జిల్లా అంతటా శుక్రవారం పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గాయి. ఉదయం చలి కొనసాగింది. ఆకాశం మేఘావృతమై అక్కడక్కడా తేలికపాటి వర్షపాతం నమోదైంది. | Sakshi
Sakshi News home page

జిల్లా అంతటా శుక్రవారం పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గాయి. ఉదయం చలి కొనసాగింది. ఆకాశం మేఘావృతమై అక్కడక్కడా తేలికపాటి వర్షపాతం నమోదైంది.

Published Sat, Dec 9 2023 12:10 AM

మాట్లాడుతున్న డీఈఓ నాగరాజు  - Sakshi

11 నుంచి ‘అనంత సంకల్పం’

అనంతపురం ఎడ్యుకేషన్‌: పదో తరగతి విద్యార్థుల ఉత్తీర్ణతే లక్ష్యంగా విద్యాశాఖ అమలు చేస్తున్న ‘అనంత సంకల్పం’ షెడ్యూల్‌ను ఈ నెల 11 నుంచి అన్ని ఉన్నత పాఠశాలల్లో అమలు చేయాలని డీఈఓ వి.నాగరాజు ఆదేశించారు. ‘అనంత సంకల్పం’ మెటీరియల్‌ తయారీపై సబ్జెక్టు హెచ్‌ఎంలు, టీచర్లకు శుక్రవారం నగరంలోని ఉపాధ్యాయ భవనంలో వర్క్‌ షాపు నిర్వహించారు. డీఈఓ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మార్చిలో జరిగే పదో తరగతి పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించేలా అనంత సంకల్పం మెటీరియల్‌ను తయారు చేయాలని సూచించారు. అన్ని స్కూళ్లల్లో కొరత లేకుండా సబ్జెక్టు టీచర్లను ఏర్పాటు చేశామన్నారు. త్వరగా మెటీరియల్‌ తయారు చేసి పాఠశాలలకు సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. వంద రోజుల అనంత సంకల్పాన్ని షెడ్యూల్‌ ప్రకారంగా హెచ్‌ఎం, టీచర్లు కచ్చితంగా అమలు చేయాలన్నారు. వర్క్‌షాపులో ఏడీ కృష్ణయ్య, పరీక్షల విభాగం అసిస్టెంట్‌ కమిషనర్‌ గోవిందనాయక్‌, డీసీఈబీ సెక్రెటరీ పురుషోత్తం బాబు, హెచ్‌ఎంలు, టీచర్లు పాల్గొన్నారు.

ఇద్దరు సీఐల సస్పెన్షన్‌

అనంతపురం క్రైం: జిల్లాలో ఇద్దరు సీఐలపై వేటు పడింది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న తాడిపత్రి సీఐ హమీద్‌ఖాన్‌తో పాటు బుక్కరాయసముద్రం సీఐ నాగార్జునరెడ్డిని సస్పెండ్‌ చేస్తూ డీఐజీ ఆర్‌ఎన్‌ అమ్మిరెడ్డి శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. చట్టాన్ని అతిక్రమించి వ్యవహరించిన వారు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని డీఐజీ స్పష్టం చేశారు.

చౌకధాన్యపు దుకాణాలపై దాడులు

అనంతపురం క్రైం: ప్రజా పంపిణీ వ్యవస్థ పటిష్టంగా ఉండేలా చర్యలు చేపట్టామని విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఎస్పీ మునిరామయ్య తెలిపారు. శుక్రవారం నగరంలోని పలు కాలనీల్లో చౌకధాన్యపు దుకాణాలపై మెరుపు దాడులు చేశారు. స్టాకుతో పాటు తూకాలు, కార్డుదారులకు పంపిణీ చేస్తున్న విధానాలను పరిశీలించారు. అత్యధిక దుకాణాల్లో ఎక్కువ నిల్వలున్నట్లు గుర్తించారు. ఉన్న నిల్వలను జప్తుచేస్తూ కేసులు నమోదు చేశారు. అధికారుల తనిఖీల సమయంలో రేషన్‌ దుకాణం–2ను సంబంధిత డీలరు తాళం వేసి ఎటో వెళ్లి పోవడంతో అధికారులు ఆ దుకాణంపై కూడా కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. నగరంలో మొత్తం ఆరు దుకాణాల్లో తనిఖీలు చేసి అన్నింటిపై కేసులు నమోదు చేశారు.

Advertisement
Advertisement