Voter : ఓటర్ల జాబితాలో టిడిపి 'అనంత' మాయ | Sakshi
Sakshi News home page

Voter : ఓటర్ల జాబితాలో టిడిపి 'అనంత' మాయ

Published Tue, Dec 19 2023 1:36 AM

TDP plays foul game in Voters list - Sakshi

సాక్షి ప్రతినిధి, అనంతపురం: తెలుగుదేశం పార్టీ నేతల దిగజారుడుతనం మరోసారి బయటపడింది. దొంగే దొంగ దొంగ అని అరిచినట్టు జనంలో నవ్వుల పాలయ్యారు. ఓటర్ల జాబితాలపై ఆరోపణలు గుప్పించి అభాసుపాలైన తీరు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. బతికున్న ఓటర్లనూ మరణించిన వారి జాబితాలో చేర్చారు. రెండు చోట్ల ఓట్లు ఉన్న వారు, నకిలీ ఓటర్లు ఇలా పలు అంశాలపై టీడీపీ నేతలు ఫిర్యాదులు చేశారు. వీటన్నిటిపైనా కలెక్టర్‌ విచారణ జరిపారు. ఇందులో పలు ఫిర్యాదులు తప్పుడువని తేలింది. విచిత్రమేమంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే దొంగ ఓట్ల ప్రక్రియకు శ్రీకారం చుట్టడం.

బతికున్న వారిని చంపేశారు

ఏదో ఒకరకంగా వైఎస్సార్‌సీపీపై బురద జల్లాలనే ఉద్దేశంతో తెలుగుదేశం నేతలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదులు చేశారు. వీటిపై కలెక్టర్‌ జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో విచారణ చేపట్టారు. ఈ విచారణలో తేలిన విషయం ఏమిటంటే.. బతికి ఉన్న 1,522 మంది ఓటర్లను చనిపోయిన వారి జాబితాలో చేర్చారు. తెలుగుదేశం పార్టీకి వీళ్లందరూ ఓటు వేయరనే ఉద్దేశంతోనే ఇలా చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. ఐదు నియోజకవర్గాల్లో 4,726 మందికి రెండు చోట్ల ఓట్లు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. వీటిని పరిశీలిస్తే 3,703 మందికి ఒక చోటే ఓట్లు ఉన్నాయి. 1,021 మంది మాత్రమే డబుల్‌ ఎంట్రీ ఉన్నట్టు తేలింది. ఇలా ప్రతి అంశంలోనూ టీడీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదులు దురుద్దేశంతో కూడుకున్నట్లు తెలుస్తోంది.

ఎన్నికల ముఖ్య అధికారికి నివేదిక

ఐదు నియోజక వర్గాల్లో వివిధ రాజకీయ పార్టీల నుంచి వచ్చిన ఫిర్యాదులపై కలెక్టర్‌.. రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారికి లేఖ రాశారు. ఫారం–7 పేరుతో ఇచ్చిన ఫిర్యాదులన్నిటిపైనా విచారణ జరిపామని నివేదికలో పేర్కొన్నారు. తమ విచారణలో వెలుగులోకి వచ్చిన మృతుల ఓట్లను, డబుల్‌ ఎంట్రీ ఓట్లను తొలగించామని నివేదించారు. వచ్చిన ప్రతి ఫిర్యాదునూ పరిశీలించగా..ఇందులో మచ్చుకు కొన్ని మాత్రమే నిజమని, మిగతావన్నీ సక్రమంగానే ఉన్నట్టు తేలింది.

● ఇదిలా ఉండగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండి, డబుల్‌ ఎంట్రీ, వలస వెళ్లిన ఓటర్లు, మృతిచెందిన ఓటర్లపై ఒక్క ఫిర్యాదూ చేయకపోవడం ఆ పార్టీ నేతల దిగజారుడుతనాన్ని బయటపెట్టిందని వైఎస్సార్‌సీపీ నాయకులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. తాము ఇచ్చిన ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలని గతంలోనే ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి హైకోర్టును ఆశ్రయించగా, తాజాగా ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

సార్‌... వీరి పేర్లు ఓటరు జాబితా నుంచి తీసేయండి

బొమ్మనహాళ్‌కు చెందిన టీడీపీ సానుభూతిపరురాలు కురుబ తిప్పమ్మకు కె.రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి తో 35 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. అప్పట్లోనే ఊరు వదిలి కర్ణాటక రాష్ట్రం పావగడలో స్థిరపడ్డారు. అయితే ఓటు మాత్రం ఇక్కడే ఉంది. సీరియల్‌ నంబర్‌ 676, పోలింగ్‌ బూత్‌–50లో ఓటర్‌ ఐడీ (ఎస్‌ఎల్‌ఏ1359935) నంబర్‌తో నమోదైంది. ఈ ఓటు తొలగించాలని బీఎల్‌ఓ ఫారం–7 క్లెయిమ్‌ నమోదు చేసింది. ఇలాంటి సెటిలర్‌ ఓట్లు తొలగిపోకుండా టీడీపీ నాయకులు కుట్రలు చేస్తున్నారు.

రాయదుర్గం మండలం బీఎన్‌హళ్లి కి చెందిన టీడీపీ నాయకుడి కుమారుడు నగేష్‌ అనే వ్యక్తి పోలింగ్‌ బూత్‌ –237లో ఎస్‌ఎల్‌ఏ1016344 అనే ఓటరు ఐడీతో తండ్రి పేరు మార్చి నమోదు చేసుకున్నాడు. అలాగే 238 బూత్‌లోనూ ఎస్‌ఎల్‌ఏ 1181866 అనే ఓటరు ఐడీతో బి. తిమ్మప్ప అనే తండ్రి పేరుతో ఓటు కలిగి ఉన్నాడు. బీఎల్‌ఓ గుర్తించినా ఫారం–7 క్లెయిమ్‌ నేటికీ పెండింగ్‌లో ఉంది.

ఇలా ఒక్క రాయదుర్గం నియోజకవర్గంలోనే డబుల్‌ ఎంట్రీలు, మృతులు, వలసదారులు 32 వేల మందికి పైగా ఉన్నట్టు వైఎస్సార్‌సీపీ నాయకులు గుర్తించి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.

1/3

2/3

3/3

Advertisement
Advertisement