ఆకస్మిక అలజడి | Sakshi
Sakshi News home page

ఆకస్మిక అలజడి

Published Sun, Nov 12 2023 1:28 AM

- - Sakshi

అనంతపురం: జేఎన్‌టీయూ అనంతపురం పరిధిలోని అనుబంధ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ఆకస్మిక తనిఖీలతో యాజమాన్యాల్లో అలజడి ప్రారంభమయ్యింది. 2023–24 విద్యా సంవత్సరం అనుబంధ గుర్తింపు దక్కించుకుని కోర్సులు ప్రారంభమైన తర్వాత వర్సిటీ యాజమాన్యం ఆకస్మిక తనిఖీలు చేస్తుండడంతో ఆందోళన మొదలైంది. విద్యార్థి, అధ్యాపక నిష్పత్తి, కళాశాలల్లో సదుపాయాలు, ల్యాబ్‌లో ప్రాక్టికల్స్‌లో కేటాయించిన మార్కులు తదితర అంశాలపై పరిశీలిస్తున్నారు. వర్సిటీ నిబంధనలకనుగుణంగా అధ్యాపకులకు వేతనాలు చెల్లిస్తున్నారా? లేదా అని ఆరాతీస్తున్నారు. ఆకస్మిక తనిఖీలతో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కళాశాలల గుట్టు రట్టయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో జేఎన్‌టీయూఏ యాజమాన్య నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

జేఎన్‌టీయూ అనంతపురం పరిధిలో 90 ఇంజినీరింగ్‌ కళాశాలలు ఉన్నాయి. వీటిల్లో ప్రధానంగా కంప్యూటర్‌ సైన్స్‌, దానికి అనుబంధంగా వచ్చిన కొత్త కోర్సు అంశంలోనే అధికారులు దృష్టి సారించారు. సైబర్‌ సెక్యూరిటీ, డేటా సైన్స్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, రోబోటెక్స్‌ వంటి కోర్సుల్లో అవసరమైన ప్రోగ్రామ్స్‌ ఉన్నాయా? మౌలిక సదుపాయాలు ఏ మేరకు ఉన్నాయి? అనే అంశాలను తనిఖీ బృందాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. బయోమెట్రిక్‌ హాజరు విధానాన్ని వర్సిటీ తప్పనిసరి చేసినా, పలు కాలేజీలు దీన్ని అనుసరించలేదు. ఈ అంశాన్ని కూడా పరిశీలనలో భాగం చేయాలని నిర్ణయించారు. కాలేజీల్లో బోధించే సిబ్బంది వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయడమే కాకుండా, వారి వ్యక్తిగత పాన్‌ కార్డుల ఆధారంగా ఆదాయ పన్ను శాఖ ద్వారా వివరాలు సేకరిస్తున్నారు.

పక్కా సమాచారంతో తనిఖీలు..

బీటెక్‌ తరగతులు ఇప్పటికే ప్రారంభమయి నెలన్నర అవుతోంది. అనుబంధ గుర్తింపు దక్కించుకుని కోర్సులు ప్రారంభమయిన అనంతరం వర్సిటీ యాజమాన్యం పక్కా సమాచారంతో ఆకస్మిక తనిఖీలు చేయడం ఆందోళనలకు కారణం. వాస్తవానికి ప్రతి ఏటా అనుబంధ హోదా గుర్తింపు జారీ చేస్తారు. అనుబంధ గుర్తింపుకు దరఖాస్తు చేసుకునే సమయంలోనే వర్సిటీ నిజనిర్ధారణ కమిటీని నియామకం చేసి కళాశాలలోని సౌకర్యాలను పరిశీలిస్తారు. నిజనిర్ధారణ కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు ఆయా కళాశాలలోని ఇంజినీరింగ్‌ సీట్లు ఎన్ని కేటాయించాలి? గుర్తింపు ఇవ్వాలా? వద్దా? అనే అంశంపై స్పష్టతకు వస్తారు. ఈ క్రమంలో 2023–24 విద్యా సంవత్సరం ప్రారంభంకు ముందే జేఎన్‌టీయూ అనంతపురం నిజనిర్ధారణ కమిటీ నియామకం చేసింది. కళాశాలలను పరిశీలించి నివేదిక అందజేశారు. సీట్లు కేటాయింపు పూర్తయ్యింది.

అధ్యాపకులకు అత్తెసరు జీతాలు :

వర్సిటీకి చెందిన రెండు బృందాలను ఆకస్మిక తనిఖీల నిమిత్తం నియమించారు. అనుబంధ గుర్తింపు హోదా దరఖాస్తు సమయంలో పొందుపరిచిన అంశాలు, నిజ నిర్ధారణ కమిటీలు ఇచ్చిన నివేదిక మేరకు సౌకర్యాలు ఉన్నాయా? లేదా? అని పరిశీలిస్తున్నారు. విద్యార్థి నిష్పత్తికి అనుగుణంగా అధ్యాపకులను నియామకం చేశారా? అధ్యాపకులకు వర్సిటీ నిబంధనల మేరకు జీతాలు, పీఎఫ్‌, చెల్లిస్తున్నారా? అనే అంశాలు పరిశీలిస్తున్నారు. అయితే సింహభాగం కళాశాలల్లో వర్సిటీ నిబంధలకు విరుద్ధంగా అత్తెసరు జీతాలు చెల్లిస్తున్నట్లు తనిఖీల్లో వెలుగులోకొచ్చింది. ఉన్నత విద్యార్హతలు ఉన్నా తక్కువ వేతనాలు చెల్లిస్తున్నారు. నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయాల్సి ఉండగా, చేతికి అందిస్తూ మ్యానువల్‌గా సంతకాలు చేయించుకుంటున్నారు. ఎంటెక్‌ పూర్తి చేసిన వారినే అధ్యాపకులుగా నియామకం చేయాల్సి ఉంది. కేవలం బీటెక్‌ అర్హతతోనే అధ్యాపకులుగా నియామకం చేసుకున్నట్లు బయటపడింది.

అనుబంధ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో తనిఖీలు

కోర్సు ప్రారంభమయ్యాక జేఎన్‌టీయూఏలో తొలిసారి

అన్ని అంశాలపైనా క్షుణ్ణంగా పరిశీలన

నాణ్యత ప్రమాణాలు తప్పనిసరి

వర్సిటీ పరిధిలోని ఇంజినీరింగ్‌ కళాశాలల్లో అకడమిక్‌గా బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నాం. నాణ్యత ప్రమాణాలు పెంపుదలపై ప్రత్యేక దృష్టి సారించాం. ఈ క్రమంలోనే ఇంజినీరింగ్‌ కళాశాల్లోని మౌలిక సదుపాయాలు, బోధన ప్రమాణాలను పరిశీలిస్తున్నాం. తొలిసారిగా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నాం. మభ్యపెట్టి అనుబంధ గుర్తింపు తెచ్చుకొని ఉంటే ఉపేక్షించబోం.

– ప్రొఫెసర్‌ జింకా రంగజనార్దన, వీసీ, జేఎన్‌టీయూ అనంతపురం

Advertisement
Advertisement