మద్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం | Sakshi
Sakshi News home page

మద్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం

Published Sat, Nov 11 2023 1:22 AM

పట్టుబడ్డ మద్యం బాక్సులను చూపుతున్న  అడిషనల్‌ ఎస్పీ రామకృష్ణ   - Sakshi

రాయదుర్గం: జిల్లాలో గంజాయి, మద్యం, సారా అక్రమ రవాణా, విక్రయాలపై ఉక్కుపాదం మోపామని అడిషనల్‌ ఎస్పీ జి.రామకృష్ణ అన్నారు. గురువారం రాయదుర్గం సెబ్‌ పోలీస్‌స్టేషన్‌ను ఆయన అకస్మీకంగా తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఎస్పీ ఆదేశాల మేరకు కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో నిఘా మరింత పటిష్టం చేశామన్నారు. జిల్లాలో గడిచిన పది రోజుల్లో అక్రమ మద్యం రవాణా, అమ్మకాలకు సంబంధించి 53 కేసుల్లో 59 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నామన్నారు. మద్యం కేసుల్లో 11 వాహనాలు సీజ్‌ చేసినట్టు స్పష్టం చేశారు. అక్రమంగా ఇసుక రవాణా చేస్తూ పట్టుబడిన వారిపై 14 కేసులు నమోదు చేశామన్నారు. సారా తయారీ, విక్రయాలను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. మద్యం అక్రమ రవాణా అరికట్టేందుకు వాహన తనిఖీలు మరింత విస్తృతం చేస్తామన్నారు. వరుసగా రెండు లేదా ఆపై ఎక్కువసార్లు పట్టుబడితే పీడీ యాక్టు కింద కేసు నమోదు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఐ హరికృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.

మద్యం రవాణాదారుల అరెస్టు

కర్ణాటక నుంచి అక్రమంగా మద్యం రవాణా చేస్తున్న కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన ముక్కాల తిమ్మప్ప, బాపనల్లి తిప్పేస్వామిలను రాయదుర్గంలోని మద్దానేశ్వర ఆలయ సమీపాన శుక్రవారం ఉదయం అరెస్టు చేసినట్లు అడిషనల్‌ ఎస్పీ రామకృష్ణ తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన రాయదుర్గం సెబ్‌ స్టేషన్‌లో మీడియాకు వెల్లడించారు. వీరి నుంచి 1,056 టెట్రా ప్యాకెట్ల మద్యం, రెండు ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. మద్యం రవా ణాదారులను అరెస్టు చేయడంలో చాకచక్యంగా వ్యవహరించిన సెబ్‌ ఎస్‌ఐ హరికృష్ణను అభినందించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement