బేరం కుదిరితే కాసుల గలగల | Sakshi
Sakshi News home page

బేరం కుదిరితే కాసుల గలగల

Published Mon, Dec 25 2023 1:50 AM

- - Sakshi

● పుట్టపర్తికి చెందిన ఐటీ ఉద్యోగి ప్రవీణ్‌ బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. వాట్సాప్‌ స్టేటస్‌ ద్వారా పాత వాహనాల విక్రయాల వివరాలు తెలియజేస్తుంటాడు. సంప్రదించిన వారికి లొకేషన్‌ తదితర వివరాలు అందజేస్తాడు. కారు బేరం తెగిన తర్వాత మొత్తం ఖరీదులో అమ్మిన వారు ఒక శాతం, కొన్న వారు ఒక శాతం కమీషన్‌ రూపంలో ఇస్తారు. ఇలా నెలకు సగటున రూ.50 వేలు ఆదాయం పొందుతున్నాడు.

● అనంతపురం నగరానికి చెందిన మహబూబ్‌బాషా పాత వాహనాల ఏజెన్సీ నిర్వహిస్తున్నాడు. ప్రతి నెలా సగటున 10 వాహనాలు విక్రయిస్తున్నాడు. వాహనం కొన్న, అమ్మిన వారి నుంచి రెండు శాతం కమీషన్‌ తీసుకుంటాడు. పెద్ద పెద్ద వాహనాలు అమ్ముడుపోతే అధికం ఆదాయం ఉంటుంది. షాపు అద్దె, కూలీల ఖర్చు పోనూ నెలకు సగటున రూ.70 వేల నుంచి రూ.లక్ష గడిస్తున్నాడు.

సాక్షి, పుట్టపర్తి: కరోనా మహమ్మారి అడుగు పెట్టిన తర్వాత చాలా మంది ప్రజావాహనాల ద్వారా రాకపోకలు సాగించడం మానేశారు. సొంత వాహనాల్లో ప్రయాణించడం ప్రారంభించారు. డిమాండ్‌కు అనుగుణంగా కొత్త వాహనాల రేట్లు భారీగా పెరిగిపోయాయి. దీంతో పాత వాహనాలు కొనేందుకు మొగ్గు చూపుతున్నారు. పట్టణాల నుంచి పల్లెల వరకూ ఈ ఒరవడి కనిపిస్తోంది. జిల్లాలోని హిందూపురం రవాణా కార్యాలయంలో సగటున రోజుకు 37 కొత్త వాహనాలు రిజిస్ట్రేషన్‌ అవుతున్నాయి.

కమీషన్లతో లాభాలు

అమ్మేవారు.. కొనేవారికి మధ్య వారధిలా కన్సల్టెన్సీ నిర్వాహకులు వ్యవహరిస్తున్నారు. వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని కన్సల్టెన్సీ దుకాణాలు ఏర్పాటు చేసి మరీ అమ్మకాలు, కొనుగోళ్లు చేస్తున్నారు. రూ.లక్షకు కొంత మేర కమీషన్‌ రూపంలో తీసుకుంటూ లాభాలు ఆర్జిస్తున్నారు. వ్యయ ప్రయాసలు లేకుండా పలు వాహనాలను ఒకే వేదికపై చూసే అవకాశం లభిస్తుండడంతో పేద, మధ్య తరగతి ప్రజలు కన్సల్టెన్సీల వైపు ఆసక్తి చూపుతున్నారు.

సరసమైన ధరలకే

దేశ రాజధాని ఢిల్లీలో పదేళ్లు పైబడిన వాహనాలను తిప్పేందుకు అనుమతుల్లేవు. ఫలితంగా అక్కడి నుంచి దక్షిణ భారతదేశానికి తరలిస్తున్నారు. ౖపైపె మెరుగులు దిద్ది రిజిస్ట్రేషన్లు మార్చుకుని విక్రయాలు సాగిస్తున్నారు. మిగతా రాష్ట్రాల వాహనాలతో పోలిస్తే ఢిల్లీ రిజిస్ట్రేషన్‌ వాహనాలు సరసమైన ధరలకే లభిస్తున్నట్లు తెలిసింది. పొరుగు రాష్ట్రం కర్ణాటక రిజిస్ట్రేషన్‌ వాహనాలపై కూడా చాలామందికి మక్కువ చూపుతున్నారు.

ఐటీ ఉద్యోగులు సైతం..

పాత వాహనాల క్రయ విక్రయాలపై పలు రంగాలకు చెందిన ఉద్యోగులు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. నిత్యం కంప్యూటర్‌, ల్యాప్‌టాప్‌ ముందు ఉండే ఐటీ ఉద్యోగులు సైతం సమయం దొరికినప్పుడల్లా దృష్టి సారిస్తున్నారు. వాట్సాప్‌ గ్రూపులు ఏర్పాటు చేసుకుని వాహనాల వివరాలు పోస్టు చేస్తున్నారు. కావాల్సిన వ్యక్తులు సంప్రదించి కొంత పర్సెంటేజీ కమీషన్‌ రూపంలో ఇస్తే వాహనానికి సంబంధించి లొకేషన్‌ తదితర వివరాలు అందజేస్తున్నారు. వాహనం బేరం కుదిరాక డబ్బు వసూలు చేస్తున్నారు. ఇంట్లో ఉండి సులభంగా ఉపాధి పొందుతున్నారు.

ఆస్పత్రి నిమిత్తమే ఎక్కువ

మోడల్‌ (ఏ సంవత్సరంలో రిజిస్ట్రేషన్‌) ఆధారంగా రూ.లక్ష నుంచి కార్లు అందుబాటులో ఉన్నాయి. పట్టణాల నుంచి పల్లెల వరకు పాత వాహనాల సంస్కృతి వ్యాపించింది. ఏ గ్రామానికి వెళ్లినా.. ఏదో కారు కనిపిస్తుంది. కుటుంబ సభ్యుల వినియోగం నిమిత్తం ఇటీవల కొన్నామని చెబుతున్నారు. చాలామంది ఆస్పత్రికి వెళ్లేందుకే సొంత వాహనాలు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే రోగులు ఉన్న ఇళ్లలో ఎక్కువగా కార్లు కనిపిస్తున్నాయి. ఉన్నఫలంగా ఆస్పత్రికి వెళ్లాల్సి వస్తే.. ఇబ్బంది ఉండకూడదనే క్రమంలో వాహనం కొనుగోలు చేసినట్లు వివరిస్తున్నారు.

అన్నీ సరిచూసుకోవాలి

పాత వాహనాలు కొనే ముందు సంబంధిత షో రూం వెళ్లి రికార్డులు పరిశీలించాలి. వాహనం కండీషన్‌తో పాటు కేసులు ఉన్నాయా అనే వివరాలు సరి చూసుకోవాలి. ఇతర రాష్ట్రాల నుంచి కొన్నా, ఒకరి నుంచి మరొకరికి చేతులు మారినా, కొత్తగా కొన్న వారు తమ పేరిట రిజిస్ట్రేషన్‌ వీలైనంత త్వరగా చేసుకోవాలి.

– ఎన్‌ఎన్‌ కరుణసాగర్‌రెడ్డి, జిల్లా రవాణా అధికారి, హిందూపురం

రూ.70 వేలకే కారు కొన్నా

నేను ఇటీవల కదిరిలో సెకండ్‌ హ్యాండ్‌ కారు కొన్నా. నేర్చుకోవడానికి బాగా ఉపయోగపడుతోంది. తక్కువ ధరకే అంటే రూ.70 వేలకు కొన్నాను. కొత్త వాహనం కొనాలంటే కనీసం రూ.5 లక్షలు పైగా వెచ్చించాలి. పాత వాహనాలు మధ్య తరగతి వారికి బాగా ఉపయోగపడుతున్నాయి. – సుబ్బిరెడ్డి, కదిరి

పెరిగిన వాహన కన్సల్టెన్సీ సేవలు

క్రయవిక్రయాలతో మధ్యవర్తులకు లాభాలు

1/2

2/2

Advertisement

తప్పక చదవండి

Advertisement