తెల్లారిన బతుకులు | Sakshi
Sakshi News home page

తెల్లారిన బతుకులు

Published Sun, Dec 24 2023 1:40 AM

సంఘటన స్థలంలో మృతదేహాలు - Sakshi

బాధితులను ఆదుకుంటాం

కల్లూరు శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన చిన్న తిప్పయ్య, శ్రీరాములు, నాగార్జున, శ్రీనివాసులు కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని గుంతకల్లు ఎమ్మెల్యే వై.వెంకట్రామిరెడ్డి తెలిపారు. పామిడి ప్రభుత్వాస్పత్రిలో నలుగురి మృతదేహాలను ఎమ్మెల్యే పరిశీలించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ప్రమాదంపై సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆయన విచారం వ్యక్తం చేశారన్నారు. బాధిత కుటుంబ సభ్యులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారన్నారు. మృతి చెందిన వారికి తనవంతుగా ఒక్కో కుటుంబానికి రూ.50వేలు చొప్పున ఎమ్మెల్యే వైవీఆర్‌ ఆర్థికసాయం అందించారు. ఎమ్మెల్యే వెంట వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకుడు శ్రీనివాస్‌రెడ్డి, మండల కన్వీనర్‌ గోవర్ధన్‌రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు ప్రవీణ్‌కుమార్‌ యాదవ్‌, నాయకులు రంగస్వామి, మాజీ సర్పంచ్‌ తిమ్మారెడ్డి, కాశీనాథ్‌రెడ్డి, లక్ష్మీకాంతరెడ్డి, ఎస్సీ సెల్‌ మల్లికార్జున, శాలివాహన సంఘం నేత నాగేంద్ర, పామిడి పట్టణ కన్వీనర్‌ జోజోడే కుమార్‌, గుత్తి మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్‌ చెన్నకేశవరెడ్డి పాల్గొన్నారు.

గార్లదిన్నె/గుత్తి రూరల్‌/ పామిడి: చిమ్మ చీకటి.. ఇంతలో భారీ శబ్దం. బస్సులోంచి హాహాకారాలు. బస్సు ముందు భాగంలో ట్రాక్టర్‌ బోల్తాపడి ఉంది. నాలుగు మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. గార్లదిన్నె మండలం కల్లూరు వద్ద శనివారం తెల్లవారుజామున బియ్యం లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ను వెనుకనుంచి ప్రైవేట్‌ ఓల్వో బస్సు ఢీకొంది. ప్రమాదంలో గుత్తి మండలం మాముడూరుకు చెందిన రైతులు కండ్లపల్లి చిన్న తిప్పయ్య(47), పసులోరు శ్రీరాములు (42), కండ్లపల్లి నాగార్జున (32), మామిళ్లపల్లి శ్రీనివాసులు (27) మృతి చెందారు. ఎడమ వైపునకు ఎగిరి ముళ్ల పొదల్లోకి పడ్డ మరో రైతు పసులోరు హరికృష్ణ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. మృతులు, గాయపడిన వ్యక్తి అందరూ సమీప బంధువులే.

మిన్నంటిన రోదనలు..

రోడ్డు ప్రమాద వార్త తెలియగానే మాముడూరు గ్రామం ఉలిక్కిపడింది. వైకుంఠ ఏకాదశి కావడంతో అందరూ తెల్లవారుజామునే లేచారు. సమీప బంధువులైన నలుగురు రైతుల మరణ వార్త కలచివేసింది. కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు కల్లూరు సమీపంలోని ప్రమాద స్థలికి భారీ ఎత్తున చేరుకున్నారు. చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలను చూసి కంట తడిపెట్టారు. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్‌కు శాపనార్థాలు పెట్టారు. జాతీయరహదారిపై ఆందోళనకు దిగారు. మృతి చెందిన వారికి బస్సు యజమాని రూ.20 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని, అంతవరకూ మృతదేహాలను ఇక్కడి నుంచి పక్కకు తీసేదే లేదని డిమాండ్‌ చేశారు. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడటంతో శింగనమల సీఐ అస్రార్‌బాషా, పామిడి సీఐ రాజశేఖరరెడ్డి, గార్లదిన్నె ఎస్‌ఐ సాగర్‌ సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆందోళనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఒప్పుకోలేదు. దాదాపు గంటపాటు ఆందోళన కొనసాగింది. అనంతరం మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం పామిడి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని గార్లదిన్నె తహసీల్దార్‌ ఉషారాణి తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలు స్వగ్రామానికి చేరుకోగానే విషాదం అలుముకుంది. సాయంత్రం నలుగురి అంత్యక్రియలూ అశ్రునయనాల మధ్య పూర్తి చేశారు.

మృతుల కుటుంబ నేపథ్యం..

● రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారందరూ వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నవారే. మృతుల్లో రైతు చిన్న తిప్పయ్యకు భార్య లక్ష్మీదేవి, కుమారులు అనిల్‌, పురుషోత్తం ఉన్నారు. తిప్పయ్య మరణ వార్త తెలియగానే కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు.

● మరో మృతుడు శ్రీరాములుకు భార్య లక్ష్మి, కుమార్తెలు సునీత, ఇందు ఉన్నారు. కుటుంబ యజమాని మృతితో పిల్లలు దిక్కులేని వారయ్యారని లక్ష్మి రోదించింది.

● ఇంకో మృతుడు నాగార్జునకు భార్య జయలక్ష్మి, కుమారుడు అభినయ్‌, కుమార్తె మన్విత ఉన్నారు.

● శ్రీనివాసులుకు భార్య మౌనిక, నాలుగు నెలల కుమారుడు ఉన్నారు. దేవుడా మేమేం పాపం చేశామయ్యా.. ఇంత పని చేశావు. మేమెలా బతకాలి దేవుడా అంటూ మౌనిక కన్నీటి పర్యంతమయ్యింది.

ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యం మిల్లులో ఆడించుకుని ఇంటికి వస్తున్న రైతులపై మృత్యువు పంజా విసిరింది. మరో గంటలో ఇంటికి చేరుకోవాల్సిన వారిని రోడ్డు ప్రమాదం కబళించింది. రెప్పపాటులో ఈ ఘోరం జరిగి పోయింది. నలుగురు రైతులు బస్సు చక్రాల కిందపడి ప్రాణం విడిచారు. మరొక రైతు గాయాలతో బయటపడ్డాడు. మృతులందరూ సమీప బంధువులే. కుటుంబ సభ్యులు ప్రమాద స్థలికి చేరుకుని దేవుడా ఎంత పనిచేశావయ్యా అంటూ రోదించారు. మేమెలా బతకాలయ్యా అంటూ గుండెలవిసేలా రోదించారు. వారిని ఓదార్చడం ఎవరితరమూ కాలేదు.

ట్రాక్టర్‌ను ఢీకొన్న ప్రైవేట్‌ బస్సు

నలుగురు రైతుల దుర్మరణం

మిన్నంటిన బంధువుల రోదనలు

జాతీయరహదారిపై ఆందోళన

మాముడూరులో విషాద ఛాయలు

రోడ్డు ప్రమాదం బాధాకరం

అనంతపురం అర్బన్‌: కల్లూరు వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదం బాధాకరమని కలెక్టర్‌ గౌతమి అన్నారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి ఆదుకుంటుందని ఒక ప్రకటనలో తెలిపారు. మృతి చెందిన వారిలో నాగార్జున, శ్రీరాములు, తిప్పయ్య వైఎస్సార్‌ బీమాలో నమోదైనందున వీరికి రూ.5లక్షల బీమా వర్తిస్తుందని తెలిపారు. మరో మృతుడు శ్రీనివాసులు వైఎస్సార్‌ బీమాలో నమోదు కానందున ప్రభుత్వం నుంచి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు.

పామిడి ప్రభుత్వాస్పత్రి వద్ద రోదిస్తున్న మృతుల బంధువులు
1/8

పామిడి ప్రభుత్వాస్పత్రి వద్ద రోదిస్తున్న మృతుల బంధువులు

నుజ్జునుజ్జయిన ట్రాక్టర్‌
2/8

నుజ్జునుజ్జయిన ట్రాక్టర్‌

ప్రమాదానికి కారణమైన ప్రైవేట్‌ ఓల్వో బస్సు
3/8

ప్రమాదానికి కారణమైన ప్రైవేట్‌ ఓల్వో బస్సు

మృతుల కుటుంబాలకు ఆర్థికసాయం 
అందిస్తున్న ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డి
4/8

మృతుల కుటుంబాలకు ఆర్థికసాయం అందిస్తున్న ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డి

5/8

6/8

7/8

8/8

Advertisement
Advertisement