శివారు గ్రామాలకు రోడ్డు, రవాణా సదుపాయం | Sakshi
Sakshi News home page

శివారు గ్రామాలకు రోడ్డు, రవాణా సదుపాయం

Published Mon, Nov 20 2023 1:18 AM

గెడ్డపై వంతెన నిర్మాణ పనులను పరిశీలిస్తున్న ఎస్టీ కమిషన్‌ సభ్యుడు విశ్వేశ్వరరాజు - Sakshi

జి.మాడుగుల: మండలంలో కిల్లంకోట మార్గంలో కోడిమామిడి గెడ్డపై ప్రభుత్వ నిధులతో నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనులను ఎస్టీ కమిషన్‌ సభ్యుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు పరిశీలించారు. ఆంధ్ర–ఒడిశా రాష్ట్రాల సరిహద్దు గిరిజన గ్రామాలకు రోడ్డు, రవాణా సౌకర్యాలకు కోడిమామిడి గెడ్డపై వంతెన ఎంతో కీలకం. ఈ ప్రాంత ప్రజల సమస్యలను దృష్టిలో పెట్టుకొని రోడ్డు, రవాణా సదుపాయాలు కల్పించాలని ఉద్దేశంతో వంతెన ఏర్పాటుకు ప్రభుత్వం ఎస్‌సీఎ పథకం కింద రూ.2.20కోట్లు నిధులు కేటాయించింది. ఆయా వంతెన నిర్మాణ పనులు చకచకా జరుగుతున్నాయి. ఎస్టీ కమీషన్‌ సభ్యుడు విశ్వేశ్వరరాజు మాట్లాడుతూ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పాలనలోనే మన్యంలోని శివారు గ్రామాలకు రోడ్డు, రవాణా సదుపాయం కల్పించిందన్నారు. పూర్వీకుల కాలం నాటి నుంచి స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా గెడ్డపై వంతెన రోడ్డు అభివృద్ధికి నోచుకోలేదని, ఈ ప్రాంత ప్రజలు అనేక సమస్యలు, ఇబ్బందులు పడుతూ గుర్రాలపై, కాలినడననే రాకపోకలు సాగించేవారన్నారు. గిరిజన ప్రజల అనారోగ్యానికి గురైతే డోలీ మోతేశరణ్యమమ్యేదని, నిత్యావసర సరకులను వారపు సంతలకు తీసుకెళ్లేందుకు ఎన్నో ఇబ్బందులు పడేవారని గుర్తు చేశారు. సరిహద్దు రాష్ట్రాలగిరిజన గ్రామాల ప్రజలు ఎదురుచూస్తున్న తరుణంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్‌మోహన్‌రెడ్డి రావడంతో కష్టాలు, సమస్యలకు తెరపడిందన్నారు. గిరిజనుల జీవన ప్రమాణాలు మారాయని, ఆర్థికంగా స్థిరపడ్డారన్నారు. గ్రామాల్లో అభివృద్ధి శరవేగంగా జరుగుతోందన్నారు.

శివారు గ్రామాలు అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయన్నారు. కోడిమామిడి గెడ్డపై గెడ్డపై వంతెన నిర్మాణంతో రోడ్డు రవాణా సదుపాయం త్వరలో అందుబాటులో రానుందన్నారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి రెండు సరిహద్దు రాష్ట్రాల గిరిజన గ్రామాల ప్రజలతో పాటు విశ్వేశ్వరరాజు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Advertisement
Advertisement