నెట్స్‌లో చెమటోడ్చారు | Sakshi
Sakshi News home page

నెట్స్‌లో చెమటోడ్చారు

Published Wed, Nov 22 2023 12:58 AM

వార్మప్‌ చేస్తున్న ఆస్ట్రేలియా ఆటగాళ్లు - Sakshi

విశాఖ స్పోర్ట్స్‌: టీ–20 సిరీస్‌లో భాగంగా విశాఖ వేదికగా తొలి మ్యాచ్‌ ఆడనున్న భారత్‌, ఆస్ట్రేలియా జట్లు మంగళవారం వైఎస్సార్‌ స్టేడియంలో సాధన చేశాయి. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి నాలుగు వరకు భారత్‌ జట్టు.. ఐదు నుంచి ఎనిమిది గంటల వరకు ఫ్లడ్‌లైట్ల వెలుతురులో ఆస్ట్రేలియా జట్టు ప్రాక్టీస్‌ చేసింది. గురువారం రాత్రి ఏడు గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో అందుకు తగ్గట్టుగానే మాథ్యూ వేడ్‌ సారథ్యంలో ఆ జట్టు శ్రమించింది. ఆస్ట్రేలియా కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌తో పాటు వరల్డ్‌కప్‌ ఆడిన మిచెల్‌ మార్ష్‌, జోస్‌ హేజెల్‌వుడ్‌, కామెరాన్‌ గ్రీన్‌, మిచెల్‌ స్టార్క్‌ విశ్రాంతి తీసుకోవడంతో.. వీరి ఆటను ప్రత్యక్షంగా చూడాలనుకున్న విశాఖ అభిమానులకు నిరాశే ఎదురైంది. అంతర్జాతీయ వేదికపై తొలిసారిగా ఆడేందుకు ఆస్ట్రేలియా ఆటగాళ్లు జాసన్‌, టిమ్‌, నాథన్‌, జాన్సన్‌, షార్ట్స్‌, స్టోయినిష్‌ ఇప్పటికే విశాఖ చేరుకుని ప్రాక్టీస్‌ చేశారు. విశాఖ పిచ్‌పై అనుభవం ఉన్న డేవిడ్‌ వార్నర్‌ను బోర్డ్‌ చివరి నిమిషంలో వెనక్కి పిలవడంతో మరోసారి అతని ఆటను అభిమానులు మిస్‌ అయ్యారు. అతని స్థానంలో ఆల్‌రౌండర్‌ హార్డీ రానున్నాడు. స్టీవ్‌ స్మిత్‌, వరల్డ్‌ కప్‌ ఫైనల్స్‌ సెంచరీ హీరో ట్రావిన్‌ హెడ్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌, మార్కస్‌, జంపా, జోష్‌, అబాట్‌తో పాటు రిజర్వ్‌ ఆటగాడు తన్వీర్‌ నెట్స్‌లో చెమటోడ్చాడు. ఇక భారత్‌ తరఫున ఆసియా కప్‌తో పాటు ఐర్లాండ్‌తో మ్యాచ్‌లాడిన ఆటగాళ్లే విశాఖలో ఆడనున్నారు. ఐర్లాండ్‌తో ఆడిన భారత్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన బుమ్రాకు విశ్రాంతినిచ్చి.. సూర్యకుమార్‌ యాదవ్‌కు జట్టు సారథ్య బాధ్యతలు అప్పగించారు. రుతురాజ్‌ వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా వికెట్ల వెనుక జితేశ్‌ నిలవనున్నాడు. శ్రేయాస్‌ను జట్టుకు ఎంపిక చేసినా.. విశాఖలో మ్యాచ్‌కు విశ్రాంతి తీసుకుంటుండంతో ప్రాక్టీస్‌కు రాలేదు. ప్రపంచ కప్‌కు ఎంపికై న ఇషాన్‌ కిషాన్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ విశాఖలో ఆడనున్నారు. యశస్వి, తిలక్‌, రింకూ, శివం, అర్ష్‌దీప్‌, సుందర్‌, రవి బిష్ణోయ్‌లు మంగళవారం ప్రాక్టీస్‌ చేశారు. తొలిసారిగా భారత్‌ జట్టుకు కోచ్‌గా సేవలందిస్తున్న వి.వి.ఎస్‌.లక్ష్మణ్‌ పర్యవేక్షణలో విశాఖ వేదికగా ఇండియా శుభారంభం చేస్తుందని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు.

పిచ్‌ను పరిశీలిస్తున్న కోచ్‌ లక్ష్మణ్‌
1/2

పిచ్‌ను పరిశీలిస్తున్న కోచ్‌ లక్ష్మణ్‌

2/2

Advertisement

తప్పక చదవండి

Advertisement