‘సూపర్‌’ మార్ట్‌లు | Sakshi
Sakshi News home page

‘సూపర్‌’ మార్ట్‌లు

Published Sat, May 13 2023 1:16 AM

మాడుగులలో వైఎస్సార్‌ చేయూత మిహిళా సూపర్‌ మార్ట్‌  - Sakshi

పేదకుటుంబాల్లో ప్రతి మహిళా ఆర్థికంగా నిలదొక్కుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం మహిళలకు అనేక సంక్షేమ పథకాలను అందిస్తుంది. ఇందులో భాగంగా మహిళా సంఘాలను వేదికగా చేసి ఏర్పాటు చేసిన మహిళా చేయూత సూపర్‌మార్ట్‌లు సూపర్‌ ఫలితాలు ఇస్తుండడంతో జిల్లాలో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో మార్టుల ఏర్పాటు దిశగా అధికారులు చొరవ చూపుతున్నారు. ఈ ఏడాది ఆరు జగనన్న సూపర్‌ మార్టుల ఏర్పాటును లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నెలాఖరుకు సబ్బవరంలో రూ.32 లక్షలతో సూపర్‌మార్టు ప్రారంభానికి పనులు జరుగుతున్నాయి. జూన్‌ నాటికి చోడవరం, క్రమంగా ఎస్‌.రాయవరం, నక్కపల్లి, నర్సీపట్నం, కె.కోటపాడులో ఏర్పాటు చేసేందుకు మహిళా సంఘాల సభ్యుల నుంచి చందాలు వసూలు చేస్తున్నారు.

లాభాల్లో మాడుగుల

సూపర్‌ మార్కెట్‌

గత ఏడాది డిసెంబర్‌ 9న 14,700 మంది మహిళా సభ్యుల చందాలతో రూ.32 లక్షలతో ప్రారంభించిన ‘మాడుగుల జగనన్న సూపర్‌ మార్కెట్‌ ’ లాభాల బాటలో సూపర్‌గా నడుస్తోంది. కేవలం ఆరు నెలల్లోనే.. అంటే మే నెల నాటికి మొత్తం రూ.55 లక్షల మేర వ్యాపారం జరిగింది. గడిచిన ఆరు నెలల్లో సగటున నెలకు రూ.12 లక్షల వరకు వ్యాపారం జరుగుతోంది. ఇలా నెలకు సరాసరి ఆదాయం రూ.1 లక్ష వరకు రాగా మార్కెట్‌ నిర్వహణ, సిబ్బంది జీతాలు పోగా రూ.50 వేల వరకు లాభం వచ్చింది. రోజుకు సగటున రూ.36 వేల వ్యాపారం జరుగుతోంది. మార్ట్‌లో మహిళా సంఘాల సభ్యులే సిబ్బందిగా ఉపాధి పొందుతున్నారు.

జిల్లాలో మరో ఆరు సూపర్‌ మార్ట్‌ల ఏర్పాటుకు డీఆర్‌డీఏ ప్రణాళిక

త్వరలో సబ్బవరం, చోడవరంలో ప్రారంభం

ఐటీసీ, అజియో, పీఅండ్‌జీ, హెచ్‌యూఎల్‌, ఫ్లిప్‌కార్ట్‌ హోల్‌సేల్‌ కంపెనీలతో ఒప్పందం

మహిళా సంఘాల సభ్యులకు ఉపాధి

తుమ్మపాల : మహిళా మార్ట్‌లు ఏర్పాటు చేయడం ద్వారా పేదరికంలో ఉన్న మహిళా గ్రూపులు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యం. డీఆర్డీఏ ఆధ్వర్యంలో వైఎస్సార్‌ క్రాంతి పథంలో మహిళా సంఘాలను ఒక వేదికగా చేర్చి వ్యాపారాల ఏర్పాటుకు ప్రోత్సహిస్తున్నారు. జిల్లాలో 39,899 సంఘాల్లో 4,34,320 మంది మహిళా సభ్యులతో పట్టణాల్లో కార్పొరేట్‌ సంస్థలకు దీటుగా చేయూత మహిళా మార్ట్‌ల పేరుతో సూపర్‌ మార్కెట్ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో మాడుగులలో చేయూత మహిళా మార్టు ఏర్పాటు చేసి దిగ్విజయంగా నడుపుతున్నారు. త్వరలో సబ్బవరం, చోడవరం పట్టణాల్లో ఒక్కో మార్ట్‌ను ప్రారంభించేందుకు పనులు జరుగుతున్నాయి. ఇలా మండలానికో చేయూత మహిళా మార్ట్‌ ఏర్పాటు చేయడమే లక్ష్యంగా డీఆర్డీఏ అధికారులు కార్యచరణ చేస్తున్నారు.

విస్తరణకు ప్రణాళికలు

ఇప్పటికే రాష్ట్రంలో పలు జిల్లాల్లో మహిళా మార్ట్‌లు విజయవంతంగా నడుస్తుండడంతో ప్రభుత్వం వీటిని విస్తరించే ఆలోచన చేస్తుంది. ఈ మేరకు ఐటీసీ, అజియో, పీఅండ్‌జీ, హెచ్‌యుఎల్‌ కంపెనీలతో పాటు ఫ్లిప్‌కార్ట్‌ హోల్‌సేల్‌తో ఒప్పందం ప్రకారం నాణ్యమైన సరుకులను తక్కువ ధరకే విక్రయిస్తున్నారు. మార్ట్‌ల నిర్వహణ ద్వారా వచ్చే లాభాలను డ్వాక్రా సంఘంలోని సభ్యులు పంచుకోనున్నారు. ఆసక్తి ఉంటే అవకాశం మేరకు లాభాలతో మరో సూపర్‌ మార్ట్‌ ఏర్పాటు చేసుకునే విధంగా డీఆర్డీఏ ప్రోత్సహిస్తుంది.

మహిళా ఉపాధిలో...

షాపింగ్‌ మాల్‌కు దీటుగా..
1/2

షాపింగ్‌ మాల్‌కు దీటుగా..

2/2

Advertisement

తప్పక చదవండి

Advertisement