రీ–సర్వే వేగవంతం చేయాలి | Sakshi
Sakshi News home page

రీ–సర్వే వేగవంతం చేయాలి

Published Fri, Nov 3 2023 2:10 AM

ఆత్మకూరు మండలం పంపనూరులోసచివాలయాలన్ని పరిశీలిస్తున్న సీఈ కృష్ణారెడ్డి   - Sakshi

అనంతపురం అర్బన్‌: ‘జిల్లాలో ఈ ఏడాది లోటు వర్షపాతం నమోదైంది. హెచ్‌ఎల్‌సీ, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ ద్వారా వచ్చే నీటిని తాగునీటి అవసరాలకు వినియోగించాల్సి ఉంది. అధిక నీటి వినియోగ పంటలైన వరి, మొక్కజొన్న, వేరుశనగ, ఉద్యానపంటలు సాగు చేయొద్దు’’ అని కలెక్టర్‌ ఎం.గౌతమి రైతులకు సూచించారు. ఈ మేరకు గురువారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ఏడాది ఖరీఫ్‌ పంట కాలానికి సాధారణ వర్షపాతం 319.7 మిల్లీ మీటర్లు కాగా (22.6 శాతం తక్కువ వర్షపాతం) 247.4 మిల్లీ మీటర్లు నమోదయ్యిందన్నారు. రబీలో ఇప్పటి వరకు 93.7 శాతం లోటు వర్షపాతం నమోదైందన్నారు. 28 మండ లాలను కరువు ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ఈ క్రమంలో తాగునీటి అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నీటిని ఎక్కువగా వినియోగించే పంటలను సాగు చేయరాదని కోరారు. బోర్ల కింద కూడా సాగు తగ్గించుకోవాలని చెప్పారు. రైతులు సహకరించాలని, అధిక పెట్టుబడులు పెట్టి నష్టపోవద్దని కలెక్టర్‌ గౌతమి సూచించారు.

రీ–సర్వే వేగవంతం చేయాలి

‘వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష’ కింద జిల్లాలో చేపట్టిన రీ–సర్వే వేగవంతం చేయాలని కలెక్టర్‌ గౌతమి అధికారులను ఆదేశించారు. రీ–సర్వే, రెవెన్యూ తదితర అంశాలపై ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సీసీఎల్‌ఏ జి.సాయిప్రసాద్‌ విజయవాడలోని తన కార్యాలయం నుంచి కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అనంతపురం నుంచి కలెక్టర్‌తో పాటు జాయింట్‌ కలెక్టర్‌ కేతన్‌గార్గ్‌, డీఆర్‌ఓ గాయత్రిదేవి పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం కలెక్టర్‌ రీ–సర్వేపై అధికారులతో సమీక్షించారు. జిల్లాలో రీ–సర్వే ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలన్నారు. మూడో విడతలో ఎంపిక చేసిన గ్రామాల్లో రీ–సర్వే వేగవంతం చేయాలన్నారు. ఈ క్రమంలో ప్రతి ప్రక్రియ నాణ్యతగా నిర్వహిస్తూ గడువులోపు పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో సర్వే, భూ రికార్డుల శాఖ ఏడీ రూప్లా నాయక్‌, ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ సర్వే ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

వారిని సస్పెండ్‌ చేయండి

అనంతపురం సిటీ: గ్రామ సచివాలయాలు, ఆర్‌బీకేలు, వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌ల నిర్మాణాల పురోగతిలో వెనుకబడిన ఉరవకొండ, కళ్యాణదుర్గం, రాయదుర్గం డివిజనల్‌ ఇంజినీర్లు (డీఈఈలు), అసిస్టెంట్‌ ఇంజినీర్లు (ఏఈఈలు) సహా సచివాలయాల్లో పని చేసే ఇంజినీరింగ్‌ సహాయకులపై కలెక్టర్‌ గౌతమి సీరియస్‌ అయ్యారు. సంబంధిత అధికారులతో గురువారం ఆమె వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. లక్ష్య సాధనలో వెనుకబడిన వారిని సస్పెండ్‌ చేయాలని పీఆర్‌ ఎస్‌ఈ భాగ్యరాజ్‌ను ఆదేశించారు.

సీఈ క్షేత్రస్థాయి పర్యటన

పంచాయతీరాజ్‌ చీఫ్‌ ఇంజినీర్‌ (సీఈ) కృష్ణారెడ్డి కూడా గురువారం జిల్లాలో పర్యటించారు. ఆత్మకూరు మండలం పంపనూరు, కళ్యాణదుర్గం మండలం బోరంపల్లి, రాయదుర్గం నియోజకవర్గంలోని గుమ్మఘట్ట మండలం మారంపల్లిలో నిర్మాణంలో ఉన్న గ్రామ సచివాలయాలు, ఆర్‌బీకేలు, వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌లను పీఆర్‌ ఎస్‌ఈ భాగ్యరాజ్‌తో కలసి పరిశీలించారు. లక్ష్య సాధనంలో వెనుకబడి ఉండడంతో సీఈ కృష్ణారెడ్డి సీరియస్‌ అయ్యారు. డీఈఈలు రాజన్న (కళ్యాణదుర్గం), రామ్మోహన్‌రెడ్డి (రాయదుర్గం)తో పాటు ఏఈఈలు పార్థసారఽథి (ఆత్మకూరు), కిశోర్‌కుమార్‌ (కళ్యాణదుర్గం), లక్ష్మీనారాయణ (గుమ్మఘట్ట)పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయా గ్రామ సచివాలయాల ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్‌ఈ భాగ్యరాజ్‌ను ఆదేశించారు.

కలెక్టర్‌ గౌతమి

కలెక్టర్‌ గౌతమి
1/1

కలెక్టర్‌ గౌతమి

Advertisement
Advertisement