Sakshi News home page

రికార్డు కోసం.. సాధన చేసి..

Published Mon, Dec 25 2023 1:56 AM

ఆసనాలు వేస్తున్న యోగాభ్యాసకులు  - Sakshi

● యోగాసన బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు కోసం ఓం ఫ్రీ యోగా సంస్థ ప్రయత్నం ● 230 మందితో 216 రౌండ్లలో సూర్యనమస్కారాల సాధన ● జనవరి 9న గాదిరాజు ప్యాలెస్‌ వేదికగా ప్రధాన కార్యక్రమం

సీతమ్మధార: విభిన్న రంగాల్లో రికార్డులతో ఖ్యాతిగాంచిన విశాఖ నగరం సరికొత్త రికార్డు సృష్టించేందుకు సిద్ధమైంది. 230 మంది సాధకులు, 216 రౌండ్ల సూర్య నమస్కారాలతో.. యోగాసన బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు కోసం ‘ఓం ఫ్రీ యోగా సంస్థ’ దరఖాస్తు చేసింది. ఇందులో భాగంగా సీతమ్మధారలోని ఎస్‌ఎఫ్‌ఎస్‌ స్కూల్‌ ప్రాంగణంలో ఆదివారం డెమో నిర్వహించింది. ఉదయం ఐదు గంటలకు ప్రారంభమైన కార్యక్రమం రెండు గంటల పాటు సాగింది. యోగాభ్యాసకులు 216 రౌండ్స్‌లో 2,592 సార్లు సూర్య నమస్కారాలు చేశారు. మరో 50 మంది 108 రౌండ్లలో సూర్య నమస్కారాలు చేసినట్లు ఓం ఫ్రీ యోగా సంస్థ ఫౌండర్‌ చైర్మన్‌ చిలక వెంకట రమేష్‌ తెలిపారు. ఈ కార్యక్రమానికి ఉత్తరాంధ్ర జిల్లాల యోగాభ్యాసకులు హాజరైనట్లు వెల్లడించారు. జనవరి 9న గాదిరాజు ప్యాలెస్‌ వేదికగా ప్రధాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజల్లో ఆరోగ్య చైతన్య కోసం తమ సంస్థ నగరంలోని వివిధ ప్రాంతాల్లో ప్రతి రోజూ ఉదయం ఉచితంగా యోగా శిక్షణ ఇస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈ నెల 30వ తేదీ లోపు పేర్లు నమోదు చేసుకోవాలని, మరిన్ని వివరాలకు 93333 33344ను సంప్రదించాలని కోరారు.

Advertisement
Advertisement