సికిల్‌ సెల్‌ ఎనీమియా నిర్మూలనకు చర్యలు | Sakshi
Sakshi News home page

సికిల్‌ సెల్‌ ఎనీమియా నిర్మూలనకు చర్యలు

Published Wed, Nov 15 2023 1:48 AM

- - Sakshi

రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ సరస్వతి

గంగవరం: గిరిజన ప్రాంతంలో 2047 సంవత్సరంలోగా సికిల్‌ సెల్‌ ఎనీమియాను సంపూర్ణంగా నిర్మూలించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ బి.సరస్వతి తెలిపారు. స్థానిక భవిత కేంద్రాన్ని మంగళవారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. ఏజెన్సీలో గిరిజనులు అధికశాతం మంది సికిల్‌ సెల్‌ ఎనీమియా వ్యాధికి గురువుతున్నారని, దీనిని సంపూర్ణంగా నిర్మూలించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. గిరిజనులందరికీ స్క్రీనింగ్‌ పూర్తి చేసి వైద్యం అందించేందుకు, 2047 సంవత్సరంలోగా ఈ వ్యాధిని నిర్మూలించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో కొండరెడ్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కమిషన్‌ను ఏర్పాటు చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వ గిరిజన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పలు అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్నట్టు తెలిపారు. భవిత ఎడ్యుకేషనల్‌ సొసైటీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వి.ప్రభుదాస్‌ ఆధ్వర్యంలో పాతగంగవరంలో నిర్వహిస్తున్న భవిత కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. స్థానిక భవిత కేంద్రంలో అమలు చేస్తున్న కార్యక్రమాలను, గిరిజన యువతకు అందిస్తున్న సేవా కార్యక్రమాలను ఆమె అడిగి తెలుసుకున్నారు. గిరిజన ప్రాంతంలో స్వచ్ఛంద సేవా సంస్థల సేవలు అభినందనీయమని ఆమె అన్నారు.

భవిత ఎడ్యుకేషన్‌ సొసైటీ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలను ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ప్రభుదాస్‌ ఆమెకు వివరించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ జాన్‌రాజ్‌, సహాయ గిరిజన సంక్షేమ అధికారి కె.వి.ప్రసాద్‌, గంగవరం, టేకులవీధి స్కూల్‌ కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయులు నాగేశ్వరరావు, ఝాన్సీ హేన్సన్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement