అధికారుల సర్వేతో వెలుగులోకి.. | Sakshi
Sakshi News home page

అధికారుల సర్వేతో వెలుగులోకి..

Published Sat, Nov 11 2023 1:22 AM

- - Sakshi

తాడిపత్రి: తెలుగుదేశం హయాంలో రూ.కోట్లు విలువ చేసే బంజరు భూములను ఆ పార్టీ నేత ఒకరు కబ్జా చేశారు. కొందరు అధికారులు లోపాయికారిగా ఆ నేతకు సహకరించినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే... తాడిపత్రి మండలం చిన్నపొలమడ పంచాయితీ పరిధిలో సర్వే నంబర్‌ 411 ఏ1ఏలో 1.79 ఎకరాలు, 411 ఏ1బిలో 1.66 ఎకరాలు, 411 ఏ3లో 34 సెంట్లు మొత్తం 3.79 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. తాడిపత్రి – పెద్దపప్పూరు ప్రధాన రహదారిలో గల ఈ భూమిని వైఎస్సార్‌ జిల్లా సిద్దవటం ప్రాంతానికి చెందిన ఓ టీడీపీ నేత కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టారు. అందులో గ్రానైట్‌ పరిశ్రమలు ఏర్పాటు చేసుకుని వ్యాపారాలు నిర్వహిస్తున్నారు.

అధికారుల సర్వేతో వెలుగులోకి..

ప్రభుత్వ కార్యాలయాల భవనాల నిర్మాణానికి చిన్నపొలమడ పంచాయతీ పరిధిలో బంజరు భూములు ఏ మేరకు ఉన్నాయో సర్వే చేయాలని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి 2020లో అధికారులకు లేఖ రాశారు. దీంతో జిల్లా సర్వే అధికారులు చిన్నపొలమడ పంచాయతీ పరిధిలోని అసైన్డ్‌ భూములను సర్వే చేయగా సదరు ‘పచ్చ’నేత 3.79 ఎకరాలు ఆక్రమించినట్లు గుర్తించారు. ఇదే కాకుండా ఈ పంచాయితీ పరిధిలో దాదాపు 40 ఎకరాల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైనట్లు అప్పట్లో గుర్తించారు. భూ కబ్జాపై ఎమ్మెల్యే పెద్దారెడ్డి కలెక్టర్‌ గౌతమికి ఫిర్యాదు చేశారు. పేదలకు, ప్రభుత్వానికి చెందాల్సిన విలువైన భూమిని కాపాడి అందులో ప్రభుత్వ కార్యాలయ భవనాలు నిర్మించేందుకు స్థలాన్ని కేటాయించాలని ఈ ఏడాది ఆగస్టు 10న కలెక్టర్‌కు లేఖ రాశారు. 411 సర్వే నంబర్‌లోని 3.79 ఎకరాల్లోని భూమిని భూగర్భ గనుల శాఖ, ఐసీడీఎస్‌, కార్మికశాఖ కార్యాలయాల భవనాలకు కేటాయించాలని కోరారు. స్పందించిన కలెక్టర్‌ ఆక్రమణలను తొలగించి సమగ్ర నివేదిక పంపాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు.

ఆదేశాలు బేఖాతరు

కలెక్టర్‌ ఆదేశాలను రెవెన్యూ అధికారులు తుంగలో తొక్కారు. 411 సర్వే నంబర్‌లోని ఆక్రమణలను ఇంతవరకు తొలగించకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఇక్కడి నుంచి బదిలీ అయిన జిల్లా రెవెన్యూ ఉన్నతాధికారితో పాటు తాడిపత్రికి చెందిన రెవెన్యూ అధికారి కూడా సదరు ‘పచ్చ’ నేత సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఆదేశాలను బేఖాతరు చేసినట్లు తెలిసింది.

టీడీపీ నేత చిన్నపొలమడ వద్ద కబ్జా చేసిన స్థలంలో చేపట్టిన నిర్మాణాలు

3.79 ఎకరాల బంజరు భూమిలో పాగా

అధికారుల సర్వేలో బట్టబయలు

Advertisement
Advertisement