కాంగ్రెస్‌ నాయకుల దాడి | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ నాయకుల దాడి

Published Sat, Dec 2 2023 1:46 AM

జాతీయ రహదారిపై ఆందోళన చేస్తున్న బీఆర్‌ఎస్‌ నాయకులు - Sakshi

బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ భర్తపై
● వాట్సాప్‌ వార్‌.. దాడికి దారితీసిన వైనం ● పోలీసుల అదుపులో నిందితులు

మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని హమాలీవాడకు చెందిన బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ శ్రీరాముల సుజాత భర్త మల్లేష్‌పై కాంగ్రెస్‌ నాయకులు దాడికి పాల్పడిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. దాడికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే... మంచిర్యాల మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి శ్రీరాముల సుజాత పోటీ చేసి గెలిచింది. గెలిచిన తర్వాత బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరింది. పట్టణంలో జరిగిన ఓ విందు కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు, కౌన్సిలర్‌ సుజాత భర్త మల్లేష్‌లు వేర్వేరుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నాయకులు కాంగ్రెస్‌ టికెట్‌ మీద గెలిచి కౌన్సిలర్‌ అయి బీఆర్‌ఎస్‌లో చేరాడని కామెంట్‌ చేశారు. విందు కార్యక్రమం అనంతరం అందరూ వెళ్లిపోయారు. సాయంత్రం కాంగ్రెస్‌ నాయకులు మల్లేష్‌కు ఫోన్లు చేయడం, వాట్సాప్‌లో అసభ్యకరంగా మెస్సెజ్‌లు చేయడంతో మల్లేష్‌ సైతం అదే తరహలో బదులిచ్చాడు. దీంతో ఇరువురి మధ్య కాసేపు వాట్సాప్‌ వార్‌ జరిగింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ నాయకులు తోట తిరుపతి, బానేష్‌, మహేష్‌, కిషోర్‌ బాబు, రవిలు మరికొంత మంది సాయంత్రం మల్లేష్‌ ఇంటికి వచ్చి దాడికి పాల్పడ్డారు. అడ్డుకున్న కుటుంబ సభ్యులపై సైతం దాడి చేశారు. విషయం తెలుసుకున్న పట్టణ సీఐ రాజు, ఎస్సై రాజేందర్‌లు ఘటనా స్థలానికి చేరుకొని దాడికి పాల్పడిన వారిని అదుపులోకి తీసుకున్నారు.

బీఆర్‌ఎస్‌ నాయకుల ధర్నా...

మంచిర్యాలటౌన్‌: 15వ వార్డు కౌన్సిలర్‌ శ్రీరాముల సుజాత భర్త శ్రీరాముల మల్లేశ్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులపై కాంగ్రెస్‌ నాయకులు చేసిన దాడిని నిరసిస్తూ శుక్రవారం సాయంత్రం బీఆర్‌ఎస్‌ నాయకులు జిల్లా కేంద్రంలోని ఫ్‌లైఓవర్‌ బ్రిడ్జి వద్ద ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ పార్టీ యువ నాయకులు నడిపెల్లి విజిత్‌రావు మాట్లాడుతూ దాడులకు పాల్పడిన కాంగ్రెస్‌ నాయకులపై చట్టప్రకారంగా కఠిన చర్యలను తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రాజకీయాల్లో ఇలా కక్షసాధింపు చర్యలకు పాల్పడడం సరికాదని అన్నారు. పోలీసులు వెంటనే తగిన చర్యలను తీసుకుని, మరోసారి ఇలాంటి దాడులు జరగకుండా చర్యలను తీసుకోవాలని కోరారు. బీఆర్‌ఎస్‌ నాయకుల ధర్నాతో గంటన్నర పాటు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సంఘటనా స్థలానికి డీసీపీ సుధీర్‌ రాంనాథ్‌ కేకన్‌ చేరుకుని దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నాను విరమింపజేశారు. అనంతరం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాడు చేశాడు.

Advertisement

తప్పక చదవండి

Advertisement