‘క్వాలిటీ’లో కలహాల కుంపటి | Sakshi
Sakshi News home page

‘క్వాలిటీ’లో కలహాల కుంపటి

Published Wed, Dec 13 2023 5:08 AM

-

అనంతపురం సిటీ: పంచాయతీరాజ్‌ శాఖ అనుబంధ క్వాలిటీ విభాగంలో పనిచేస్తున్న డివిజనల్‌ స్థాయి అధికారి ఒకరు తన కింది స్థాయి ఉద్యోగులపై జులుం చేస్తుండడం వివాదాస్పదమైంది. తరచూ ఉద్యోగులపై, కాంట్రాక్టర్లపై నోరు పారేసుకుంటుంటే అసహనానికి గురైన ఉద్యోగులు తిరుగుబాటు బావుటా ఎగరేశారు. దీంతో నాపైనే తిరగబడతారా అంటూ ఆవేశంతో ఊగిపోయిన సదరు అధికారి కేకలేస్తూ చెలరేగిపోయారు. ఇదంతా అనంతపురంలోని జిల్లా పరిషత్‌ కార్యాలయ ఆవరణలో ఉన్న పంచాయతీరాజ్‌ శాఖ అనుబంధ క్వాలిటీ విభాగపు కార్యాలయంలో జరిగింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఘటనకు సంబంధించి వివరాలు....

అసలేం జరిగిందంటే..

పీఆర్‌ శాఖకు అనుబంధంగా ఉండే క్వాలిటీ సెల్‌ సబ్‌ డివిజన్‌న కార్యాలయంలో పని చేసే ఓ అధికారికి, అదే విభాగంలోని కింది స్థాయి ఇంజినీర్లకు మధ్య సోమవారం మధ్యాహ్నం మాటామాటా పెరిగింది. సదరు అధికారి తనదైన శైలిలో నోటికొచ్చినట్లు ‘ల’కారాలు అందుకున్నట్లు సమాచారం. దీంతో అసహనానికి గురైన ఉద్యోగులు తాము కూడా కష్టపడి చదివి పైకొచ్చామని, విచక్షణ మరచి మాట్లాడటం సరికాదంటూ ఽధీటుగా చెప్పారు. దీంతో అధికారికి, ఇంజినీర్లకు మధ్య మాటామాటా పెరిగి గొడవ పెద్దదైంది. గట్టిగా వాదించుకోవడం మొదలుపెట్టారు. దీంతో ఏం జరుగుతుందో అర్థం కాక ఇతర కార్యాలయాలకు పనిపై వచ్చిన జనం అక్కడకు చేరుకుని చోద్యం చూశారు. ఈ గొడవ కాస్త ఆ శాఖ ముఖ్య అధికారి దృష్టికి ఇంజినీర్లు తీసుకెళ్తే.. ‘మంచి రోజు చూసుకొని రెస్టారెంట్‌కు పిల్చుకెళ్లండి. అక్కడ పార్టీ ఇచ్చి...ఆయన్ను ప్రసన్నం చేసుకోండి’ అంటూ ఉచిత సలహా ఇచ్చినట్లుగా కింది స్థాయి ఉద్యోగులు వాపోతున్నారు.

చీఫ్‌ ఇంజినీర్‌కు ఫిర్యాదు

చేయాలని నిర్ణయం

బాధిత ఇంజినీర్లు తమ సమస్యను ఇంజినీర్ల అసోసియేషన్‌ ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. తమపై అధికారి వేధింపులు, నోటి దురుసును రెండేళ్లుగా భరిస్తూ వచ్చామని, ఇక తాము భరించలేకపోతున్నామని, ఇక తాడోపేడో తేల్చుకుంటామంటూ ప్రతినిధుల వద్ద వారు వాపోయారు. ఎలాంటి వేధింపులకు గురవుతున్నారో, ఆయన నుంచి ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో లేఖ రూపంలో రాసిస్తే విజయవాడలోని పంచాయతీరాజ్‌ విభాగం క్వాలిటీ సెల్‌ చీఫ్‌ ఇంజినీర్‌ను కలసి అందజేస్తామని యూనియన్‌ ప్రతినిధులు హామీ ఇచ్చినట్లు ఇంజినీర్లు తెలిపారు. ఇదే విషయమై క్వాలిటీ సెల్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ (ఈఈ) మల్లికార్జున మూర్తి వద్ద ప్రస్తావించగా, ‘అబ్బే అవునా! ఎప్పుడు జరిగిందిది!! నా దృష్టికి రాలేదే’ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేయడం గమనార్హం.

పంచాయతీరాజ్‌ క్వాలిటీ విభాగంలో ఓ అధికారి వింత వైఖరి

కింది స్థాయి ఉద్యోగులపై తరచూ నోరు పారేసుకుంటున్న వైనం

తిరగబడిన ఇంజినీర్లు

కేకలతో దద్దరిల్లిన కార్యాలయ పరిసరాలు

చీఫ్‌ ఇంజినీర్‌కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైన ఇంజినీర్లు

Advertisement
Advertisement