Sakshi News home page

అమ్మా నీవు లేని జీవితం వృథా...

Published Tue, Dec 26 2023 1:50 AM

- - Sakshi

అమ్మ అంటే ఓ అనుబంధం... ఓ ఆత్మీయత. బిడ్డ అవసరాలను అందరికంటే ముందే అమ్మ పసిగడుతుంది. తన బిడ్డ విజయాలు సాధించినప్పుడు ఆనంద పరవశురాలవుతుంది. బాధల్లో ఉన్నప్పుడు తల్లడిల్లుతుంది. అలాంటి అమ్మ శాశ్వతంగా దూరమైపోతే.. తట్టుకోలేక పోయింది ఓ యువ హృదయం. అమ్మా నీవు లేని జీవితం వృథా... నీ వెంటే నేనూ అంటూ అర్ధంతరంగా తనువు చాలించింది.

అనంతపురం క్రైం: అనంతపురంలోని హౌసింగ్‌ బోర్డులో నివాసముంటున్న సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ప్రేమ్‌కుమార్‌ (45) ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... ఆర్టీసీ ఉద్యోగి రంగన్న, విజయలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు కాగా, మొదటి వాడు ప్రేమ్‌కుమార్‌. రంగన్న మరణానంతరం ఇంటి బాధ్యతలన్నీ ప్రేమ్‌కుమార్‌ తీసుకున్నారు. పెళ్లి చేసుకుంటే కుటంబ బాధ్యతను విస్మరిస్తానన్న భయంతో పెళ్లి ఊసెత్తకుండా తమ్ముడిని ఉన్నత చదువులకు ప్రోత్సహించి వివాహం చేశారు. ప్రస్తుతం తమ్ముడు ఆడిటర్‌గా మారి రామ్‌నగర్‌లో భార్యాపిల్లలతో జీవిస్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రేమ్‌కుమార్‌కు 2011లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం రావడంతో బెంగళూరుకు చేరుకున్నారు. అయితే కరోనా నేపథ్యంలో వర్క్‌ఫ్రం హోం కావడంతో సొంతింటిలోనే తల్లి, అమ్మమ్మతో కలసి ఉంటూ విధులు నిర్వర్తిస్తున్నారు.

మూడు రోజుల క్రితం తల్లి కన్నుమూత
మూడు రోజుల క్రితం తల్లి విజయలక్ష్మి ఆరోగ్యం క్షీణించి మృతి చెందింది. బంధువులు, కుటుంబ సభ్యులు అందరూ వచ్చి కార్యక్రమాలు పూర్తి చేసుకు ని వెళ్లారు. ఇంట్లో అమ్మమ్మ, ప్రేమ్‌కుమార్‌ మాత్రమే మిగిలారు. తల్లి చనిపోయిన క్షణంలోనే ప్రేమ్‌కుమార్‌ మానసికంగా కుదేలయ్యాడు. ఆమె చూపించిన ప్రేమ తరచూ కళ్ల ముందు కదులుతూ ఉంటే మూడు రోజులుగా కన్నీరు ఆగలేదు. ఎవరితోనూ మాట్లాడకుండా మౌనంగా తనలోనే రోదిస్తూ వచ్చాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి అమ్మమ్మ భోజనానికి పిలవడంతో తనకు ఆకలిగా లేదని చెప్పి బెడ్‌రూంలోకి వెళ్లాడు. తల్లితో తనకున్న అనుబంధాన్ని వివరిస్తూ రాత్రంతా ఓ లేఖలో పొందుపరిచాడు. తన జీతం, బ్యాంకు లావాదేవీల వివరాలు, ఖాతాలకు చెందిన పాస్ట్‌వర్డ్‌లు, పీపీఎఫ్‌, బంగారు నగల వివరాలు తదితరాలను వివరంగా రాసి ఒక బాక్సులో ఉంచి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

అమ్మలేని జీవితం వృథా
సోమవారం ఉదయం పొద్దెక్కినా ప్రేమ్‌కుమార్‌ బెడ్‌ రూం నుంచి బయటకు రాకపోవడంతో అమ్మమ్మ వెళ్లి తలుపు తట్టింది. ఎలాంటి స్పందన లేకపోవడంతో చుట్టుపక్కల వారి సాయం కోరింది. దీంతో ఇరుగుపొరుగు వారు అక్కడకు చేరుకుని పరిశీలిస్తే లోపల ఫ్యాన్‌కు ఉరి చేసుకుని విగతజీవిగా వేలాడుతున్న ప్రేమ్‌కుమార్‌ కనిపించాడు. సమాచారం అందుకున్న వన్‌టౌన్‌ సీఐ రెడ్డప్ప అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఆత్మహత్యకు ముందు ప్రేమ్‌కుమార్‌ రాసిపెట్టిన లేఖ స్వాధీనం చేసుకున్నారు. అందులో ‘అమ్మ లేకుండా నేను ఉండలేకపోతున్నా. అమ్మ వద్దకే వెళుతున్నా’ అంటూ రాసి ఉంది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువుల ఆవేదనకు అంతులేకుండా పోయింది. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

What’s your opinion

Advertisement