విచారణ పూర్తి కాకుండానే టీచర్‌పై సస్పెన్షన్‌ ఎత్తివేత | Sakshi
Sakshi News home page

విచారణ పూర్తి కాకుండానే టీచర్‌పై సస్పెన్షన్‌ ఎత్తివేత

Published Wed, Jan 31 2024 11:36 PM

-

● విద్యాశాఖ తీరుపై సర్వత్రా విమర్శలు

ఆదిలాబాద్‌టౌన్‌: నేరడిగొండ మండల కేంద్రంలో ఇటీవల విద్యార్థినిల పట్ల అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలతో ఓ ఉపాధ్యాయుడిపై విద్యా శాఖ అధికారులు సస్పెన్షన్‌ విధించిన విషయం తెలిసిందే. అయితే విచారణ పూర్తి కాకుండానే సదరు ఉపాధ్యాయుడిపై విద్యాశాఖ అధికారులు బుధవారం సస్పెన్షన్‌ను ఎత్తివేశారు. అయితే ఆ ఉపాధ్యాయుడు పాఠశాలకు వెళ్లి విధుల్లో చేరినట్లు సమాచారం. ఈ ఘటనపై అప్పట్లో విద్యాశాఖ అధికారితో పాటు పలువురు ఆ పాఠశాలకు వెళ్లి సంఘటన వివరాలు విద్యార్థులు, ఉపాధ్యాయుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. ఈ విషయంపై ఐసీపీఎస్‌ అధికారులు సైతం అక్కడికి వెళ్లి ఆరా తీశారు. సదరు ఉపాధ్యాయుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేయించారు. రాష్ట్ర బాలల పరిరక్షణ అధికారి సైతం ఈ సంఘటనపై సీరియస్‌ అయ్యారు. విచారణ చేసి జిల్లా ఉన్నతాధికారులకు నివేదిక కోరిన విషయం విదితమే. విచారణ పూర్తి కాకుండానే ఉపాధ్యాయుడిని ఏ విధంగా తిరిగి విధుల్లోకి తీసుకుంటారని విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయ సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఆ ఉపాధ్యాయుడిని అదే పాఠశాలలో తిరిగి విధుల్లోకి తీసుకోవడంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. విచారణ పూర్తయిన తర్వాతే సస్పెన్షన్‌ ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. వెంటనే విద్యాశాఖ అధికారులు స్పందించకుంటే ఆందోళనకు దిగుతామని విద్యార్థుల తల్లిదండ్రులు హెచ్చరిస్తున్నారు. ఈ విషయమై జిల్లా విద్యాశాఖ అధికారి ప్రణితను వివరణ కోరగా, చార్జెస్‌ ఫ్రేమ్‌ చేసిన తర్వాత పెండింగ్‌ ఎంకై ్వరి కింద ఆ ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్‌ ఎత్తివేశామని తెలిపారు. ఏవైన అభ్యంతరాలు వస్తే ఆ ఉపాధ్యాయుడిని మరో పాఠశాలకు పంపిస్తామని పేర్కొన్నారు.

Advertisement
Advertisement