-

మతసామరస్యానికి ప్రతీక దర్గా హొన్నూరు

28 Nov, 2023 02:26 IST|Sakshi

బొమ్మనహాళ్‌: ఉమ్మడి తెలుగు రాష్ట్రంలోనే మతసామరస్యానికి ప్రతీకగా నిలిచిన దర్గాల్లో ఒక్కటైన బొమ్మనహాళ్‌ మండలంలోని దర్గాహోన్నూరులో వెలసిన హజరత్‌ ఖ్వాజా సయ్యద్‌ షా సూఫీ శర్మస్త్‌ హుస్సేనీ చిస్తీ స్వామి ఉరుసు ఉత్సవాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు దర్గా కమిటీ సభ్యులు వెల్లడించారు.

హిందూముస్లింల ఐక్యతకు నిదర్శనం

హిందూముస్లింల ఐక్యతకు నిదర్శనంగా దర్గాహోన్నూరులో వెలసిన హజరత్‌ ఖ్వాజా సయ్యద్‌ షా సూఫీ శర్మస్త్‌ హుస్సేనీ చిస్తీ ఉత్సవాలు ప్రతి ఏటా జరుగుతుంటాయి. ఈ ఏడాది 345వ ఉరుసు ఉత్సవాలకు నిర్వాహకులు దర్గాను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఈ దర్గాకు ఉమ్మడి తెలుగు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచే కాక మహారాష్ట్ర, తమిళనాడు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఉరవకొండ, కణేకల్లు, విడపనకల్లు, కళ్యాణదుర్గం, వజ్రకరూరు, గుంతకల్లు, రాయదుర్గం, గుమ్మఘట్ట, డి.హీరేహాళ్‌, బెళుగుప్ప మండలాలతో పాటు కర్ణాటకలోని బళ్లారి, మొలకాల్మూరు, రాంపురం, హొసపేట ప్రాంతాల్లోని హిందూ, ముస్లింలు తమ ఇలవేల్పుగా స్వామిని కొలుస్తుంటారు. కాగా, ఏటా ఉరుసు సమయంలో భక్తుల తాకిడి పెరుగుతుండడంతో ఈ ఏడాది ప్రత్యేక బస్సులు నడపాలని భక్తులు కోరుతున్నారు.

గురువారం భక్తుల తాకిడి

హొన్నూరులోని దర్గాను సందర్శించేందుకు ప్రతి గురువారమూ వందలాది మంది భక్తులు వస్తుంటారు. ప్రత్యేక పూజలు, ప్రార్ధనలు పెద్ద ఎత్తున సాగుతాయి. పిల్లలను త్రాసులో ఉంచి అందుకు సమానంగా చక్కెర, పొడి బెల్లంతో స్వామికి మొక్కులు తీర్చుకుంటారు. తమ ఇలవేల్పుగా కొలిచేవారు ఇంటిలో పిల్లలకు స్వామి పేరు పెడుతుండడం గమనార్హం.

రేపటి నుంచి ఉరుసు

ఏర్పాట్లు పూర్తి చేసిన నిర్వాహకులు

మరిన్ని వార్తలు