రాహుల్‌గాంధీ ఇచ్చిన‌ భరోసా హామీ కోసం చూస్తున్నా.. | Sakshi
Sakshi News home page

రాహుల్‌గాంధీ ఇచ్చిన‌ భరోసా హామీ కోసం చూస్తున్నా..

Published Sun, Dec 31 2023 1:34 AM

- - Sakshi

ఆదిలాబాద్‌: ఈ చిత్రంలో కనిపిస్తున్న మహిళ పేరు మూడ లక్ష్మి. నిర్మల్‌రూరల్‌ మండలంలోని కౌట్ల–కే గ్రామం. గల్ఫ్‌ కార్మికుడైన భర్తను పోగొట్టుకుంది. శుక్రవారం నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తు అందించింది. గతేడాది నవంబర్‌ 6న కాంగ్రెస్‌ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్‌గాంధీ భారత్‌ జోడో యాత్రలో భాగంగా హైదరాబాద్‌ సమీపంలోని బాచుపల్లిలో తన పదినెలల పసిపాప సాత్వికతో కలిసి తన గోడును విన్నవించుకుంది. ఆ పసిపాపది మాట్లాడే వయసు కూడా కాదు.

గల్ఫ్‌ మృతుడి భార్య దీనస్థితిని చూసి చలించిన రాహుల్‌గాంధీ తనతో పాటు యాత్రలోని కాంగ్రెస్‌ నాయకులు ప్రస్తుత రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ఆ కుటుంబానికి సాయం అందేలా చూడాలని సూచించారు. నిర్మల్‌ జిల్లాలోని కౌట్ల–కే గ్రామానికి చెందిన మూడ అశోక్‌ ఉపాధి నిమిత్తం గల్ఫ్‌ దేశమైన అబుదాబి వెళ్లాడు. అక్కడ అనుకొని ఘటనలో మృతి చెందాడు. అయితే అతడికి అప్పటికే భార్య మూడ లక్ష్మితో పాటు ఆరేళ్లలోపు ఇద్దరు పిల్లలు, పది నెలల పసిపాప సాత్విక ఉంది. ఈ చిన్నారికి పుట్టుకతోనే అనారోగ్య సమస్య ఉండడంతో రాహుల్‌గాంధీని కలిసిన అనంతరం నాలుగు నెలలకే మృత్యుఒడికి చేరుకుంది.

సంవత్సరం దాటిపోతోంది.
ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొలువుతీరింది. అనంతరం ఆరు గ్యారెంటీల అమలు నిమిత్తం ప్రస్తుతం ప్రజాపాలన కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రకటించిన మేనిఫెస్టో ప్రకారం గల్ఫ్‌ మృతుల కుటుంబానికి రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా అందించాలని వేడుకుంటోంది. తన భర్త అశోక్‌ గతేడాది జూలై 24న అబుదాబి దేశంలో మరణించడంతో తన కుటుంబ జీవనం కష్టతరంగా మారిందని వాపోతోంది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు రాహుల్‌ గాంధీ, తదితర నాయకుల హామీ మేరకు తమ కుటుంబాన్ని ఆదుకోవాలని విన్నవిస్తోంది. ఇదే అంశంపై శుక్రవారం నిర్మల్‌ రూరల్‌ మండలంలోని కౌట్ల(కె) గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలనలో దరఖాస్తు సమర్పించింది.

Advertisement
Advertisement