కస్టడీకి ‘హవాలా’ దోపిడీ ముఠా | Sakshi
Sakshi News home page

కస్టడీకి ‘హవాలా’ దోపిడీ ముఠా

Published Mon, Mar 20 2023 1:16 AM

హవాలా సొమ్ము దోపిడీ ముఠా సభ్యుల వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ ఫక్కీరప్ప (ఫైల్‌) 
 - Sakshi

అనంతపురం శ్రీకంఠంసర్కిల్‌: రిమాండ్‌లో ఉన్న హవాలా సొమ్ము దోపిడీ ముఠాకు చెందిన నలుగురు సభ్యులను అనంతపురం పోలీసులు విచారణ నిమిత్తం తమ కస్టడీకి తీసుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో 44వ జాతీయ రహదారి మీదుగా తరలుతున్న ‘హవాలా’ సొమ్ము రాప్తాడు సమీపంలోని హంపాపురం వద్ద దారి దోపిడీకి గురైంది. ‘హవాలా’ దోపిడీల్లో ఆరితేరిన కేరళ శ్రీధరన్‌ నేతృత్వంలోని గ్యాంగ్‌ల పనే ఇది అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఆ దిశగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. శ్రీధరన్‌ నేతృత్వంలోని ఒక ముఠా సభ్యులైన కేరళ రాష్ట్రం ఎర్నాకులం జిల్లా ఆలువ వెస్ట్‌ గ్రామానికి చెందిన కొలపురం బిల్‌ అబు నిషాద్‌, కొట్టాయం జిల్లా చెంగానచేపూర్‌కు చెందిన జాక్సన్‌ ఫిలిప్‌, అలప్పుజ జిల్లా వేలంకులంగరకు చెందిన కన్నన్‌ రియాగు, కాలికట్‌ జిల్లా వడకర గ్రామానికి చెందిన ఓతవాత్‌ షమీంలను మార్చి పదో తేదీన అరెస్టు చేశారు. అయితే కీలక నిందితుడు శ్రీధరన్‌తో పాటు మరికొంతమంది సభ్యులు పోలీసుల కళ్లుగప్పి తప్పించుకున్నారు. ఈ ముఠా ఆట కట్టించాలని ఎస్పీ ఫక్కీరప్ప రంగం సిద్ధం చేశారు. అందులో భాగంగా కేరళ ముఠాను పట్టుకునేందుకు ఇంతకుమునుపు వెళ్లిన బృందాలను తిరిగి రంగంలోకి దింపాలని చూస్తున్నారు. అందులో భాగంగా ఆదివారం సాయంత్రం ఎస్పీ సంబంధిత అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో ఈ ముఠాల కదలికను గుర్తించాలని ఆదేశించారు. ఏ చిన్న ఆధారం లభించినా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిసింది. హవాలా డబ్బును చాకచక్యంగా దోచుకుపోతున్న ముఠా వివరాలను ఇప్పటి దాకా పట్టుబడిన నలుగురు నిందితుల ద్వారా రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఉగ్రవాద సంస్థలతో సంబంధాల

కోణంలోనూ విచారణ..

రాప్తాడు సమీపంలో జరిగిన దారి దోపిడీ ముఠా కోసం గాలిస్తున్న అనంత పోలీసులకు రూ.1.89 కోట్ల హవాలా డబ్బు తీసుకెళ్తున్న మరో ముఠా పట్టుబడింది. ఈ ముఠా నుంచి కూడా డబ్బు దోచుకెళ్లాలని వచ్చిన శ్రీధరన్‌ ముఠాను ‘అనంత’ పోలీసులు పట్టుకున్నారు. కాగా హవాలా డబ్బు తీసుకెళుతున్న ముఠాతో పాటు ఆ డబ్బును దోచుకెళ్లేందుకు వచ్చిన ముఠా రెండూ పట్టుబడటంతో పోలీసులు దర్యాప్తును మరింత లోతుగా చేపట్టారు. కాగా రూ.1.89 కోట్ల హవాలా డబ్బు తీసుకెళ్తున్న వారు తమిళనాడు, కోయంబత్తూరుకు చెందిన వారు కావడంతో సీఐసీ (సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ సెల్‌) అధికారుల బృందం అనంతపురం చేరుకుంది. రెండు నెలల క్రితం కోయంబత్తూరులో పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో హవాలా ముఠాలకు ఏమైనా హస్తం ఉందా? కేరళ శ్రీధరన్‌ ఎవరు? హవాలా డబ్బు సమాచారాన్ని ఎలా సేకరిస్తున్నారు? ఈ సొమ్ము ఎక్కడికి పంపుతున్నారు? ఉగ్రవాద సంస్థలతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా? అన్న కోణంలో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

రంగంలోకి సీఐఎస్‌ బృందం

ఉగ్రవాద సంస్థలతో సంబంధాలపై ఆరా

శ్రీధరన్‌ కోసం గాలింపు

Advertisement
Advertisement