ప్రాజెక్టులను విధ్వంసం చేసింది చంద్రబాబే | Sakshi
Sakshi News home page

ప్రాజెక్టులను విధ్వంసం చేసింది చంద్రబాబే

Published Sat, Aug 5 2023 12:20 AM

మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి   - Sakshi

అనంతపురం క్రైం: ‘అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు జిల్లాలోని వివిధ ప్రాజెక్టులను విధ్వంసం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ ఆ ప్రాజెక్టుల పనులను అధిక శాతం పూర్తిచేసి జీవం పోశారు. సీఎం వైఎస్‌ జగన్‌ హయాంలో గాలేరు నగరిని హంద్రీనీవాతో అనుసంధానం ప్రక్రియ ప్రారంభించారు. రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌, పోతిరెడ్డి పాడు సామర్థ్యం పెంచేలా, రాబోయే రోజుల్లో హంద్రీనీవా ప్రాజెక్టును పూర్తిగా జిల్లాకే ఉపయోగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది’ అని మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచేలా సీఎం వైఎస్‌ జగన్‌ రూ.వెయ్యి కోట్లతో రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ కోసం కృషి చేశారన్నారు. టీడీపీ హయాంలో హంద్రీనీవాకు కేవలం 23 టీఎంసీల నీరు తీసుకొస్తే.. వైఎస్‌ జగన్‌ సీఎం అయినప్పటి నుంచి ఏటా 33 టీఎంసీలకుపైగా నీరు తీసుకువచ్చారన్నారు. చంద్రబాబు హయాంలో ఆత్మహత్యలకు కేంద్రంగా అనంతపురం నిలిచిందని, వ్యవసాయ సంక్షోభం తారాస్థాయికి చేరిందన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. గ్రీన్‌ ట్రిబ్యూనల్‌ ద్వారా రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుకు అడ్డుపడిన చరిత్ర టీడీపీదని మండిపడ్డారు. పోతిరెడ్డి హెడ్‌ రెగ్యులేటర్‌పైన రూపాయి ఖర్చు పెట్టకుండా రాయలసీమ ప్రాజెక్టుకు నీరు ఏవిధంగా తెస్తోరో టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పాలన్నారు.

దొంగ ఓట్లపై కేశవ్‌ గగ్గోలు..

ఉరవకొండలో 7,500 దొంగ ఓట్లపై విచారణ చేయాలని ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకెళితే ఉరవకొండ ఎమ్మెల్యే కేశవ్‌ గగ్గోలు పెడుతున్నారన్నారు. దొంగ ఓట్లతో గెలిచిన కేశవ్‌ రెవెన్యూ, తదితర అధికారులను బెదిరింపులకు గురి చేసేలా వ్యవహరిస్తున్నారన్నారు. పయ్యావుల కేశవ్‌కు ధైర్యముంటే విచారణకు సహకరించాలన్నారు. కదిరిలో చంద్రబాబు వైనాట్‌ 175 అని అన్నారని, కనీసం కుప్పంలో ఆయన గెలిచే పరిస్థితి లేదన్నారు.

మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి

Advertisement
Advertisement