బతుకమ్మలను చూసేందుకు వెళ్తూ.. | Sakshi
Sakshi News home page

బతుకమ్మలను చూసేందుకు వెళ్తూ..

Published Wed, Oct 25 2023 12:22 AM

- - Sakshi

ఆదిలాబాద్: పండుగ సెలవులకు ఇంటికి వచ్చి బతుకమ్మ వేడుకలను తిలకించేందుకు స్కూటీపై వెళ్తున్న సమయంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని మృత్యువాతపడిన సంఘటన జన్నారం మండలం పొనకల్‌ గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. కుటుంబ సభ్యులు, ఎస్సై సతీశ్‌ వివరాల ప్రకారం.. పిప్పర్ల గంగన్న సోమవారం రాత్రి 8గంటల ప్రాంతంలో తన కూతురు పిప్పర్ల రాహిత్య(15) తన ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని ప్రధాన రహదారి రేండ్లగూడ వైపు గల తన బంధువు బీట్‌ అధికారి తరాల్ల సాగర్‌, జ్యోత్స్న దంపతుల ఇంటికి వచ్చాడు.

వారి కూతురు తరాల్ల సాత్విక(18) బైక్‌పై ఎక్కించుకుని ప్రధాన రహదారిపై వెళ్తున్నాడు. చెక్కపెల్లికుంట వద్ద ఎదురుగా వచ్చిన గుర్తు తెలియని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అమ్మాయిలు బైక్‌పై నుంచి ఎగిరిపడ్డారు. గంగన్న బైక్‌ పక్కనే పడిపోయాడు. విషయం తెలుసుకున్న కుటుంబీకులు తీవ్రగాయాలతో అపస్మారకస్థితిలో ఉన్న ముగ్గురిని కరీంనగర్‌ ఆస్పత్రికి తరలించారు. అంతలోనే రాహిత్య మృతి చెందింది. గంగన్నకు తీవ్రగాయాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. రాహిత్య పదో తరగతి చదువుతుండగా సాత్విక నీట్‌ కోచింగ్‌ తీసుకుంటుంది. రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. పుప్పర్ల గంగన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

పలువురి పరామర్శ
ఇద్దరు అమ్మాయిల మృతి విషయం తెలుసుకుని ఎమ్మెల్యే రేఖానాయక్‌ మంగళవారం ఇరు కుటుంబాలను పరామర్శించారు. తరాల్ల సాత్విక ఇంటికి వెళ్లి కుటుంబీకులను ఓదార్చారు. ఎమ్మెల్యేను చూసి రోదించిన సాత్విక తల్లి జ్యోత్స్నను చూసి ఎమ్మెల్యే కన్నీరు పెట్టుకున్నారు. అదే విధంగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన ఎమ్మెల్యే రేఖానాయక్‌ ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని ఎస్సై సతీశ్‌ను ప్రశ్నించారు. అదే విధంగా బీఆర్‌ఎస్‌ ఖానాపూర్‌ నియోజకవర్గ అభ్యర్థి జాన్సన్‌ నాయక్‌ మృతుల కుటుంబీకులను పరామర్శించారు. అటవీశాఖ సిబ్బంది, పలువురు నాయకులు, అధికారులు మృతుల కుటుంబీకులను పరామర్శించారు.

Advertisement
Advertisement