సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో.. ఇంద్రవెల్లి స్తూపంపై ఫోకస్‌! | Sakshi
Sakshi News home page

సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో.. ఇంద్రవెల్లి స్తూపంపై ఫోకస్‌!

Published Fri, Dec 8 2023 12:58 AM

- - Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌: గురువారం ఉదయం 11 గంటల సమయం.. కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అధికారులతో ఇంద్రవెల్లి స్తూపం వద్దకు చేరుకున్నారు. మొదట అమరవీరులకు నివాళులర్పించారు. స్తూపం సమీపంలో మొక్క నాటారు. ఆ తర్వాత గ్రామసభలో పాల్గొన్నారు. ఇక్కడ స్మృతివనం ఏర్పాటుకు గ్రామసభ తీర్మానం చేసింది. కలెక్టర్‌ స్మృతివనం ఏర్పాటుకు తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

రేవంత్‌రెడ్డి ఆదేశాలతో..
ఓ వైపు రాష్ట్ర రాజధానిలోని ఎల్బీ స్టేడియంలో నూతన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు సాగుతున్నాయి. గురువారం ఉదయమే కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌కు ఇంద్రవెల్లి స్తూపం వ ద్ద అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు వ చ్చాయి. దీంతో వెంటనే కలెక్టర్‌ రంగంలోకి దిగి గ్రా మసభలో తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపారు.

ఫోకస్‌ ఎందుకంటే..?
సీఎం రేవంత్‌రెడ్డి ఇంద్రవెల్లి స్తూపం వద్ద అభివృద్ధిపై ప్రమాణ స్వీకారం రోజే దృష్టి సారించడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీనిపై కాంగ్రెస్‌లో జోరుగా చర్చ సాగుతోంది. ప్రధానంగా 2021 జులైలో టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత రాష్ట్రంలో దళిత, గిరిజన దండోరా పేరిట సభలు తలపెట్టారు. ఇందులో భాగంగా 2021 ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజు ఇంద్రవెల్లిలో స్తూపం సమీపంలో బహిరంగ సభ నిర్వహించారు.

ఆ రోజు రాష్ట్రంలో అందరి చూపు ఆసభ పైనే ఉంది. లక్ష మందికి తగ్గకుండా సభ నిర్వహిస్తామని చెప్పడమే ఇందుకు కారణం. అన్నట్లుగానే జనసమీకరణ జరగడం, ఇంద్రవెల్లి సభ సక్సెస్‌ కావడం కాంగ్రెస్‌లో ఉత్సాహం నింపింది. ఆ రోజు అమరవీరుల స్తూపాన్ని సందర్శించి నివాళులర్పించిన రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం రోజే ఇక్కడ అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకోవడం ప్రధానంగా ఆదివాసులను ఆకట్టుకుంది.

1981 ఏప్రిల్‌ 20న గిరిజనులు భూమిపై హక్కుల కోసం ఇంద్రవెల్లిలో సమావేశం నిర్వహించగా ప్రభుత్వ ఆంక్షల కారణంగా పోలీసులు వారిపై తుపాకీ ఎక్కుపెట్టారు. ఈ ఘటనలో అనేక మంది మృత్యువాత పడ్డారు. అప్పటినుంచి ప్రతీ ఏడాది గిరిజనులు ఈ స్థలంలో అమరవీరులకు నివాళులర్పిస్తున్నారు. అందులో భాగంగానే అప్పట్లో అక్కడ స్తూపం నిర్మించారు. అయితే గత పాలకులు ఇక్కడ అభివృద్ధి చేపడతామని చెప్పినప్పటికీ చర్యలు తీసుకోలేదు. తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

Advertisement
Advertisement