విశాఖ ఎయిర్‌పోర్టు దూకుడు! | Sakshi
Sakshi News home page

విశాఖ ఎయిర్‌పోర్టు దూకుడు!

Published Fri, Apr 19 2024 2:05 AM

-

సాక్షి, విశాఖపట్నం: ప్రయాణికుల తాకిడిలో విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం దూకుడులో ఉంది. ఏటికేడాది ఈ ఎయిర్‌పోర్టు నుంచి ప్రయాణికుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. తాజాగా 2023–24 ఆర్థిక సంవత్సరంలోనూ అదే తీరును కనబరిచింది. 2022–23లో ఈ విమానాశ్రయం నుంచి 25,00,654 మంది రాకపోకలు సాగించగా, ఈ సంవత్సరం 27,84,428కు పెరిగారు. గతేడాదితో పోల్చుకుంటే 2,85,974 మంది అధికంగా ప్రయాణించారు. అంటే 10.19 శాతం వృద్ధి రేటు నమోదైంది. కాగా 2022–23లో దేశీయ ప్రయాణికులు 24,35,320 మంది, విదేశీ ప్రయాణికులు ఉండగా, 2023–24లో దేశీయ ప్రయాణికులు 27,18,314, విదేశీ ప్రయాణికులు 66,116 మంది ఉన్నారు. ఈ లెక్కన గత ఏడాదికంటే స్వదేశీ ప్రయాణికులు 2,83,774 మంది, విదేశీ ప్రయాణికులు 2,982 మంది పెరిగారన్న మాట! గత మే నెలలో అత్యధికంగా 2,96,628 మంది, అత్యల్పంగా ఫిబ్రవరిలో 1,96,013 మంది ప్రయాణాలు సాగించారు. మరోవైపు ఈ విమానాశ్రయం నుంచి దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు కూడా పెరుగుతున్నాయి. ఈ నెల 9న విశాఖ నుంచి బ్యాంకాక్‌కు కొత్త అంతర్జాతీయ సర్వీసు, 16న హైదరాబాద్‌కు రెండు సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఈనెల 26న మలేసియాకు మరో కొత్త విమాన సర్వీసును ప్రారంభించనున్నారు. అలాగే పెరుగుతున్న ప్రయాణికులు, విమాన సర్వీసులను దృష్టిలో ఉంచుకుని ఈ ఎయిర్‌పోర్టులో మరిన్ని సదుపాయాలను సమకూరుస్తున్నారు. ప్రయాణ ప్రక్రియ వేగవంతం, సులభతరమయ్యేందుకు వీలుగా ఇన్‌లైన్‌ బ్యాగేజి స్క్రీనింగ్‌, డిజి యాత్ర సర్వీసును అందుబాటులోకి తెచ్చారు. ప్రయాణికుల రాకపోకల్లో విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం మూడు మిలియన్ల (30 లక్షల) మైలు రాయిని అధిగమిస్తుందని ఆంధ్రప్రదేశ్‌ ఎయిర్‌ ట్రావెలర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, ఉపాధ్యక్షులు కె.కుమార్‌రాజా, ఒ.నరేష్‌కుమార్‌, డీఎస్‌ వర్మ తెలిపారు.

27 లక్షలు దాటిన ప్రయాణికులు

గత ఏడాది కంటే 10.19 శాతం పెరుగుదల

Advertisement
Advertisement