ఎవరు ఎటువైపు.. ‘గులాబీ’ గూటికి పగుళ్లు! | Sakshi
Sakshi News home page

ఎవరు ఎటువైపు.. ‘గులాబీ’ గూటికి పగుళ్లు!

Published Thu, Mar 7 2024 5:35 AM

- - Sakshi

బీఎస్పీ, బీఆర్‌ఎస్‌ పొత్తుతో కాంగ్రెస్‌లోకి కోనప్ప

ఇప్పటికే ‘హస్తం’ పార్టీలోకి పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్‌ నేత

మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు పార్టీ మార్పుపై చర్చలు

బీఆర్‌ఎస్‌ నేతలే లక్ష్యంగా కాంగ్రెస్‌, బీజేపీ పావులు

సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్‌: లోక్‌సభ ఎన్నికల ముందు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీఆర్‌ఎస్‌తో బీఎస్పీ పొత్తు ఖరారు కావడంతో సిర్పూర్‌ మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ పార్టీ కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా అధ్యక్షుడు కోనేరు కోనప్ప, ఆయన సోదరుడు జెడ్పీ చైర్‌పర్సన్‌ కోనేరు కృష్ణారావుతోపాటు అనుచర వర్గం కాంగ్రెస్‌ పార్టీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డిని బుధవారం కలి శారు.

దీంతో పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ఈ నియోజకవర్గంలో మరింత దెబ్బ తగలనుంది. తాజా పరిణామాలతో ఉమ్మడి జిల్లాలో మరి కొందరు నాయకులు కండువాలు మార్చుతారనే ప్రచారం జోరందుకుంది. ప్రధానంగా బీఆర్‌ఎస్‌ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులే లక్ష్యంగా బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు పావులు కదుపుతుండడంతో ఎవరు ఎటువైపు వెళ్తున్నారనేది ఆసక్తికరంగా మారింది. అటు ఆదిలాబాద్‌ ఇటు పెద్దపల్లి పార్లమెంటు స్థానాల్లో నాయకుల తీరు రాజకీయ మార్పులకు దారి తీస్తున్నాయి.

మాజీ ఎమ్మెల్యేల పక్క చూపులు..
బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన కొందరు మాజీ ఎమ్మెల్యేలు పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచా రం జరుగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవంతో నేతల్లో నైరాశ్యం నెలకొంది. తమ రాజకీయ భవిష్యత్‌ కోసం పార్టీ మారేందుకు అంతర్గతంగా చర్చలు సాగుతున్నాయి. కాంగ్రెస్‌లోకి వెళ్లడమా..? బీజేపీలో చేరడమా..? అనే దానిపై తర్జనభర్జనలు పడుతున్నారు. ప్రస్తుతం ‘గులా బీ’ పార్టీకి గడ్డు కాలమే ఉండడంతో కార్యకర్తలు, నాయకుల నుంచి ఒత్తిడి కారణంగా మార్పు తథ్యంగా భావిస్తున్నారు.

ఇందుకు లోక్‌సభ ఎన్ని కలు మంచి తరుణంగా భావిస్తూ ఎవరికి ఏ పార్టీ తో మేలు ఉంటుందో లెక్కలు వేసుకుంటున్నా రు. ఉమ్మడి జిల్లా పరిధిలో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ పార్టీ టచ్‌లోకి వెళ్లినట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో తమకు ప్రాధాన్యత ఇస్తేనే చేరుతామనే మెలిక పెట్టినట్లుగా చెబుతున్నారు. అయితే ఎవరికీ స్పష్టమైన హామీ రానట్లు తెలిసింది. వీరితోపాటు మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు బీజేపీ నాయకులతో చర్చలు జరిపారు. తమ పార్టీలోకి రావాలని ఆహ్వానాలు అందడంతో పార్టీ మార్పుపై నిర్ణయం తీసుకోవడంపై ఆలోచిస్తున్నారు. ఓ మాజీ ఎమ్మెల్సీతోపాటు సీనియర్‌ నాయకులు సైతం పార్టీ మార్పుపై గత కొంతకాలంగా సమాలోచనలు చేస్తున్నారు.

ఇవి చదవండి: పదేళ్లూ బీజేపీ సర్కార్‌ చేసిందేంటి?

Advertisement
Advertisement