ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు | Sakshi
Sakshi News home page

ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు

Published Wed, Nov 22 2023 12:22 AM

వీసీలో పాల్గొన్న కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌, 
అదనపు కలెక్టర్‌ ఖుష్బూ గుప్తా 
 - Sakshi

● రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ ● జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌

కై లాస్‌నగర్‌: అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ అన్నారు. ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై హైదరాబాద్‌ నుంచి జిల్లా ఎన్నికల అధికారులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. అత్యవసర సేవల విధులు నిర్వహించేవారు తమ ఓటు హక్కు ముందస్తుగా వినియోగించుకునేందుకు ఎన్నికల కమిషన్‌ అవకాశం కల్పించిందన్నారు. దరఖాస్తు చేసుకున్న వారి కోసం రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో ఫెసిలిటేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఇంటి నుంచి ఓటు హక్కు వినియోగించుకునే ఓటర్ల జాబితా వివరాలను నియోజకవర్గ పరిధిలో పోటీ చేసే అభ్యర్థులకు తప్పనిసరిగా అందజేయాలన్నారు. పట్టణ ప్రాంతాల్లోని పోలింగ్‌ కేంద్రాల్లో వంద శాతం, గ్రామీణ ప్రాంతాల్లోని పోలింగ్‌ కేంద్రాల్లో 60 శాతం వెబ్‌కాస్టింగ్‌ చేయాలన్నారు. మిగిలిన పోలింగ్‌ కేంద్రాల బయట సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. నూతన ఓటర్లకు ఓటరు గుర్తింపు కార్డుల పంపిణీ జరిగేలా చూడాలని, వాటి నివేదికలు సమర్పించాలన్నారు. ప్రతీ ఓటరుకు ఓటరు సమాచార స్లిప్పులు పంపిణీ చేసి వాటి నివేదికలు కూడా రోజువారీగా అందించాలని చెప్పారు. ఈవీఎం కమిషనింగ్‌ ప్రక్రియ ప్రారంభించాలన్నారు. పోలింగ్‌ సిబ్బంది ర్యాండమైజేషన్‌ ప్రక్రియ పూర్తి చేసి వారికి అవసరమైన శిక్షణ అందించాలని తెలిపారు. ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్‌, రిసెప్షన్‌ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ మాట్లాడుతూ.. జిల్లాలో ఓటరు గుర్తింపు కార్డులు, ఓటరు సమాచార స్లిప్పులు త్వరితగతిన పంపిణీ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇందులో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ఖుష్బుగుప్తా, ఎన్నికల విభాగం పర్యవేక్షకురాలు నలంద ప్రియ తదతరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement