బాధిత కుటుంబాలకు భరోసా | Sakshi
Sakshi News home page

బాధిత కుటుంబాలకు భరోసా

Published Mon, Nov 27 2023 1:50 AM

- - Sakshi

అనంతపురం సెంట్రల్‌: రోడ్డు ప్రమాద బాధితులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త పథకాన్ని తీసుకొచ్చింది. ‘హిట్‌ అండ్‌ రన్‌ రోడ్డు యాక్సిడెంట్‌–2022’ ద్వారా బాధితులను ఆదుకోవాలని నిర్ణయించింది. యాక్సిడెంట్‌కు కారణమైన వాహనాలు, నిందితులు పట్టుబడకపోయినా పరిహారం అందించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. గుర్తు తెలియని వాహనాలు ఢీకొట్టి చనిపోతే రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50వేల పరిహారం కేంద్ర ప్రభుత్వం అందించనుంది.

ఇన్సూరెన్సు తప్పనిసరి

రోడ్డు ప్రమాదాలు కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. కుటుంబ సభ్యులను కోల్పోయిన వారి వేదన వర్ణనాతీతం. ఏటా జిల్లాలో వందల్లో మృతి చెందుతుంటే... వేలాదిమంది క్షతగాత్రులుగా మారుతున్నారు. ప్రమాదాల నివారణకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నా నిర్లక్ష్యపు డ్రైవింగ్‌, అతివేగం.. రోడ్డు నిబందనల పాటించకపోవడం తదితర కారణాలతో ఎక్కడో ఒక చోట ప్రమాదాలు నిత్యకృత్యమవుతున్నాయి. ప్రమాదాల్లో మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వాలు ఇన్సూరెన్స్‌ పథకాలు తీసుకొచ్చాయి. గాయపడినా.. మృతి చెందినా ప్రమాదాలకు కారణమైన వాహనాల ఇన్సూరెన్స్‌ కంపెనీల నుంచి పరిహారాన్ని క్లెయిమ్‌ చేసుకునే హక్కు కల్పించాయి. ఇన్సూరెన్స్‌ స్కీములు బాధితులకే కాకుండా వాహన యజమానులకు కూడా భరోసా కల్పిస్తున్నాయి. అందుకే ప్రతి వాహనానికీ ఇన్సూరెన్స్‌ తప్పనిసరి చేశారు.

ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..

రోడ్డు ప్రమాదంలో గాయపడిన, మృతి చెందిన వారిపై ఆధారపడిన కుటుంబసభ్యులు ఆరు నెలల్లోపు ఘటనాస్థలం పరిధిలోని తహసీల్దార్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌, ఆధార్‌ ఇతరత్రా ధ్రువీకరణ పత్రాలను జత చేసి వినతిపత్రాన్ని తహసీల్దార్‌కు అందజేయాలి. తహసీల్దార్‌ పరిశీలించిన వెంటనే కలెక్టర్‌కు నివేదిస్తారు. రోడ్డు సేఫ్టీ సమావేశంలో చర్చించిన తర్వాత కలెక్టర్‌ ప్రొసీడింగ్స్‌ను జారీ చేస్తారు. ఢిల్లీలోని జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ నుంచి పరిహారం మంజూరవుతుంది. 2022 సంవత్సరంలో ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. కానీ సరైన ప్రచారం, అవగాహన లేమితో జిల్లాలో ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. ఇప్పటి వరకు ఒక్కరికి కూడా ఈ స్కీము ద్వారా పరిహారం రాలేదు. అయితే దర ఖాస్తు కూడా చేసుకోకపోవడం గమనార్హం.

ప్రతి వాహనానికీ ఇన్సూరెన్స్‌ తప్పనిసరి

రోడ్డు ప్రమాద సమయంలో

ఉపయోగకరం

వాహనాలు పట్టుబడకపోయినా పరిహారం

మృతి చెందిన వారికి రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు

‘హిట్‌ అండ్‌ రన్‌ రోడ్‌ యాక్సిడెంట్‌– 2022’ను అమల్లోకి తెచ్చిన కేంద్రం

1/1

Advertisement
Advertisement