ఓ వైపు పెళ్లిళ్లు.. మరో వైపు ఫైనల్‌మ్యాచ్‌

18 Nov, 2023 01:50 IST|Sakshi

మంచిర్యాలరూరల్‌(హాజీపూర్‌): ఈ నెల 19 ఆదివారం శుభముహూర్తం కావడంతో జిల్లాలో పెద్ద ఎత్తున పెళ్లిళ్లు జరగనున్నాయి. ఇప్పటికే పెళ్లిళ్లకు ఫంక్షన్‌ హాళ్లు మొత్తం బుక్‌ చేసుకున్నారు. ఆదివారమే ప్రపంచ కప్‌ క్రికెట్‌ ఫైనల్‌ మ్యాచ్‌ కూడా ఉంది. దీంతో ఇటు పెళ్లిళ్లకు వెళ్లాలా?.. వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌ చూడాలా?.. అన్న మీమాంసలో జనం ఉన్నారు. పెళ్లికి వెళ్లినా మ్యాచ్‌ కారణంగా త్వరగా ఇళ్లకు వెళ్లడంపై ఆలోచన చేస్తున్నారు. ఆదివారం వేళ ఎంచక్కా ఇంట్లో ఎంజాయ్‌ చేస్తూ భారత్‌–ఆస్ట్రేలియా వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ చూసేలా క్రికెట్‌ అభిమానులు, వీక్షకులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీంతో వివాహాలు జరిపించే వారంతా పెళ్లికి వచ్చిన అతిథులు వెంటనే వెళ్తే ఫంక్షన్‌హాల్‌ బోసిపోతుందని గుర్తించారు. ఇంకేముంది పెళ్లికి వచ్చిన అతిథులు, శ్రేయోభిలాషులు, బంధుమిత్రులు వెళ్లిపోకుండా పెళ్లిళ్ల ప్రత్యక్ష ప్రసారం ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ స్క్రీన్‌లపై క్రికెట్‌ ఫైనల్‌ మ్యాచ్‌ కూడా తిలకించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వివాహానికి హాజరయ్యే బంధుమిత్రులకు మొబైల్‌ ఫోన్లలో కొంతమంది సమాచారం ఇవ్వడం కొసమెరుపు. ఏది ఏమైనా.. పెళ్లికి వచ్చిన బంధుమిత్రులు, అతిథులకు వినోదం, సంతోషం మిస్‌ కాకుండా చూస్తున్నారు.

మరిన్ని వార్తలు