ప్రత్యేక డ్రైవ్‌లో 7,939 క్లెయిమ్‌లు | Sakshi
Sakshi News home page

ప్రత్యేక డ్రైవ్‌లో 7,939 క్లెయిమ్‌లు

Published Tue, Dec 5 2023 5:20 AM

పాఠశాలను తనిఖీ చేస్తున్న మంత్రి   మేరుగు నాగార్జున    - Sakshi

అనంతపురం అర్బన్‌: ప్రత్యేక ఓటరు సవరణలో భాగంగా ఈ నెల 2, 3 తేదీల్లో జిల్లావ్యాప్తంగా 2,213 పోలింగ్‌ కేంద్రాల్లో నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లో 7,939 క్లెయిమ్‌లు అందాయి. కొత్తగా ఓటరు నమోదుకు 5,418 (ఫారం–6) దరఖాస్తులు, ఓటు తొలగింపునకు సంబంధించి 838 (ఫారం–7) దరఖాస్తులు, ఓటు వివరాల్లో చేర్పులు, మార్పునకు సంబంధించి 1,683 (ఫారం–8) దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ఇప్పటి వరకు 5,744 దరఖాస్తులను డిజిటలైజ్‌ చేసినట్లు అధికారులు తెలిపారు.

నేటి నుంచి ‘రబీ’ ఈ–క్రాప్‌

అనంతపురం అగ్రికల్చర్‌: రబీకి సంబంధించి మంగళవారం నుంచి జిల్లా వ్యాప్తంగా ఈ–క్రాప్‌ (పంట నమోదు) ప్రక్రియ మొదలవుతుందని జిల్లా వ్యవసాయ అధికారి (డీఏఓ) ఉమామహేశ్వరమ్మ సోమవారం తెలిపారు. డివిజన్‌, మండల, ఆర్‌బీకే స్థాయి అధికారులు, సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇవ్వడంతో పాటు అప్లికేషన్‌ను అందుబాటులోకి తెచ్చామన్నారు. సర్వే నంబరు ఆధారంగా జియో కో ఆర్డినేటర్స్‌తో ఫొటో తీసి అప్లికేషన్‌లో నమోదు చేయాలన్నారు. సాగు చేసిన పంట కాకుండా వేరే పంటలు నమోదు చేస్తే ప్రత్యేక తనిఖీలు చేపట్టి శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇన్‌పుట్‌, ఇన్సూరెన్స్‌, ఎంఎస్‌పీ అమ్మకాలు, పంట రుణాల సున్నావడ్డీ లాంటి ప్రభుత్వ ప్రయోజనాలు వర్తించాలంటే ఈ–క్రాప్‌, ఈ–కేవైసీ తప్పనిసరి అన్నారు. రైతులు కూడా ఆర్‌బీకే అసిస్టెంట్లను సంప్రదించి సకాలంలో ఈ ప్రక్రియ చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

నేడు 2కే రన్‌

అనంతపురం అర్బన్‌: ఓటు హక్కు ప్రాముఖ్యతను తెలియజేసేందుకు మంగళవారం నగరంలో 2కే రన్‌ నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ గౌతమి తెలిపారు. 2కే రన్‌ ఉదయం 8 గంటలకు ఆర్ట్స్‌ కళాశాల నుంచి బయలుదేరి ఎస్‌ఎస్‌బీఎన్‌ కళాశాల వరకు సాగుతుందన్నారు. ఓటరుగా యువత నమోదు చేసుకునేలా ప్రోత్సహించడం 2కే రన్‌ ప్రధాన ఉద్దేశమన్నారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

తెలంగాణలో

కాంగ్రెస్‌ గెలిస్తే మాకేంటి?

బుక్కరాయసముద్రం: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ గెలిస్తే తమకేంటని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. చంద్రబాబు ఎవరితోనైనా కలుస్తాడని, ఎవరి కాళ్లయినా పట్టుకుంటాడని విమర్శించారు. ఆయన సోమవారం బుక్కరాయసముద్రం మండలం కొర్రపాడు వద్ద ఉన్న డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ బాలికల గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా పాఠశాలలో ఎంత మంది విద్యార్థులు ఉన్నారని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేటుకు దీటుగా తీర్చిదిద్దారన్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ గెలవడానికి, వైఎస్సార్‌ సీపీకి ఏం సంబంధం ఉందని ప్రశ్నించారు. టీడీపీ నాయకులు మాత్రం ఎవరికో పుట్టిన బిడ్డలను ఎత్తుకుని ఎగురుతున్నారని విమర్శించారు. టీడీపీకి చేతనైతే తెలంగాణలో సైకిల్‌ గుర్తు పై పోటీ చేసి గెలవాలన్నారు. ఒకాయన ఎనిమిది చోట్ల పోటీ పెట్టి నోటా కంటే తక్కువ ఓట్లు సాధించారన్నారు. ఇంకొకాయన అసలు పోటీనే చేయకుండా జెండాలు పట్టుకుని ఎగిరి గంతు లేస్తున్నారని, ఆయన్ను కాంగ్రెస్‌ వాళ్లు ఎగిరి తంతారని అన్నారు. రాష్ట్ర విభజనలో పెద్ద కుట్ర జరిగిందన్నారు. చంద్రబాబు కాంగ్రెస్‌తో లాలూచీ పడినందునే రాష్ట్రాన్ని విభజించారన్నారు. పరోక్షంగా కాంగ్రెస్‌తో వెళుతున్నాడని, తెలంగాణలో సొంత పార్టీని గంగలో ముంచేసుకుని కాంగ్రెస్‌ గెలవాలనుకున్నాడన్నారు.

ఈ–క్రాప్‌ నమోదును పరిశీలిస్తున్న   డీఏఓ ఉమామహేశ్వరమ్మ (ఫైల్‌)
1/1

ఈ–క్రాప్‌ నమోదును పరిశీలిస్తున్న డీఏఓ ఉమామహేశ్వరమ్మ (ఫైల్‌)

Advertisement
Advertisement