వరద నీటి తొలగింపునకు చర్యలు | Sakshi
Sakshi News home page

వరద నీటి తొలగింపునకు చర్యలు

Published Thu, Dec 7 2023 1:10 AM

సీఎం వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నకలెక్టర్‌ సుమిత్‌కుమార్‌, ఎస్పీ తుహిన్‌సిన్హా - Sakshi

సాక్షి,పాడేరు: వర్షాలకు పంటల పొలాల్లో చేరిన వరద నీటిని యుద్ధప్రాతిపదికన తొలగింపు చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ ఆదేశించారు.బుధవారం ఆయన తన కార్యాలయం నుంచి వ్యవసాయ, ఉద్యానవనశాఖల అధికారులు,తహసీల్దార్లు,ఎంపీడీవోలతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 9వతేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా తుఫాన్‌ నష్టాలపై సమగ్ర గణన చేపట్టాలని సూచించారు.జిల్లాలో పంట నష్టాలపై రైతులు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వానికి నివేదించి,నష్ట పరిహారంను అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. తుపాను నష్టాలపై అధికారులంతా కచ్చితమైన నివేదికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. కల్వర్టులు,రోడ్లు దెబ్బతింటే వెంటనే పునరుద్ధరణ పనులు చేపట్టాలని ఆదేశించారు. రవాణాకు ఎలాంటి అంతరాయం లేకుండా ట్రాపిక్‌ను క్రమబద్ధీకరించాలని సూచించారు.అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. వ్యవసాయ,ఉద్యాన పంటలు,పశువులు, ఇళ్ల నష్టాలపై కూడా నివేదికలు సమర్పించాలన్నారు. నీటినిల్వలు తొలగించేందుకు మోటార్‌ పంప్‌లను అద్దెకు తీసుకోవాలని సూచించారు. ఇందుకు అవసరమైన నిధులు చెల్లిస్తామని కలెక్టర్‌ తెలిపారు.

250 హెక్టార్లలో పత్తి పంటకు..

జిల్లాలో సుమారు 600హెక్టార్ల వరకు వరిపంటకు నష్టం జరిగి ఉంటుందని జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌.బి.ఎస్‌.నందు తెలిపారు.పత్తి 250 హెక్టార్ల వరకు నష్టం వాటిల్లే పరిస్థితి ఉందన్నారు.రాజ్‌మా పంట నష్టాలను అంచనా వేస్తున్నామని కలెక్టర్‌కు నివేదించారు.

ఉద్యానవన పంటల నష్టాలపై అంచనా

జిల్లాలో ఉద్యానవన పంటల నష్టాలపై అంచనాలు వేస్తున్నామని జిల్లా ఉద్యానవనశాఖాధికారి రమేష్‌ కుమార్‌రావు తెలిపారు.డుంబ్రిగుడ,అనంతగిరి,అరకులోయ మండలాల్లో కూరగాయల సాగు ఉందని, వర్షాలు తగ్గిన వెంటనే నష్టాలపై సమగ్ర సర్వే చేపడతామన్నారు. చింతూరు డివిజన్‌లో 50 ఎకరాల వరకు మిర్చి పంట దెబ్బతినే పరిస్థితి ఉందని కలెక్టర్‌కు నివేదించారు.ఈ టెలికాన్ఫరెన్స్‌లో జాయింట్‌ కలెక్టర్‌ శివశ్రీనివాస్‌, పాడేరు, రంపచోడవరం, చింతూరు ఐటీడీఏ పీవోలు అభిషేక్‌,సూరజ్‌ గనోరే, చైతన్య పాల్గొన్నారు.

సీఎం దృష్టికి తుపాను నష్టం వివరాలు

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయం నుంచి బుధవారం కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌, ఎస్పీ తుహిన్‌సిన్హా, పలుశాఖల అధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో తుపాను నష్టం వివరాలను కలెక్టర్‌ సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. ఈ కాన్ఫరెన్సులో జేసీ శివశ్రీనివాస్‌,డీఆర్‌వో అంబేద్కర్‌,జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌.బి.ఎస్‌.నందు.జిల్లా ఉద్యానవనశాఖ అధికారి రమేష్‌కుమార్‌రావు, ఆర్‌అండ్‌బీ ఈఈ బాలసుందరబాబు, సీపీవో ఎస్‌.ఆర్‌.కె.పట్నాయక్‌, హౌసింగ్‌ ఈఈ బాబునాయక్‌,పంచాయతీరాజ్‌ ఈఈ కొండయ్యపడాల్‌ పాల్గొన్నారు.

యుద్ధప్రాతిపదికన చేపట్టాలి

కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ ఆదేశం

Advertisement

తప్పక చదవండి

Advertisement