లింగ నిర్ధారణ చట్టంపై చైతన్య పరచండి

29 Nov, 2023 01:50 IST|Sakshi
మాట్లాడుతున్న డాక్టర్‌ భ్రమరాంబదేవి (చిత్రంలో) వైద్యాధికారులు

అనంతపురం మెడికల్‌: లింగ నిర్ధారణ చట్టం, చట్టం అతిక్రమణతో ఎదురయ్యే ఇబ్బందులు, ఆడబిడ్డ ప్రాముఖ్యతపై ప్రజలను చైతన్య పరిచే కార్యక్రమాలు విస్తృతం చేయాలని వైద్యాధికారులను డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ భ్రమరాంబదేవి ఆదేశించారు. మంగళవారం ఉదయం తన చాంబర్‌లో వైద్యాధికారులతో ఆమె సమావేశమయ్యారు. వివిధ పీహెచ్‌సీల వారీగా వైద్యులను పరిచయం చేసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. లింగ నిర్ధారణ చట్టంపై అవగాహన లేకపోవడంతో చాలా మంది అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. ప్రతి పీహెచ్‌సీలో నెలకు పది ప్రసవాలు తప్పక జరగాలన్నారు. పీహెచ్‌సీ, పట్టణ ఆరోగ్య కేంద్రాల సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లకు సంబంధించిన అన్ని భవనాలను స్వాధీనం చేసుకోవాలన్నారు. పీహెచ్‌సీ, యూపీహెచ్‌సీలకు వచ్చే నిధులను ఎప్పటికప్పుడు సద్వినియోగం చేస్తూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలన్నారు. దృష్టి లోపం బాధపడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాల్లో గుర్తించిన ఉన్న వారికి శస్త్రచికిత్సలు చేయించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రెఫరల్‌ కేసులకు వైద్యం పూర్తి స్థాయిలో అందాలన్నారు. ఆయుష్మాన్‌ భారత్‌ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని ఆరోగ్య కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో ఆరోగ్య శ్రీ జిల్లా కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ కిరణ్‌కుమార్‌రెడ్డి, ఏఓ గిరిజామనోహర్‌, స్టాటిస్టిక్స్‌ అధికారి మారుతీప్రసాద్‌, డెమో ఉమాపతి, డిప్యూటీ డెమో త్యాగరాజు, గంగాధర్‌ పాల్గొన్నారు.

వైద్యాధికారుల సమావేశంలో

డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ భ్రమరాంబదేవి

మరిన్ని వార్తలు