష్టి నెలకొంది.

Advertisement
Advertisement