పొరపాట్లకు తావివ్వకూడదు

29 Nov, 2023 01:50 IST|Sakshi
మాట్లాడుతున్న అబ్జర్వర్‌ మురళీధర్‌రెడ్డి

అనంతపురం అర్బన్‌: ప్రత్యేక ఓటరు జాబితా సవరణలో భాగంగా చేపట్టిన క్లెయిమ్‌ల పరిష్కారంలో పొరపాట్లకు తావివ్వకూడదని జిల్లా ఎలక్షన్‌ రోల్‌ అబ్జర్వర్‌ డి.మురళీధర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఓటరు జాబితా సవరణ అంశంపై అబ్జర్వర్‌ మంగళవారం కలెక్టరేట్‌ మినీ కాన్ఫరెన్స్‌ హాల్‌లో కలెక్టర్‌ గౌతమితో కలసి అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటరు జాబితా రూపకల్పనలో ఎన్నికల కమిషన్‌ ప్రక్రియ, నిబంధనలను అమలు చేయాలని ఆదేశించారు. కొత్త ఓటరు నమోదు, ఓట్ల తొలగింపు దరఖాస్తుల పరిశీలన నిక్కచ్చిగా చేయాలన్నారు. బీఎల్‌ఓలు క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటినీ సర్వే చేయాలన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ ఫిర్యాదులను ముందుగానే అందించాలని సూచించారు. కేంద్ర ఎన్నికల కమిషన్‌ ప్రతినిధులు డిసెంబరు 20న రాష్ట్రానికి వస్తారన్నారు. అప్పటికి క్లెయిమ్‌లు పరిష్కరించాలని చెప్పారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి ఓట్ల తొలగింపు క్లెయిమ్‌లను పరిష్కరిస్తున్నామని కలెక్టర్‌ గౌతమి తెలిపారు. దరఖాస్తులను మరోసారి పరిశీలించేందుకు వచ్చేవారం స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టనున్నట్లు చెప్పారు. అలాగే కొత్త ఓటరు నమోదుకు డ్రైవ్‌ చేపడుతామన్నారు. సమావేశంలో డీఆర్‌ఓ గాయత్రీదేవి, ఆర్డీఓలు గ్రంధి వెంకటేశ్‌, రాణీసుస్మిత, శ్రీనివాసులురెడ్డి, డిప్యూటీ కలెక్టర్లు రవీంద్ర, సుధారాణి, కరుణకుమారి, వెంకటేశ్వర్లు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

నిబంధనలు పాటించండి

క్షేత్రస్థాయిలో ఇంటింటి సర్వే చేపట్టాలి

దరఖాస్తులు పక్కాగా పరిశీలించండి

ఎలక్షన్‌ రోల్‌ అబ్జర్వర్‌ మురళీధర్‌రెడ్డి

మరిన్ని వార్తలు