అంతా సిద్ధం! | Sakshi
Sakshi News home page

అంతా సిద్ధం!

Published Fri, Feb 9 2024 4:39 AM

10 thousand applications on first day for Tet 2024: Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)కు విద్యా శాఖ ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది. తొలి రోజు గురువారం దాదాపు 10 వేల దరఖాస్తులు అందాయి. ఈ నెల 27 నుంచి మార్చి 9 వరకు జరగనున్న టెట్‌కు సుమారు 5.50 లక్షల మంది హాజరవుతారని అంచనా. ఆన్‌లైన్‌ విధానంలో జరిగే ఈ పరీక్షకు రాష్ట్రంలో 185 సెంటర్లు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, బరంపురంలలో 22 సెంటర్లు  ఏర్పాటు చేస్తున్నారు.

గతంలో టెట్‌ నిర్వహణలో కొందరు అభ్యర్థులు పరీక్ష కేంద్రాల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చాలా మందికి రాష్ట్రం వెలుపల కూడా సెంటర్లు కేటాయించడంతో పరీక్ష రాయలేకపోయారు. కానీ ఈసారి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పాఠశాల విద్యా శాఖ చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని సెంటర్లలో 12 రోజుల్లో రెండు సెషన్స్‌ కింద స్లాట్లను సిద్ధం చేశారు. రోజుకు 60 వేల మంది చొప్పున 7.20 లక్షల మంది పరీక్ష రాసేలా ఏర్పాట్లు చేశారు. ప్రతి జిల్లాలోని అభ్యర్థులు వారికి దగ్గరలోని సెంటర్‌లో స్లాట్‌ను ఎంచుకుంటే అక్కడే పరీక్ష రాసే అవకాశం లభిస్తుంది.

ఏప్రిల్‌ 14 నాటికి పోస్టింగులు!
సోమవారం డీఎస్సీ–2024 నోటిఫికేషన్‌కు కూడా పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. మార్చి 15 నుంచి 30 వరకు ఆన్‌లైన్‌ పరీక్ష జరుగుతుంది. డీఎస్సీకి కూడా 185 సెంటర్లలో రెండు సెషన్స్‌లో స్లాట్లు సిద్ధం చేసింది. ఫలితాలను ఏప్రిల్‌ 7న ప్రకటించి, తర్వాత వారం రోజుల్లో ఏప్రిల్‌ 14 నాటికి పోస్టింగులు ఇచ్చేయాలన్న లక్ష్యంతో విద్యాశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇప్పటికే జిల్లాల వారీగా పోస్టులను ప్రకటించగా, రిజర్వేషన్ల ప్రక్రియ కూడా పూర్తయింది.

గత పరీక్షల మాదిరిగానే ప్రకటించిన షెడ్యూల్‌ మేరకు టెట్‌తో పాటు డీఎస్సీ కూడా పూర్తిచేసి, ఎలాంటి ఆటంకాలు లేకుండా నియాకమ ప్రక్రియ పూర్తి చేయనుంది. 2019 జూన్‌ నుంచి ప్రభుత్వం ఇచ్చిన పలు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీని నోటిఫికేషన్‌లో పేర్కొన్న షెడ్యూల్‌ ప్రకారమే పూర్తి చేసింది. ఎంతో కాలంగా ఉద్యోగాల కోసం పోరాడుతున్న 1998, 2008 డీఎస్సీ అభ్యర్థులకు కూడా సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం న్యాయం చేసి, మినిమం టైమ్‌ స్కేల్‌తో పోస్టింగ్‌లు ఇచ్చింది. ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో మిగిలిన బ్యాక్‌లాగ్‌ పోస్టులు సైతం భర్తీ చేయడంతో పాటు మొత్తం 14,219 ఉపాధ్యాయ నియామకాలు పూర్తి చేసింది.

ఈ డీఎస్సీ టీచర్లు ఎంతో ప్రత్యేకం 
గతంలో నిర్వహించిన డీఎస్సీల్లో ఎంపికైన వారికి, ఈసారి డీఎస్సీలో ఉద్యోగాలు సాధించే అభ్యర్థులకు ఎంతో తేడా ఉంటుంది. ఈసారి టీచర్లకు జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ – 2020) ప్రకారం శిక్షణ ఇవ్వనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంగ్లిష్‌ మీడియం బోధన, సీబీఎస్‌ఈ, టోఫెల్, ఇంటర్నేషనల్‌ బాకలారియెట్‌ సిలబస్‌ను అమలు చేస్తోంది. ఈ బోధనకు అనుగుణంగా ఈ డీఎస్సీలో టీచర్లుగా ఎంపికైనవారికి ఇంటర్నేషనల్‌ బాకలారియెట్, టెక్నాలజీ వినియోగం, టోఫెల్, టీచింగ్‌ ఎఫిషియనీ్సపై అంతర్జాతీయ స్థాయి శిక్షణ ఇస్తారు. సర్టిఫికెట్లు కూడా ఇస్తారు. గతంలో ఈ తరహా శిక్షణ ఎప్పుడూ ఇవ్వలేదు. ప్రస్తుతం సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు అవసరానికి అనుగుణంగా శిక్షణ ఇవ్వడం తప్ప, ప్రాథమిక స్థాయి నుంచే పూర్తిస్థాయి శిక్షణ లేదు.

టెట్‌ నిబంధనలు సడలింపు
టెట్‌ అభ్యర్థులకు మేలు చేసేలా పాఠశాల విద్యాశాఖ నిబంధనలను సడలించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు టెట్‌ పేపర్‌–2ఏ రాసేందుకు డిగ్రీలో 50 శాతం మార్కులు తప్పనిసరి అన్న నిబంధనను తొలగించి, ఈ మార్కులను 40 శాతానికి తగ్గించింది. దీనివల్ల ఎక్కువ మంది టెట్‌ రాసేందుకు అవకాశం వచ్చింది. ఒకటి నుంచి ఐదో తరగతి బోధనకు ఉద్దేశించిన టెట్‌ పేపర్‌–1 రాసేందుకు ఇంటర్‌లో 50 శాతం మార్కులు, ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో రెండేళ్ల డిప్లొమా లేదా 50 శాతం మార్కులతో ఇంటర్‌/సీనియర్‌ సెకండరీతో పాటు 4 ఏళ్ల బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ డిగ్రీ ఉండాలి. కనీసం 50 శాతం మార్కులతో ఇంటరీ్మడియట్, రెండేళ్ల డిప్లొమా ఇన్‌ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ పూర్తి చేయాలి. లేదా డిగ్రీ తర్వాత రెండేళ్ల డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ చేసిన వారు టెట్‌ పేపర్‌–1 రాసేందుకు అర్హులు. ఎస్సీ ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు 5 శాతం మార్కుల సడలింపునిచ్చిది.

Advertisement
Advertisement