విజ్ఞానానికి వివేకం తోడైతే విజయం మీదే.. | Sakshi
Sakshi News home page

విజ్ఞానానికి వివేకం తోడైతే విజయం మీదే..

Published Mon, Sep 4 2023 1:38 AM

- - Sakshi

● ‘సాక్షి’ మీడియా గ్రూపు, ఆర్‌సీ ఎగ్జామ్స్‌ సంస్థ సంయుక్తంగా గ్రూప్‌–2 ఉద్యోగాలపై అవగాహన ● హాజరైన లెజెండరీ ఫ్యాకల్టీలు అబ్దుల్‌ కరీం, కృష్ణారెడ్డి, పాషా, హరికృష్ణ ● త్వరలో గ్రూప్‌–2 పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు

సాక్షి, విశాఖపట్నం: పోటీ పరీక్షల్లో రాణించాలంటే వైవిధ్యమైన ఆలోచనకు సృజనాత్మకత జోడించడం ద్వారా విజయం సాధించవచ్చని హిస్టరీ ఫ్యాకల్టీ డాక్టర్‌ అబ్దుల్‌ కరీం అన్నారు. ఎంత మంది విద్యార్థులు పోటీ పరీక్షలు రాసినా..విజ్ఞానంతో పాటు వివేకం తోడైతేనే విజయం సొంతమవుతుందని సూచించారు. రామాటాకీస్‌ సమీపంలోని అంబేడ్కర్‌ భవన్‌లో ‘సాక్షి మీడియా గ్రూపు’, ‘హైదరాబాద్‌ ఆర్‌సీ ఆన్‌లైన్‌ ఎగ్జామ్స్‌ సంస్థ’ సంయుక్తంగా గ్రూపు–2 పోటీ పరీక్షలపై అవగాహన సదస్సును ఆదివారం నిర్వహించారు. ఇప్పటికే రాష్ట్రంలో వేల సంఖ్యలో ఉద్యోగాలు భర్తీ చేసిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం త్వరలో గ్రూపు–2 ద్వారా పెద్దసంఖ్యలో ఉద్యోగాలు భర్తీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్న సమయంలో ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధించడమే లక్ష్యంగా..ఇందుకు అవసరమైన నైపుణ్యాలను అందించేందుకు అవగాహన సదస్సు ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ సదస్సులో పోటీ పరీక్షల్లో నిష్ణాతులుగా పేరొందిన అధ్యాపకులు డాక్టర్‌ అబ్దుల్‌ కరీం (హిస్టరీ), సి.హరికృష్ణ (సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ), బి.కృష్ణారెడ్డి (పాలిటీ), ఎండీ పాషా తదితరులు

గ్రూపు–2 పోటీ పరీక్షలపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా అబ్దుల్‌ కరీం మాట్లాడుతూ పోటీ పరీక్షల్లో మన ప్రిపరేషన్‌ ప్రశ్నపత్రం స్థాయికంటే ఉన్నతంగా ఉండాలి. పరీక్షల స్టాండర్డ్స్‌ ఎప్పటికప్పుడు పెరుగుతున్న నేపథ్యంలో శిక్షణ కఠినతరంగా ఉండాలని తెలిపారు. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లలో శిక్షణ లభిస్తున్నప్పటికీ ఆఫ్‌లైన్‌లో పొందే శిక్షణ ద్వారా పోటీతత్వం తెలుస్తుందని పేర్కొన్నారు. పోటీతీవ్రతను దృష్టిలో ఉంచుకుని మన పక్కవాని కంటే ఒక మార్కు ఎక్కువ సాధించేలా శ్రమించేలా ఎప్పటికప్పుడు సబ్జెక్టులో అప్డేట్‌ అవుతూ ఉండాలన్నారు. నిష్ణాతులైన, అనుభవం కలిగిన లెజండరీ ఫ్యాకల్టీ ఒకేచోట ఉన్న ఆర్‌సీ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ పొందితే విజయం మీ సొంతమవుతుందన్నారు.

సైన్‌న్స్‌ అండ్‌ టెక్నాలజీ ఫ్యాకల్టీ హరికృష్ణ మాట్లాడుతూ ఇతరుల అనుభవాలను తెలుసు కోవడం ద్వారా అభ్యర్థులు విజయం సాధించవచ్చున్నారు. మనం చదివే ప్రతీ సబ్జెక్టును మనచుట్టూ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా అన్వయించుకోవాలన్నారు. ఎక్కువసార్లు సాధన చేయడమే విజయ రహస్యమన్నారు.

ఎకానమీ ఫ్యాకల్టీ ఎం.డి. పాషా మాట్లాడుతూ పోటీ ప్రపంచంలో సమయం ఎంతో విలువైనదని, నోటిఫికేషన్‌ జారీచేసేలోగా సిలబస్‌ పూర్తి చేస్తే.. ప్రిపరేషన్లో ముందు ఉండాలన్నారు. ఎకానమీ సబ్జెక్టు అభ్యర్థులు విజయాన్ని డిసైడ్‌ చేస్తుందని, సరైన ప్రణాళిక విజయానికి బాటలు వేస్తుందన్నారు.

పాలిటీ ఫ్యాకల్టీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ..పోటీపరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు ప్రశ్నలు ఎలా వస్తాయో ఊహించేలా సబ్జెక్టుపై పట్టు సాధించాలన్నారు. ఇందుకు తగ్గ విజయప్రణాళికను సిద్ధం చేసుకోవాలి సూచించారు.

టాపర్లకు నగదు బహుమతి

పోటీ పరీక్షల నిపుణులు గ్రూప్‌–2 పరీక్ష విధివిధానాలు, మార్కులు సులువుగా సాధించే అంశాలపై మెలకువలు, ఉదాహరణలతో వివరించారు. అనంతరం అభ్యర్థులకు ఆఫ్‌లైన్‌ పరీక్ష నిర్వహించి..ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన అభ్యర్థులకు నగదు బహుమతి, స్టడీ మెటీరియల్‌, తర్వాత స్థానాల్లో నిలిచిన 20 మందికి ప్రామాణిక స్టడీ మెటీరియల్‌ అందజేశారు. ప్రథమ స్థానంలో నిలిచిన పి.శిరీషకు, ద్వితీయ స్థానంలో కె.ప్రతాప్‌, తృతీయ స్థానంలో పి.పవన్‌ కళ్యాణ్‌లకు నగదు బహుమతి, స్టడీ మెటీరియల్స్‌ అందజేశారు. ఈ కార్యక్రమంలో ‘సాక్షి’ విశాఖ యూనిట్‌ బ్రాంచ్‌ మేనేజర్‌ చంద్రరావు, సాక్షి ప్రకటనల డీజీఎం శ్రీనివాసరావు, రీజినల్‌ ఈవెంట్‌ ఇన్‌చార్జి ఆర్‌.మారుతి, అంబేడ్కర్‌ మెమోరియల్‌ సొసైటీ ప్రెసిడెంట్‌ కల్యాణ్‌రామ్‌ తదితరులు పాల్గొన్నారు.

అవగాహన సదస్సుకు హాజరైన నిరుద్యోగులు
1/2

అవగాహన సదస్సుకు హాజరైన నిరుద్యోగులు

2/2

Advertisement
Advertisement