కాంగ్రెస్‌ అభ్యర్థి ఎవరో..? కొనసాగుతున్న ఉత్కంఠ! | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ అభ్యర్థి ఎవరో..? కొనసాగుతున్న ఉత్కంఠ!

Published Sat, Mar 16 2024 1:55 AM

- - Sakshi

ఆదివాసీనే బరిలోకి దించాలని పార్టీ నిర్ణయం

బొజ్జుతో పోటీ చేయించాలని అధిష్టానం యోచన

రేవంత్‌తో ‘సోయం’ అపాయింట్‌మెంట్‌ ఫిక్స్‌ అయిందనే ప్రచారం

సాక్షి, ఆదిలాబాద్‌: లోక్‌సభ ఎన్నికలకు గాను కాంగ్రెస్‌ అభ్యర్థి ఎంపిక విషయంలో ఎడతెగని ఉత్కంఠ కొనసాగుతుంది. పలువురి పేర్లు వినబడుతున్నప్పటికీ పార్టీ ఇంకా ఒక నిర్ణయానికి రాలేదని చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఆదివాసీ నేతనే బరిలోకి దించాలని నిర్ణయించినట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అదే జరిగితే ఈ టికెట్‌పై ఆశలు పెట్టుకున్న మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు నిరాశ తప్పదని అంటున్నారు.

కాగా ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జును రంగంలోకి దించాలని అధిష్టానం ఆసక్తితో ఉన్నట్టుగా కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది. అయితే గడిచిన అసెంబ్లీ ఎన్నికలతోనే ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చిన ఆయన ఇప్పుడే పార్లమెంట్‌కు పోటీ చేసే విషయంలో ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. ఒకవేళ ఆయన పోటీకి ముందుకు రాకపోతే ఆశావహుల్లో ఎవరికై నా టికెట్‌ లభించవచ్చనే చర్చ సాగుతోంది.

ఆశావహుల ముమ్మర యత్నాలు..
కాంగ్రెస్‌ టికెట్‌ కోసం 22 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో ఐటీడీఏ ఏపీవో ఆత్రం భాస్కర్‌, ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆత్రం సుగుణ, ఎల్‌ఐసీ ఉద్యోగానికి ఇటీవలే రాజీనామా చేసి పార్టీలో చేరిన కోవ దౌలత్‌రావు మొకాశి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వీరితో పాటు అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్‌లో క్రియాశీలకంగా ఉన్న మర్సుకోల సరస్వతి ప్రస్తుతం బీఆర్‌ఎస్‌లో ఉన్నారు.

అప్పట్లో కాంగ్రెస్‌ నుంచి ఆసిఫాబాద్‌ టికెట్‌ను ఆశించిన ఆమె దక్కకపోవడంతో పార్టీ వీడారు. తాజాగా ఆమె పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే పార్టీ ఎన్నికల వ్యూహకర్త సునీల్‌ కనుగోలు ఆధ్వర్యంలో ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో ర్యాండమ్‌ సర్వే నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇందులో ప్రధానంగా ఆదివాసీలకే టికెట్‌ ఇవ్వాలని మెజార్టీ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే పార్టీ ఆదివాసీ అభ్యర్థికే మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం ఉంది. ఇదిలా ఉంటే నియోజకవర్గాల ఇన్‌చార్జీల నుంచి కూడా అభిప్రాయ సేకరణ చేయగా ఆశావహుల్లోని ఓ అధికారి పేరు ఎక్కువ మంది చెప్పినట్లు తెలుస్తోంది. జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క ఈ విషయంలో సమాలోచన చేస్తున్నట్లు సమాచారం.

అపాయింట్‌మెంట్‌ ఫిక్స్‌ అనే ప్రచారం..
బీజేపీ టికెట్‌ ఆశించి భంగపడ్డ ఎంపీ సోయం బాపూరావు కాంగ్రెస్‌ పార్టీలో చేరుతారనే ప్రచారం ఇప్పటికీ కొనసాగుతుంది. ఇదిలా ఉంటే శనివారం సీఎం రేవంత్‌రెడ్డితో ఆయన అపాయింట్‌మెంట్‌ ఫిక్స్‌ అయ్యిందనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ అభ్యర్థి ఎంపిక ఇంకా ఓ కొలిక్కి రాలేదనేది స్పష్టమవుతోంది. ఇప్పటికే బీజేపీ, బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఖరారయ్యారు. మరోపక్క ఎన్నికల నోటిఫికేషన్‌ నేడు రానుంది. ఈ నేపథ్యంలో పార్టీ అభ్యర్థి ఎంపికను త్వరగా ముగించాలనే ప్రయత్నాలు సాగుతున్నాయి.

ఇవి చదవండి: కాంగ్రెస్‌లోకి మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి

Advertisement
Advertisement