నేడు, 13న ‘స్పందన’ రద్దు | Sakshi
Sakshi News home page

Published Mon, Mar 6 2023 12:44 AM

- - Sakshi

అనంతపురం అర్బన్‌: ఎమ్మెల్సీ ఎన్నికల విధుల్లో అధికారులు పూర్తిగా నిమగ్నమై ఉన్నందున కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించాల్సిన స్పందన కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్‌ నాగలక్ష్మి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 13న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ ఉన్నందున ఆ రోజున కూడా ‘స్పందన’ రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి అర్జీలు ఇచ్చేందుకు వ్యయ, ప్రయాసలకోర్చి జిల్లా కేంద్రానికి రావొద్దని సూచించారు.

డీటీ శ్రీనివాస్‌ రావుకు తప్పిన ప్రమాదం

పెనుకొండ రూరల్‌: అనంతపురం కలెక్టరేట్‌లో డిప్యూటీ తహసీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్‌ రావుకు ఘోర ప్రమాదం తప్పింది. ఆదివారం ఆయన ప్రయాణిస్తున్న కారు మండల పరిధిలోని పుట్టపర్తి మలుపు సమీపంలో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొన్న అనంతరం మరో కారును ఢీకొంది. ఘటనలో శ్రీనివాస్‌ రావుకు ఎలాంటి గాయాలు కాలేదు. అయితే, ఆయన కారు ముందుభాగం మాత్రం పాక్షికంగా దెబ్బతింది.

రేషన్‌ బియ్యం పట్టివేత

ఆత్మకూరు: కర్ణాటకలోని పావగడకు అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని విజిలెన్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలను సీఎస్‌డీటీ అన్సర్‌ వెల్లడించారు. అందిన సమాచారం మేరకు ఆత్మకూరు మండలం వడ్డుపల్లి వద్ద ఆదివారం ఉదయం విజిలెన్స్‌ అధికారులు వాహన తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో అటుగా వచ్చిన మినీ లారీని అడ్డుకుని పరిశీలించగా 487 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టుబడింది. వాహనాన్ని సీజ్‌ చేసి, బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. బియ్యం తరలిస్తున్న గుంటూరు సుధాకర్‌, హరికృష్ణను అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. అనంతరం ముట్టాల గ్రామం వద్ద అక్రమంగా తరలిస్తున్న 33 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకుని రెడ్డిపల్లికి చెందిన సోమశేఖర్‌, హరికృష్ణను అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. వాహనాన్ని సీజ్‌ చేసి, బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

బాలికల హాకీ విజేత వైఎస్సార్‌

ద్వితీయ స్థానంలో అనంత జట్టు

అనంతపురం సప్తగిరి సర్కిల్‌: అనంత క్రీడాగ్రామం వేదికగా సాగిన సబ్‌ జూనియర్‌ బాలికల హాకీ టోర్నీ విజేతగా వైఎస్సార్‌ జిల్లా జట్టు నిలిచింది. రన్నరప్‌ను అనంతపురం జిల్లా జట్టు దక్కించుకుంది. ఆదివారం నిర్వహించిన ఫైనల్‌ మ్యాచ్‌లో వైఎస్సార్‌, అనంతపురం జిల్లా జట్లు తలపడ్డాయి. చివరి నిమిషం వరకూ ఉత్కంఠగా సాగిన పోరులో 55వ నిమిషంలో వైఎస్సార్‌ జిల్లా జట్టు క్రీడాకారిణి సాయి విద్య ఓ గోల్‌ సాధించి జట్టును విజయతీరానికి చేర్చింది. తృతీయస్థానం కోసం జరిగిన పోటీలో శ్రీకాకుళం, శ్రీసత్యసాయి జిల్లా జట్లు తలపడ్డాయి. 4–1 గోల్స్‌ తేడాతో శ్రీసత్యసాయి జిల్లా జట్టు గెలుపొందింది. జట్టులో మధురిమబాయి 2, నవ్యశ్రీ, సింధు చెరో గోల్‌, శ్రీకాకుళం జట్టులో తులసి ఒక గోల్‌ను సాధించారు. ఈ సందర్భంగా విజేతలను అభినందిస్తూ ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సప్తగిరి క్యాంఫర్‌ ఎండీ మహమ్మద్‌ హనీఫ్‌, రవికాంత్‌ రమణ హాజరయ్యారు. విజేతలకు ట్రోఫీలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. క్రీడాకారులకు ప్రభుత్వం మంచి అందిస్తున్న ప్రోత్సాహాన్ని అందిపుచ్చుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షిచారు. కార్యక్రమంలో రాష్ట్ర హాకీ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు సూర్యప్రకాష్‌, అనంతపురం జిల్లా కన్వీనర్‌ అనిల్‌రాజ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

రన్నర్స్‌ ట్రోఫీని అందుకుంటున్న 
అనంతపురం జిల్లా జట్టు
1/2

రన్నర్స్‌ ట్రోఫీని అందుకుంటున్న అనంతపురం జిల్లా జట్టు

స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని 
చూపుతున్న విజిలెన్స్‌ అధికారులు
2/2

స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని చూపుతున్న విజిలెన్స్‌ అధికారులు

Advertisement
Advertisement