కాన్వొకేషన్‌ పట్టా పొందేదెట్టా..? | Sakshi
Sakshi News home page

కాన్వొకేషన్‌ పట్టా పొందేదెట్టా..?

Published Tue, Dec 19 2023 1:38 AM

- - Sakshi

అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం 22వ స్నాతకోత్సవంలో పట్టా అందుకోవాలనుకున్న విద్యార్థులపై కాన్వొకేషన్‌ రుసుం పెంపు గుదిబండగా మారింది. 21వ స్నాతకోత్సవంలో రూ.2,500 ఉండే పట్టా (ఇన్‌ అడ్వాన్స్‌డ్‌) ఫీజు తాజాగా రూ.3,500కు పెంచింది. ఒకేసారి రూ.1000 ఫీజు పెంచడం భారంగా పరిణమించింది. 21వ స్నాతకోత్సవ రుసుం 2023 జూలై 20 వరకు ఉంది. ఈ స్నాతకోత్సవానికి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు నేరుగా వారి ఇంటికే పట్టాలు పంపుతారు. తాజాగా ఉత్తీర్ణత చెందిన వారు ఇన్‌అడ్వాన్స్‌డ్‌ కింద స్నాతకోత్సవానికి దరఖాస్తు చేసుకుంటారు. 22వ స్నాతకోత్సవం వరకు నిరీక్షించకుండా ముందుగానే డిగ్రీలు తీసుకుంటారు. ఉన్నత కోర్సుల్లో అడ్మిషన్లు రావడం, ప్రైవేట్‌ ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు పొందడం తదితర అంశాల నేపథ్యంలో ఇన్‌అడ్వాన్స్‌డ్‌ కింద దరఖాస్తుకు ఆసక్తి చూపుతుంటారు. వాస్తవానికి ప్రతి స్నాతకోత్సవానికీ 10 శాతం మేర ఫీజు పెంచుకోవచ్చన్న నిబంధన ఉన్నప్పటికీ దానిని విస్మరించి ఏకంగా రూ.1000 మేర ఫీజు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం విమర్శలకు దారితీస్తోంది. దూరవిద్య డిగ్రీ పట్టాకు రూ.4200, దూరవిద్య పీజీ ఇన్‌అడ్వాన్స్‌డ్‌ కింద రూ. 5400 మేర చెల్లించాల్సి ఉంది. 2023లో ఇన్‌ అడ్వాన్స్‌డ్‌ కింద ఏడు వేల మందికి పైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకోనున్నారు. వీరిందరికీ ఆర్థికభారం కానుంది. ఫీజులు తగ్గించాలని విద్యార్థులు కోరుతున్నారు.

ఫీజు భారీగా పెంపు

నిబంధనలు విస్మరించిన ఎస్కేయూ

ఏకంగా రూ.వెయ్యి పెంపుదల

విద్యార్థులపై పెను భారం

ఇక్కడే ఫీజు తక్కువ!

శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నిర్ధారించిన స్నాతకోత్సవ రుసుం రాష్ట్రంలోని ఇతర వర్సిటీల ఫీజుల కంటే తక్కువగా ఉంది. గతంలో ఎన్నడూ పెద్దగా పెంచలేదు. విద్యార్థులకు అందించే జవాబు పత్రాల రేటు విపరీతంగా పెరిగిపోయింది. పరీక్ష విభాగం అంటే పరీక్ష నిర్వహించినప్పటి నుంచి ఫలితాలు ప్రకటించేంత వరకు పెద్ద మొత్తంలో నిధులు వినియోగించాల్సి వస్తోంది. ఈ క్రమంలో ఇతర యూనివర్సిటీలు నిర్ధారించిన మేరకే ఫీజులు నిర్దేశించాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకున్నాం.

– ప్రొఫెసర్‌ జీవీ రమణ, డైరెక్టర్‌ ఆఫ్‌

ఎవాల్యుయేషన్స్‌, ఎస్కేయూనివర్సిటీ

Advertisement
Advertisement