పంచ శైవ క్షేత్రాలకు, శబరిమలకు ప్రత్యేక బస్సులు | Sakshi
Sakshi News home page

పంచ శైవ క్షేత్రాలకు, శబరిమలకు ప్రత్యేక బస్సులు

Published Thu, Nov 16 2023 1:04 AM

-

అనకాపల్లిటౌన్‌: కార్తీక మాసంలో పంచ శైవక్షేత్రాలు దర్శించుకునే భక్తులకు నాలుగు ఆదివారాలు ప్రత్యేక సర్వీసులను నడుపుతున్నట్లు జిల్లా ప్రజా రవాణా శాఖ(ఆర్టీసీ) అధికారి కె.పద్మావతి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. భక్తుల కోరిక మేరకు అనకాపల్లి డిపో నుంచి ఈ నెల 20, 27, డిసెంబర్‌ 4, 11 తేదీల్లో పంచ శైవ క్షేత్రాలకు బస్‌ సర్వీసులు నడుస్తాయన్నారు. పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌లు ఆదివారం సాయంత్రం అనకాపల్లి డిపో నుంచి బయలుదేరి సోమవారం రాత్రి డిపోకు చేరుతాయన్నారు. అనకాపల్లి నుంచి అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోట పుణ్యక్షేత్రాలను ఒక్కరోజులో దర్శించుకునే అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. బస్సు మొత్తాన్ని ఒకే గ్రామం నుంచి బుక్‌ చేసుకుంటే ఇద్దరు భక్తులను ఉచితంగా అనుమతిస్తామన్నారు. పల్లె వెలుగు సర్వీస్‌ పెద్దలకు రూ.1,100, ఎక్స్‌ప్రెస్‌ సర్వీస్‌ పెద్దలకు రూ.1,250 చొప్పున చెల్లించాల్సి ఉంటుందన్నారు. కార్తీక మాసంలో వివిధ ప్రాంతాలకు పిక్నిక్‌లకు వెళ్లే వారికి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడంతోపాటు, స్కూల్‌ విద్యార్థులకు ప్రత్యేక ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయన్నారు.

శబరిమల యాత్రకు ప్రత్యేక సర్వీసులు

అనకాపల్లి డిపో నుంచి శబరిమల యాత్రకు వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక సర్వీసులను నడుపుతున్నట్లు పద్మావతి తెలిపారు. 5 రోజుల ప్యాకేజీ సూపర్‌ లగ్జరీ బస్‌లకు ఒక్కొక్కరికి రూ.6,600, 6 రోజుల ప్యాకేజీ రూ.7 వేలు, 7 రోజుల ప్యాకేజీ రూ.7,500లు ఛార్జీలుగా చెల్లించాలన్నారు. మరిన్ని వివరాలకు 73829 13967, 86394 31199, 99592 25595 నంబర్లను సంప్రదించాల్సిందిగా కోరారు.

జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారి పద్మావతి

Advertisement

తప్పక చదవండి

Advertisement