ఘరానా ముఠా గుట్టురట్టు | Sakshi
Sakshi News home page

ఘరానా ముఠా గుట్టురట్టు

Published Mon, Dec 25 2023 11:54 PM

వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ నాగేందర్‌  - Sakshi

● తెల్లకాగితాలతో నోట్ల తయారీ అంటూ మోసం ● రూ.3లక్షలతో పరారీ ● వలపన్ని పట్టుకున్న పోలీసులు ● రూ.2లక్షల 10వేలు, కారు, రెండు బైకులు స్వాధీనం ● నలుగురి అరెస్టు, రిమాండ్‌

ఇచ్చోడ: తెల్లకాగితాలతో కరెన్సీ నోట్లు తయారు చేస్తామని నమ్మించి మోసం చేసిన ముఠాను పట్టుకున్నట్లు ఉట్నూర్‌ డీఎస్పీ నాగేందర్‌ తెలిపారు. ఇచ్చోడలోని సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించాడు. మధ్యప్రదేశ్‌లోని సాగర్‌ జిల్లాకు చెందిన కొంత మంది కొన్ని రోజులుగా ఇచ్చోడ, సిరికొండ మండలాల్లో స్థావరాలను ఏర్పాటు చేసుకొని చీరలను విక్రయిస్తున్నారు. ఈ నెల 19న సిరికొండ మండలంలోని రాజంపేట్‌లో పరిమల్‌గౌండ్‌, కువర్‌దేవిగౌండ్‌లు ఇద్దరు మోటార్‌ బైక్‌పై రాజంపేట్‌లో చీరలను విక్రయించడానికి వెళ్లారు. స్థానికుడైన పెందుర్‌ జంగుతో మాటలు కలిపారు. తనకు సంతానం లేదని జంగు వారితో తెలిపాడు. అయితే సంతానం కావాలంటే ముందుగా ఇంట్లో లక్ష్మి ఉండాలని, తెల్లకాగితాలతో కరెన్సీ నోట్లు తయారు చేసి ఇస్తామని చెప్పారు. తమ వద్ద అదృష్టశక్తి ఉందని, జంగును మరింత నమ్మంచడానికి తమ వెంట తెచ్చుకున్న ప్లాస్టిక్‌ బకిట్లో నీళ్లు పోసి అందులో కెమికల్‌ పోశారు. ముందుస్తుగానే బకిట్లో రెండు వందల నోట్లు రెండు పెట్టి రెండు తెల్లకాగితాలను అందులో వేసి కొద్ది సేపటికి తెల్లకాగితలను వారికున్న నైపుణ్యంతో మాయం చేసి ముందుగా బకిట్లో పెట్టిన రెండు వందల నోట్లను తీసి చూపించారు. లక్షకు కోటి రూపాయలు చేసి ఇస్తామని నమ్మించారు. 21వ తేదీన రూ.3లక్షలు తీసుకుని తన భార్యతో కలిసి రాజంపేట్‌ నుంచి ఇచ్చోడ బైపాస్‌ రోడ్డులో వారిని కలిశాడు. అప్పుడే కారులో వచ్చిన గురువు వద్దకు జంగును తీసుకెళ్లి కలిపారు. ఇంత పెద్ద నగదును తయారు చేయడానికి కావాల్సిన కెమికల్‌ అందుబాటులో లేదని, గంటలో వాటిని తయారు చేసి తీసుకొస్తానని జంగు వద్ద ఉన్న రూ.3లక్షలు తీసుకొని వెళ్లిపోయారు. సాయంత్రం వరకు వారు రాకపోవడంతో జంగు అక్కడి నుంచి రాజంపేట్‌కు వెళ్లిపోయాడు. మోసపోయినట్లు గ్రహించిన జంగు ఈ నెల 22న సిరికొండ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఇచ్చోడ సీఐ చంద్రశేఖర్‌, సీసీఎస్‌ సీఐ సాయులు ఆధ్వర్యంలో సిరికొండ, ఇచ్చోడ ఎస్సైలు శ్రీకాంత్‌, నరేష్‌ సిబ్బందితో కలిసి నాలుగు బృందాలుగా ఏర్పడి దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ నెల 24న మూఠాలోని ఇద్దరి సభ్యులను సిరికొండ మండలంలోని పొన్న ఎక్స్‌రోడ్డు వద్ద అదుపులోకి తీసుకొని విచారించగా మిగితా సభ్యుల వివరాలు తెలిపారు. దీంతో పర్‌మల్‌గౌండ్‌, కువర్‌దేవి గౌండ్‌, రామ్‌వీర్‌గౌండ్‌, సలంసింగ్‌ గౌండ్‌ల వద్ద నుంచి కారు, రెండు బైక్‌లతో పాటు రూ.2లక్షల 10వేల నగదు, నాలుగు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. ఈ మూఠాను పట్టుకోవడంలో కృషి చేసిన సీఐలు, ఎస్సైలు, సిబ్బంది బిక్‌రాజ్‌, నవీన్‌, హోంగార్డు భరత్‌, సీసీఎస్‌ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. సమవేశంలో ఇచ్చోడ సీఐ చంద్రశేఖర్‌, ఇచ్చోడ, సిరికొండ ఎస్సైలు పాల్గొన్నారు.

Advertisement
Advertisement