ఆవుదూడ..ఆర్థిక అండ! | Sakshi
Sakshi News home page

ఆవుదూడ..ఆర్థిక అండ!

Published Wed, Oct 4 2023 1:16 AM

లేగదూడల ప్రదర్శనలో పెయ్యలు - Sakshi

● పెయ్యల సంతానోత్పత్తికి ప్రోత్సాహం ● రాయితీపై రూ.500కే కృత్రిమ గర్భధారణ ఇంజక్షన్‌ ● జిల్లాలో 3,500 ఆవులు,గేదెలకు వేయాలని లక్ష్యం ● జిల్లాలో 50కిపైగా ఆడపెయ్యల జననం

నాతవరం: ఆవుదూడల సంతానోత్పత్తికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీని ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందేలా పాడి రైతులను ప్రోత్సహిస్తోంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ పాలిచ్చే మేలుజాతి పశువులు అధిక ఆదాయాన్ని ఇస్తుంటాయి. వీటి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లి కొనుగోలు చేయడానికి వ్యయప్రయాస పడకుండా మన రాష్ట్రంలోనే మన పశువులకే సంకరజాతి పెయ్యలు జన్మించేందుకు రాయితీపై కృత్రిమ గర్భధారణ ఇంజక్షన్లు (వీర్యం) సరఫరా చేస్తోంది. ఈ పథకం గతేడాది అక్టోబరులో ప్రారంభమైంది. ఉమ్మడి జిల్లాలో మొదటగా 3,500 ఇంజక్షన్లు (ముర్రా, జెర్పీ, హెచ్‌.ఎఫ్‌, జెర్సీక్రాస్‌, హెచ్‌.ఎప్‌, క్రాస్‌, గిర్‌, సాహివాల్‌ రకాల జాతలు లింగ నిర్ధారణ వీర్యం) ఆవు లేదా గేదెలకు చేసేందుకు లక్ష్యాన్ని విధించింది. వీటిని ఉమ్మడి జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ ద్వారా రైతుల కల్లాల వద్దకే గోపాలమిత్రులు వెళ్లి పశువులు ఎదకు వచ్చినప్పుడు చేస్తున్నారు.

ఇప్పటికే 196 మంది గోపాలమిత్రలతో 2,500 ఇంజక్షన్లు

జిల్లాలో 197 మంది గోపాలమిత్రులు పని చేస్తున్నారు. ఇంతవరకు 2500పైగా కృత్రిమ గర్భధారణ ఇంజక్షన్లు పశువులకు చేయగా, ప్రస్తుతం 50పైగా పశువులు ఆడ పెయ్యిలు జన్మించాయి. ఈ ఇంజక్షను చేసిన ఆవు లేదా గేదె కచ్చితంగా ఆడ పెయ్య జన్మిస్తుంది. ఇటీవల నాతవరం మండలం వెంకయ్యపాలెం, గోవిందపురం, జిల్లేడుపూడి గ్రామాల్లో అధిక శాతం పశువులకు పెయ్యలు జన్మించాయి. రైతులు ఆయా పెయ్యిల కోసం గతంలో ఇతర రాష్ట్రాలకు వెళ్లి కొనుగోలు చేసేవారు. తమ కల్లాల వద్దే అటువంటివి పుట్టడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

రాయితీపై ఇంజక్షన్ల సరఫరా

పాడి పశువులకు పెయ్యలు జన్మించేందుకు ఇంజక్షన్లు రాయితీపై ప్రభుత్వం రైతులకు సరఫరా చేస్తోంది. ఇంజక్షను ఖరీదు రూ.1350 కాగా, రైతుకు కేవలం రూ.500కే ఇస్తున్నారు. పశువు ఎదకు వచ్చినప్పుడు ఫోన్‌ ద్వారా గోపాలమిత్రకు సమాచారం ఇస్తే రైతు కల్లాం వద్దకు వచ్చి ఇంజక్షను చేస్తారు. ఇంజక్షనుతో జన్మించిన సంకర జాతి పశువులు అధిక పాలిస్తాయి. ఈ నేపథ్యంలో విశాఖ డెయిరీకి పాలు సరఫరా చేసే ఉత్పత్తిదారులకు ఇంజక్షన్‌ రూ.250కే ఇస్తామని సంబంధిత చైర్మన్‌ ఆడారి ఆనంద్‌ ప్రకటించారు.

లేగదూడల ప్రదర్శనలకు నిధుల మంజూరు

పాడి రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ ఏడాది జిల్లాలో 50పైగా లేగదూడల ప్రదర్శనలు ఏర్పాటు చేసేందుకు రూ.5 లక్షలు మంజూరు చేసింది. ఇంతవరకు 20పైగా లేగదూడల ప్రదర్శనలు ఏర్పాటు చేసి, పాడి రైతులకు ప్రోత్సాహకాలు అందించారు. వచ్చే నెల మరో 30 లేగదూడల ప్రదర్శనల ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేశారు. వీటి ద్వారా పశువుల పెంపకం, ఆరోగ్యపరమైన అంశాలపై పశువైద్యులు రైతులకు అవగాహన కల్పించి చైతన్య పరస్తున్నారు.

రైతులు సద్వినియోగం చేసుకోవాలి

పాడి రైతులకు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలు సద్వినియోగం చేసుకోవాలి. రాయితీపై పెయ్యిల జన్మించే ఇంజక్షన్లు, లేగదూడల ప్రదర్శనకు ప్రోత్సాహకాలు ప్రభుత్వం అందిస్తుంది. గోపాలమిత్రులతోపాటు రైతు భరోసా కేంద్రంలో పశుసహాయకులు రైతులకు అందుబాటులో ఉంటారు.

–రామ్మోహన్‌రావు, పశుగణాభివృద్ధి సంస్థ ఎగ్జిక్యూటివ్‌ అధికారి, ఉమ్మడి జిల్లా

ఇంజక్షను ద్వారా జన్మించిన పెయ్య
1/2

ఇంజక్షను ద్వారా జన్మించిన పెయ్య

2/2

Advertisement
Advertisement