ఉపాధితో ఉద్యానం | Sakshi
Sakshi News home page

ఉపాధితో ఉద్యానం

Published Tue, Mar 21 2023 2:02 AM

- - Sakshi

అనంతపురం టౌన్‌: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా డ్రైల్యాండ్‌ హార్టికల్చర్‌ను మరింత ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పండ్ల తోటల రైతులకు పైసా ఖర్చులేకుండా ఉపాధి నిధులతో అండగా నిలుస్తోంది.‘అనంత’ను ఉద్యాన జిల్లాగా మార్చేందుకు ఏటా హార్టికల్చర్‌ విస్తీర్ణాన్ని పెంచుతోంది. అందులో భాగంగానే వచ్చే ఆర్థిక సంవత్సరం (2023–24)లో 4వేల ఎకరాలకు పైగా పండ్ల తోటల పెంపకం చేపట్టాలని లక్ష్యం నిర్దేశించింది. ఇందు కోసం ఐదెకరాల్లోపు మెట్ట భూములున్న రైతుల నుంచి డ్రైల్యాండ్‌ హార్టికల్చర్‌ పథకం కింద దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

అంతర పంటలకు శ్రీకారం
పండ్ల మొక్కల సాగుకు దరఖాస్తు చేసుకున్న రైతులకు అదనపు ఆదాయం సమకూర్చే విధంగా 2023–24 నుంచి నుంచి పండ్ల మొక్కలతోపాటు అంతర పంటగా మునగ, పూల మొక్కలు (కనకాంబరాలు, రోజా, జాస్మిన్‌)లో ఏదో ఒకటి అంతర పంటగా సాగు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించారు. పండ్ల మొక్కలు సాగు చేసిన నాటి నుంచి పంట చేతికివచ్చేందుకు దాదాపు ఐదు సంవత్సరాల సమయం పడుతుంది. ఈ సమయంలో రైతు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా అంతర పంటగా పూల తోటల సాగును ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యచరణ చేపట్టింది. ఒక ఎకరా వరకు పూల సాగు చేసుకునే విధంగా అవకాశం కల్పించారు. అంతర పంటగా పూల తోటలు సాగు చేస్తే ఏడాది పొడవునా రైతుకు ఆదాయం సమకూర్చే దిశగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది.

9రకాల పండ్ల మొక్కలకు అవకాశం
ఉపాధి హామీ డ్రైల్యాండ్‌ హార్టిక్చర్‌ పథకంలో రైతుల నేల స్వభావాన్ని బట్టి తొమ్మిది రకాల పండ్ల మొక్కలు సాగు చేసుకునేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. అన్ని రకాల పండ్ల మొక్కల సాగుకు అనంతపురం జిల్లా అనువైన ప్రాంతం. దీంతో రైతులు సైతం పండ్ల మొక్కల సాగుకు ఆసక్తి చూపుతున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి సాగు చేసేందుకు మామిడి, చీనీ, నిమ్మ, దానిమ్మ, తైవాన్‌ జామ, సపోట, డ్రాగన్‌ ఫ్రూట్‌, అల్లనేరేడు, అంజూర పండ్ల మొక్కలను ఎంపిక చేశారు. వీటిలో రైతులు ఏ పండ్ల మొక్కల సాగుపై ఆసక్తి ఉంటే వాటి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. గుంతలు తవ్వే దగ్గరి నుంచి మొక్కలతోపాటు ఫర్టిలైజర్స్‌తో కలిపి పండ్ల మొక్కలను బట్టి ఎకరాకు దాదాపు రూ.80 వేల నుంచి రూ.లక్షదాకా ప్రభుత్వం ఖర్చు పెట్టనుంది. దీంతో పాటు అదనంగా మూడేళ్ల పాటు మొక్కలకు నీటిని పెట్టి సంరక్షించుకునేందుకు రైతుకు వాటర్‌ బిల్లును సైతం అందించనుంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement