గుడిలో గంటను ఎందుకు కొడతారు? | Sakshi
Sakshi News home page

గుడిలో గంటను ఎందుకు కొడతారు?

Published Fri, Mar 22 2024 9:50 AM

ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం  - Sakshi

కదిరి: గుడిలో గంటకు ఎంతో ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా దేవాలయానికి వెళ్లినపుడు అక్కడ గంటను కొట్టిన తర్వాతనే దేవుడి దర్శించుకుని వస్తుంటారు. ఆలయం చిన్నదైనా, పెద్దదైనా గంట మాత్రం తప్పకుండా ఏర్పాటు చేస్తారు. అయితే అసలు గంటను ఎందుకు కొడతారు? గంట కొట్టడం వల్ల ప్రయోజనమేంటి అనే సందేహం అందరికీ కలుగుతుంది. ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహోత్సవాల సందర్భంగా గంట ప్రాముఖ్యత, ఆలయ నియమాలను ప్రధాన అర్చకుడు నరసింహాచార్యలు వెల్లడించారు. అవేంటో చూద్దాం....

● ఆలయంలోకే కాదు.. ఆలయ ప్రాంగణంలోకి కూడా పాదరక్షలతో ప్రవేశించకూడదు.

● దేవాలయంలోకి ప్రవేశించి భక్తితో రోదించకూడదు. రోధిస్తూ దేవుని ప్రార్థించకూడదు.

● గుడికి వెళ్లేటప్పుడు సంప్రదాయ దుస్తులనే ధరించాలి.

●రిక్త హస్తాలతో దేవుడి చెంతకు వెళ్లడం మంచిది కాదు.

● గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసిన తర్వాత గుడిలోకి వెళ్లి స్వామిని దర్శించుకోవాలి.

● గడియారపు ముల్లు తిరిగే విధంగా ప్రదక్షిణ చేయాలి. వ్యతిరేక దిశలో చేయకూడదు.

● గుడి ప్రదక్షిణలు చేసేటప్పుడు గర్భగుడి వెనుక భాగాన గోడకు తల ఆనించడం.. చేతులతో తాకడం మంచిది కాదు. అక్కడ రాక్షసులు ఉంటారు. వారిని నిద్రలేపి వెంట తీసుకెళ్లిన వారవుతారు. గుడి చుట్టూ ఏర్పాటు చేసిన బలి పీఠాలను కూడా తాకరాదు.

● స్వామిని దర్శించుకునేటప్పుడు దేవుడికి ఎదురుగా నిల్చోకూడదు. ఎడమ లేదా కుడి వైపున నిల్చొని దర్శించుకోవాలి. ఎందుకంటే ఆలయంలో విగ్రహాన్ని ప్రతిష్టించేటప్పుడు ఎన్నో శక్తులను ఆపాదించి ఉంటారు. ఆ శక్తి తరంగాలు నేరుగా మన దేహంపై ప్రభావం చూపుతాయి.

● స్వామి దర్శనానంతరం కాసేపు ప్రశాంతంగా కూర్చోవాలి. మానసిక ప్రశాంతత లభిస్తుంది.

● దేవాలయాలు శక్తికి కేంద్రకాలు. మంత్రోచ్చారణల్లోని శబ్ధ తరంగాల వల్ల మనసు చెడు ఆలోచనల వైపు మరలదు. సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆలయంలోని దేవుడి మహిమ, మంత్రోఛ్చారణలు మాత్రమే కాదు.. ప్రత్యేకమైన నిర్మాణశైలి కూడా మనశ్శాంతికి కారణమవుతాయి.

●ప్రదక్షిణలు చేసేటప్పుడు తప్పా.. ఇంకెప్పుడూ దేవాలయం, ధ్వజస్తంభం, ప్రాకారం నీడను దాటకూడదు.

● చంచలమైన మనస్సుతో స్వామిని దర్శించరాదు. క్యూలైన్‌లో తోటి భక్తులతో, ఆలయ సిబ్బందితో గొడవ పడరాదు.

● దేవాలయంలో మూలవిరాట్‌కు వీపు భాగం చూపిస్తూ కూర్చోరాదు. గర్భగుడి ఎదురుగా సాష్టాంగ నమస్కారం చేయరాదు.

● మొదట ధ్వజ స్తంభాన్ని దర్శించి అనంతరం గుడిలోకి వెళ్లాలి. ఆలయ ప్రాంగణంలో గోమాత ఉంటే పశుగ్రాసం ఇచ్చిన తర్వాతనే దైవ దర్శనానికి వెళ్లాలి.

● ఏ ఆలయంలోనూ మూలవిరాట్‌ను తాకడం మంచిది కాదు.

● వీలున్నప్పుడల్లా గుడికి వెళ్లడం మంచిది. అక్కడ మనకు పాజిటివ్‌ ఎనర్జీ వస్తుంది. గుడిలోకి ప్రవేశించగానే గంట మోగిస్తే ‘స్వామీ..నేను వచ్చాను’ అని చెప్పడం. అంతేకాదు ‘ స్వామీ..నేను రావచ్చా..’ అని అనుమతి తీసుకున్నట్లుగానూ ఉంటుంది. గంట శబ్ధం చెడు శక్తులను దూరం చేసి, శరీరంతో పాటు మనసునూ శుద్ధి చేస్తుంది.

ప్రధాన అర్చకుడు నరసింహాచార్యులు
1/1

ప్రధాన అర్చకుడు నరసింహాచార్యులు

Advertisement
Advertisement