22 గంటల సుదీర్ఘ విచారణ | Sakshi
Sakshi News home page

22 గంటల సుదీర్ఘ విచారణ

Published Thu, Nov 16 2023 1:04 AM

డీఎఫ్‌వో రాజారావు, సిబ్బందిని న్యాయస్థానానికి తీసుకువెళ్తున్న ఏసీబీ అధికారులు - Sakshi

● ఏసీబీ న్యాయస్థానానికి డీఎఫ్‌వో రాజారావు ● ఈనెల 29 వరకు రిమాండ్‌ విధించిన కోర్టు

నర్సీపట్నం: లంచం తీసుకుంటుండగా డీఎఫ్‌వోను వల పన్ని పట్టుకున్న అవినీతి నిరోధక శాఖ అధికారులు.. అటవీ శాఖలో అవకతవకలపై 22 గంటలపాటు సుదీర్ఘంగా విచారణ జరిపారు. ఏసీబీ అడిషనల్‌ ఎస్పీ కె.శ్రావణి నేతృత్వంలో డీఎస్పీ రమ్య, సీఐలు కిషోర్‌కుమార్‌, సతీష్‌కుమార్‌, ఇతర సిబ్బంది మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో జిల్లా అటవీశాఖ అధికారి కార్యాలయంలో ప్రారంభించిన తనిఖీలు మరుసటి రోజు బుధవారం మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగాయి. అటవీ శాఖ అధికారి కార్యాలయంపై వచ్చిన ఆరోపణలపై సమగ్రంగా విచారణ చేశారు. జిల్లా అటవీశాఖ అధికారి రాజారావు, ఎఫ్‌ఆర్‌ఓ నారాయణమూర్తి, రైటర్‌ శ్రావణ్‌కుమార్‌లను అధికారులు బుధవారం విశాఖ ఏసీబీ న్యాయస్థానానికి తరలించగా.. న్యాయమూర్తి ఈనెల 29 వరకు రిమాండ్‌ విధించారు. విశాఖ తరలించేముందు స్థానిక ఏరియా ఆస్పత్రిలో నిందితులకు వైద్య పరీక్షలు చేయించారు.

డీఎఫ్‌వో నరకం చూపించాడు...

చెట్లు నరికేందుకు, అనుమతులు ఇచ్చేందుకు డీఎఫ్‌వో రాజారావు ఎంతగానో తిప్పించాడని, నరకం చూపించాడని బాధితుడు బలిరెడ్డి ఈశ్వరరావు తెలిపాడు. 280 చెట్లు నరుక్కునేందుకు, రవాణా అనుమతుల కోసం మార్చి నెలలో దరఖాస్తు చేశానని, అందుకు పెద్ద మొత్తంలో డిమాండ్‌ చేశారని చెప్పాడు. అంత ఇచ్చుకోలేనని చెప్పినా వినలేదని, ఐదు పర్మిట్లకు రూ.15 వేలకు బదులు రూ.30 వేలు, చెట్టు ఒక్కంటికి రూ.28 వేలు ఇస్తేనే అనుమతులు ఇస్తానని డీఎఫ్‌వో చెప్పారన్నాడు. డబ్బులు ఇవ్వలేదని తొమ్మిది నెలలుగా అనుమతులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టాడని, దీంతో ఈ నెల 9వ తేదీన ఏసీబీ అధికారులను ఆశ్రయించానని చెప్పాడు. ఏసీబీ అధికారుల సూచన మేరకు డీఎఫ్‌వో వద్దకు వెళ్లి.. మీరు అడిగినంత ఇస్తానని ఒప్పుకున్నానని, సొమ్ము ఎఫ్‌ఆర్‌వో నారాయణమూర్తికి ఇవ్వమని డీఎఫ్‌వో చెప్పారని వివరించాడు. నారాయణమూర్తి సూచనతో శ్రావణ్‌కుమార్‌ డబ్బులు తీసుకున్నాడని చెప్పాడు. ఆయన నుంచి సొమ్ము అందుకొని ఫీల్డ్‌ విజిట్‌కు బయలుదేరుతుండగా ఏసీబీ అధికారులు డీఎఫ్‌వోను పట్టుకున్నారని చెప్పాడు.

బాధితుడు బలిరెడ్డి ఈశ్వరరావు
1/1

బాధితుడు బలిరెడ్డి ఈశ్వరరావు

Advertisement

తప్పక చదవండి

Advertisement