పంట నష్టంపై ప్రభుత్వానికి నివేదిక | Sakshi
Sakshi News home page

పంట నష్టంపై ప్రభుత్వానికి నివేదిక

Published Thu, Dec 7 2023 1:10 AM

-

సాక్షి,పాడేరు: మిచాంగ్‌ తుపానుకు జరిగిన పంట నష్టంపై ప్రభుత్వానికి నివేదిక పంపి, బాధిత రైతులను ప్రతిఒక్కరిని ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, ఉమ్మడి విశాఖ జడ్పీచైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర భరోసా ఇచ్చారు. బుధవారం వంతాడపల్లి పంచాయతీ పరిధిలో ముంపు ప్రాంతాలను వారు పరిశీలించారు. కాలినడకన వెళ్లి వరి, రాజ్‌మా, చోడి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంట నష్టాలపై అధికార యంత్రాంగం సమగ్ర సర్వే జరుపుతుందన్నారు. తుపాను కారణంగా ప్రాణ,ఆస్తుల నష్టాలు లేకుండా ప్రభుత్వం ముందుగానే అప్రమత్తమైందన్నారు. సీఎం వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి నిరంతరం అధికార యంత్రాంగాన్ని మరింత అప్రమత్తం చేశారన్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకున్నారని వారు పేర్కొన్నారు. ఈక్రాప్‌ జరుపుకున్న రైతులందరికీ పంట నష్ట పరిహారం అందుతుందని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ సలహామండలి అధ్యక్షురాలు ఎం.సరస్వతి,డైరెక్టర్‌ మినుముల కన్నాపాత్రుడు,పార్టీ నాయకులు అల్లాడ నగేష్‌,పీతాంబరం పాల్గొన్నారు.

ప్రతి ఒక్క రైతును ఆదుకుంటాం

అరకులోయ టౌన్‌: తుపానుకు నష్ట పోయిన ప్రతిఒక్క రైతుకు పరిహారం అందిస్తామని అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ అన్నారు. బుధవారం మండలంలోని చిన్నలబుడు, లోతేరు, పంచాయతీల్లో తుపాను ప్రభావిత ప్రాంతాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంట నష్టపోయిన రైతులు మండల వ్యవసాయాధికారి వద్దకు వెళ్లి పేర్లు నమోదు చేసుకుని పరిహారం పొందాలని సూచించారు. పాడేరు ఐటీడీఏ పీవో అభిషేక్‌ మాట్లాడుతూ అనంతగిరి అరకు, కొయ్యూరు, జీకేవీధి, చింతపల్లి మండలాల్లో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందన్నారు. వ్యవసాయశాఖ ద్వారా పంట నష్టం గుర్తించి ప్రభుత్వానికి నివేదిస్తామని చెప్పారు. దెబ్బతిన్న పంట కాలువలు, కాజ్‌వేల మరమ్మతులకు అంచనాలు అందజేయాలని ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు. అనంతగిరి– అరకు ఘాట్‌ రోడ్లో మంగళవారం రాత్రి విరిగిపడిన కొండ చరియలను తహసీల్దార్‌, ఎంపీడీవో, పోలీసుశాఖ సహకారంతో తొలగించామన్నారు. ప్రమాదకర పరిస్థితులు నెలకొన్న లోతేరు గిరిజనులను సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి అవసరమైన వసతులు కల్పించామన్నారు. పర్యాటక ప్రాంతాలను మూసివేసినట్టు చెప్పారు. ఎంపీడీవో వెంకటేష్‌, తహసీల్దార్‌ వేణుగోపాల్‌, ఏడీ మోహనరావు, ఏవో ఫణి, మండల పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్‌కుమార్‌, సర్పంచ్‌ రమేష్‌, ఉమ్మడి విశాఖ జిల్లా మాజీ అధికార ప్రతినిధి శెట్టి అప్పాలు, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కిరణ్‌కుమార్‌ పాల్గొన్నారు.

బాధిత రైతులందరినీ ఆదుకుంటాం

ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి,

ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్‌పర్సన్‌ సుభద్ర

Advertisement

తప్పక చదవండి

Advertisement