Sakshi News home page

డిజిటల్‌ దిశగా..

Published Wed, Nov 15 2023 1:50 AM

కంప్యూటర్‌విద్య నేర్చుకుంటున్న విద్యార్థులు (ఫైల్‌) - Sakshi

● సర్కారు బడుల్లో మరోసారి కంప్యూటర్‌ విద్య ● జిల్లాలో 60 పాఠశాలల్లో అమలుకు చర్యలు ● విద్యార్థులకు దక్కనున్న ప్రయోజనం

ఆదిలాబాద్‌టౌన్‌: సర్కారు బడులను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కంప్యూటర్‌ విద్యకు మరోసారి శ్రీకారం చుట్టింది. గతంలో అమలులో ఉన్నప్పటికీ అనుకున్న స్థాయిలో విద్యార్థులకు ప్రయోజనం చేకూరలేదు. నిర్వహణ బాధ్యతలు చూసిన సంస్థ గడువు ముగియడం, కంప్యూటర్లు మూలన పడడంతో అటకెక్కింది. కంప్యూటర్‌ విద్య పరంగా పీజీఐడీ (పర్ఫామెన్స్‌ గ్రేడింగ్‌ ఇన్‌డెక్స్‌ ఫర్‌ డిస్ట్రిక్ట్‌) సర్వే చేయగా సాంకేతిక విద్య పరంగా వెనుకబడి ఉందని నిర్ధారించింది. ఈ క్రమంలో విద్యాశాఖ మరోసారి డిజిటల్‌ దిశగా దృష్టి సారించింది. 2022–23 విద్యా సంవత్సరంలో భాగంగా జిల్లాలో సమగ్ర శిక్ష ద్వారా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు చర్యలు చేపడుతోంది. మన ఊరు– మనబడి కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఎంపికై న పాఠశాలలకు డిజిటల్‌ చదువులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. గతంలో జిల్లాలో 54 పాఠశాలల్లో కంప్యూటర్‌ విద్య అమలులో ఉండగా, ఈ విద్యా సంవత్సరం నుంచి 60 పాఠశాలల్లో అమలుకు శ్రీకారం చుట్టనున్నారు.

60 పాఠశాలలకు కంప్యూటర్లు..

జిల్లాలో 60 పాఠశాలల్లో కంప్యూటర్‌ విద్య బోధించేందుకు రాష్ట్ర విద్యా శాఖాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. వీటిలో 12 కేజీబీవీలు, 2 మోడల్‌ స్కూళ్లు, ఒక స్పోర్ట్స్‌ స్కూల్‌, 3 ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలు, 42 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ఆదిలాబాద్‌రూరల్‌ మండల పరిధిలో 3, ఆదిలాబాద్‌అర్బన్‌ మండలంలో 8, బజార్‌హత్నూర్‌లో 2, బేలలో 4, భీంపూర్‌లో 2, బోథ్‌లో 5, గుడిహత్నూర్‌లో 4, ఇచ్చోడలో 4, ఇంద్రవెల్లి మండలంలో 1, జైనథ్‌లో 9, మావలలో 1, నార్నూర్‌లో 2, నేరడిగొండ 3, సిరికొండ 1, తలమడుగు 5, తాంసిలో 2, ఉట్నూర్‌లో 5 పాఠశాలలను ఎంపిక చేశారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పాఠశాలలకు కంప్యూటర్లు సమకూర్చనున్నారు. ఈ ప్రకారం ప్రభుత్వ డైట్‌ కళాశాలకు 10, అలాగే 13 పాత మండలాల ఎమ్మార్సీలకు 6 కంప్యూటర్ల చొప్పున కేటాయించనున్నారు.

విద్యార్థులకు ప్రయోజనం..

ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఇక సాంకేతిక పరిజ్ఞానం అందనుంది. రెండు సంస్థలు వీటి నిర్వహణ బాధ్యతలు చూడనున్నాయి. మైక్రోకేర్‌ కంప్యూటర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ డైట్‌ కళాశాల, ఎమ్మార్సీల కంప్యూటర్ల బాధ్యతలు చూడనుండగా, పీఎస్‌ఎస్‌ఆర్‌ఐటీ సర్వీస్‌ సంస్థ పాఠశాలల కంప్యూటర్ల నిర్వహణ బాధ్యతలు తీసుకుంది. మూడేళ్ల పాటు నిర్వహణ చేపట్టనున్నాయి. కంప్యూటర్లతో పాటు పాఠశాలలకు యూపీఎస్‌, డెస్క్‌టాప్‌, ప్రింటర్లను సమకూర్చనున్నాయి.

ఈసారైనా కంప్యూటర్‌ విద్య అందేనా..

దివంగత సీఎం రాజశేఖరరెడ్డి సర్కారు బడుల్లో చదువుతున్న విద్యార్థులకు కంప్యూటర్‌ పరిజ్ఞానం అందించాలనే ఉద్దేశంతో అప్పట్లో కంప్యూటర్‌ విద్యను ప్రవేశపెట్టారు. ఆయన మరణానంతరం ఈ విద్య కుంటుపడింది. సర్కారు బడుల్లో కంప్యూటర్లు ఉన్నప్పటికీ మరమ్మతులకు గురవడం, నిర్వహణ బాధ్యతలు చేపట్టిన సంస్థ గడువు ముగియడంతో మూలనపడింది. ముఖ్యంగా ఇన్‌స్ట్రక్టర్లు లేకపోవడంతోనే ఈ దుస్థితి నెలకొందని పలువురు పేర్కొంటున్నారు. ఈసారి ప్రభుత్వం కంప్యూటర్‌ పరిజ్ఞానం అందించేందుకు చర్యలు తీసుకోగా, ఇన్‌స్ట్రక్టర్ల నియామకానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం శోచనీయం. త్వరలో ఏవైన ఆదేశాలు జారీ అవుతాయా అనేది వేచిచూడాల్సిందే.

పకడ్బందీగా అమలు చేస్తాం..

సమగ్ర శిక్ష పథకం కింద జిల్లాలో 60 పాఠశాలలు కంప్యూటర్‌ విద్యకు ఎంపికయ్యాయి. ఈ పాఠశాలలకు త్వరలోనే కంప్యూటర్లు చేరనున్నాయి. వీటితో పాటు ఎమ్మార్సీలు, డైట్‌ కళాశాలలో కూడా ప్రభుత్వం కంప్యూటర్లను ఏర్పాటు చేయనుంది. దీంతో సర్కారు బడుల్లో చదివే పేద విద్యార్థులకు మేలు చేకూరనుంది. ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు చర్యలు చేపడతాం.

– జె.నారాయణ, విద్యా శాఖ సెక్టోరియల్‌ అధికారి, ఆదిలాబాద్‌

Advertisement
Advertisement