కులగణన పక్కాగా చేపట్టాలి | Sakshi
Sakshi News home page

కులగణన పక్కాగా చేపట్టాలి

Published Tue, Dec 5 2023 5:20 AM

వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్న కలెక్టర్‌ గౌతమి  - Sakshi

అనంతపురం అర్బన్‌: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కులగణన జిల్లాలో పక్కాగా చేపట్టాలని కలెక్టర్‌ గౌతమి అధికారులను ఆదేశించారు. ఈ నెల 9న కులగణన సర్వే ప్రారంభమవుతుందన్నారు. కులగణన, రీసర్వే, వికసిత్‌ భారత్‌ సంకల్పయాత్ర, ఆడుదాం ఆంధ్రా, తదితర అంశాలపై కలెక్టర్‌ సోమవారం కలెక్టరేట్‌ నుంచి ఆర్డీఓలు, జిల్లా అధికారులు, ప్రత్యేక అధికారులు, మునిసిపల్‌ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. కులగణన సర్వేపై పూర్తిస్థాయి అవగాహన కలిగి ఉండాలన్నారు. చిన్నపాటి పొరపాట్లకు కూడా తావివ్వకుండా వారం రోజుల వ్యవధిలో ఇంటింటి సర్వే పారదర్శకంగా నిర్వహించేలా చూడాలని ఆదేశించారు. కులగణన సర్వేలో సంబంధిత సంక్షేమ శాఖల అధికారులు భాగస్వాముల కావాలని చెప్పారు.

7న జిల్లాకు ఇన్‌చార్జ్‌ అధికారి

వికసిత్‌ భారత్‌ సంకల్పయాత్ర పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ గౌతమి పేర్కొన్నారు. కార్యక్రమానికి సంబంధించి జిల్లాకు నియమించిన ఇన్‌చార్జ్‌ అధికారి ఈ నెల 7న జిల్లాకు విచ్చేయనున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 17 రకాల పథకాల అమలుపై ఆయా శాఖల జిల్లా అధికారులతో సమావేశం నిర్వహిస్తారన్నారు. 8న క్షేత్రస్థాయిలో పర్యటిస్తారన్నారు. అధికారులు పూర్తి వివరాలతో సిద్ధంగా ఉండాలన్నారు.

‘ఆడుదాం ఆంధ్రా’పై దృష్టి పెట్టాలి

‘ఆడుదాం ఆంధ్రా’ కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్‌ సూచించారు. కార్యక్రమం కింద రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభమయ్యిందన్నారు. ఎంపిక చేసి ఐదు క్రీడాంశాల్లోని (క్రికెట్‌, వాలీబాల్‌, బ్యాడ్మింటన్‌, కబడ్డీ, ఖోఖో) పోటీల కోసం రిజిస్ట్రేషన్‌ పకడ్బందీగా చేపట్టాలన్నారు. ఎంపీడీఓలు, మండల ప్రత్యేక అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. కంప్లీషన్‌ డ్రైవ్‌లో భాగంగా ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో సీపీఓ అశోక్‌కుమార్‌రెడ్డి, డిప్యూటీ కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, హౌసింగ్‌ పీడీ నరసింహారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

అధికారులకు కలెక్టర్‌ ఆదేశం

Advertisement
Advertisement