అంతా రెప్పపాటులో జరిగిపోయింది | Sakshi
Sakshi News home page

అంతా రెప్పపాటులో జరిగిపోయింది

Published Sun, Dec 24 2023 1:40 AM

- - Sakshi

ప్రత్యక్ష సాక్షి పసులోరు హరికృష్ణ

కల్లూరు మిల్లులో వడ్లు ఆడించుకొని ట్రాక్టర్‌లో బియ్యం లోడ్‌ చేసుకొని మాముడూరుకు వస్తుండగా రెప్పపాటులో ప్రమాదం జరిగిందని ఆ ప్రమాదంలో మృత్యుంజయుడిలా బయటపడ్డ ప్రత్యక్ష సాక్షి పసులోరు హరికృష్ణ చెప్పారు. ‘మిల్లులో వడ్లు ఆడించడం అర్ధరాత్రి పూర్తి కావడంతో శనివారం తెల్లవారుజామున ట్రాక్టర్‌లో బియ్యం బస్తాలు లోడ్‌ చేసుకొని నేను, చిన్న తిప్పయ్య, శ్రీరాములు, నాగార్జున బస్తాలపై కూర్చోగా.. శ్రీనివాసులు ట్రాక్టర్‌ నడుపుతున్నాడు. అయితే పామిడి పెన్నా బ్రిడ్జి వద్దకు రాగానే ప్రైవేట్‌ బస్సు వెనుక నుంచి ఒక్క సారిగా వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ట్రాక్టర్‌ ట్రాలీ బోల్తా పడింది. నేను రోడ్డుకు ఎడమ వైపు పడగా.. శ్రీనివాసులు, చిన్న తిప్పయ్య, శ్రీరాములు, నాగార్జున కుడి వైపు పడ్డారు. చిమ్మ చీకటిలో ఏం జరుగుతోందో నాకు అర్థం కాలేదు. అంత రెప్పపాటులో జరిగిపోయింది. రోడ్డు పక్కన కంపచెట్లలో పడ్డ నేను మెల్లిగా తేరుకొని వచ్చి చూడగా బస్సులో ప్రయాణికులు హాహాకారాలు చేస్తున్నారు. డ్రైవర్‌ బస్సులో ఇరుక్కొని బిగ్గరగా అరుస్తున్నాడు. కొద్దిసేపు ఏం జరిగిందో తెలియలేదు. 10 నిమిషాల తరువాత అటుగా వెళ్లేవారు, సమీపంలో రైస్‌ మిల్లుల వద్ద ఉన్న వారు వచ్చి మాకు సహాయం చేశారు. మా వాళ్ల కోసం నేను చుట్టుపక్కలంతా గాలించినా కనపడలేదు. బస్సు కింద పడి వారంతా మరణించారని అక్కడ ఉన్న వారు చెప్పారు. ఎలా జరిగిందని అడిగితే బస్సు బ్రేక్‌ ఫెయిలై ట్రాక్టర్‌ని వెనుక నుంచి ఢీకొట్టిందని కొందరు చెప్పారు. అంతలోనే 108 అంబులెన్స్‌ రావడంతో నన్ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అంతా క్షణాల్లోనే జరిగిపోయింది’అంటూ హరికృష్ణ కంటతడి పెట్టాడు.

Advertisement
Advertisement